భారత పురుషుల అండర్-19 జట్టు కెప్టెన్ ఆయుశ్ మాత్రే తాజాగా ముగిసిన ఆసియా కప్‌లో దారుణంగా విఫలమై అభిమానులను తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఈ టోర్నీలో సహచరులంతా రాణించినా (పాక్‌తో జరిగిన ఫైనల్ మినహా) మాత్రే ఒక్క మ్యాచ్‌లో కూడా సత్తా చాటలేకపోయాడు. ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 13 సగటున, 112 స్ట్రయిక్‌రేట్‌తో కేవలం 65 పరుగులు మాత్రమే చేశాడు.
ఫైనల్లో పాకిస్తాన్ చేతిలో దారుణ పరాజయం వరకు మాత్రే వ్యక్తిగతంగా విఫలమైనా, జట్టును విజయవంతంగా నడిపించాడన్న తృప్తి ఉండేది. అయితే ఫైనల్లో వ్యక్తిగత వైఫల్యాలను కొనసాగించడంతో పాటు టాస్ విషయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోవడంతో భారత క్రికెట్ అభిమానులకు మాత్రే టార్గెట్ అయ్యాడు. పిచ్‌ను అంచనా వేయడంలో విఫలమైన మాత్రే టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ఎంచుకోవడంతో జట్టు భారీ మూల్యం చెల్లించుకుంది.
బ్యాటింగ్‌కు స్వర్గధామమైన పిచ్‌పై మాత్రే టాస్ గెలిచి బ్యాటింగ్ తీసుకోకుండా బౌలింగ్ ఎంచుకొని ప్రత్యర్దికి భారీ పరుగులు చేసే ఆస్కారమిచ్చాడు. ఆతర్వాత లక్ష్య ఛేదనలో నిర్లక్ష్యమైన షాట్ ఆడి వికెట్ పారేసుకున్నాడు. మాత్రే వికెట్‌తోనే టీమిండియా పతనం మొదలైంది. పాక్ నిర్దేశించిన 348 పరుగుల లక్ష్య ఛేదనలో భారత్ 156 పరుగులకే చాపచుట్టేసి 191 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది.
ఈ ఓటమి తర్వాత టోర్నీ మొత్తంలో వ్యక్తిగతంగా, ఫైనల్లో కెప్టెన్‌గానూ విఫలమైన ఆయుశ్ మాత్రేపై ముప్పేటదాడి మొదలైంది. దాయాది చేతిలో ఘెరంగా ఓడినందుకుగానూ భారత క్రికెట్ అభిమానులు అతన్ని సోషల్‌మీడియా వేదికగా టార్గెట్ చేస్తున్నారు. ఎంతో గొప్ప ఆటగాడు, కెప్టెన్ అవుతాడనుకుంటే పాక్ చేతిలో ఘోరంగా ఓడి భారత్ పరువు తీశాడంటూ అభిమానులు అక్షింతలు వేస్తున్నారు. ఈ ఓటమి మాత్రే కెరీర్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు.
వాస్తవానికి ఆయుశ్ మాత్రే స్థాయి ఇది కాదు. టెక్నికల్‌గా వైభవ్ సూర్యవంశీ లాంటి వారి కంటే చాలా బెటర్ బ్యాటర్. అయినా ఆసియా కప్‌లో మాత్రే ఎందుకో రాణించలేకపోయాడు.
కొద్ది రోజుల ముందు సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో విధ్వంసకర ఇన్నింగ్స్‌లతో పరుగుల వరద పారించిన అతను.. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించాల్సి వచ్చే సరికి తేలిపోయాడు. ముస్తాక్ అలీ టోర్నీలో మాత్రే 6 ఇన్నింగ్స్‌ల్లో 108.33 సగటున, 166.67 స్ట్రయిక్‌రేట్‌తో 325 పరుగులు చేసి రఫ్ఫాడించాడు. ఇందులో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ ఉన్నాయి.
ఆసియా కప్‌కు వచ్చే సరికి మాత్రే ఈ సూపర్ ఫామ్‌ను కొనసాగించలేకపోయాడు. ఇది గమనించిన అభిమానులు రోజుల వ్యవధిలో ఇంత మార్పేంటని అనుకుంటున్నారు. మొత్తంగా ఆసియా కప్‌లో మాత్రే వ్యక్తిగతంగా, కెప్టెన్‌గా విఫలమై కెరీర్‌లో మాయని మచ్చను తెచ్చుకున్నాడు. ఈ వైఫల్యాలు ఈ యువ బ్యాటర్‌పై ఎలా ప్రభావం చూపుతాయో చూడాలి.
ముంబైకి చెందిన 18 ఏళ్ల మాత్రే ఇప్పుడిప్పుడే దేశవాలీ క్రికెట్, ఐపీఎల్‌లో పేరు తెచ్చుకుంటున్నాడు. గత సీజన్‌లోనే ఐపీఎల్ అరంగేట్రం చేసిన మాత్రే సీఎస్‌కే తరఫున మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడి ఆకట్టుకున్నాడు. ఫలితంగా సీఎస్‌కే అతన్ని తదుపరి సీజన్‌కు కూడా రీటైన్ చేసుకుంది.
మాత్రే ఇప్పటివరకు 13 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 660 పరుగులు.. 7 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 2 సెంచరీలు, ఓ హాఫ్ సెంచరీ సాయంతో 458 పరుగులు.. 13 టీ20ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీల సాయంతో 565 పరుగులు చేశాడు.


