బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం దాదాపు ఏడు నెలల తర్వాత ఓ క్రికెట్ మ్యాచ్‌కు ఆతిథ్యమివ్వనుంది. విజయ్ హాజారే ట్రోఫీ 2025-26లో తొమ్మిది లీగ్ మ్యాచ్‌లకు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఉంది. తొలుత ఈ ప్రతిష్టాత్మక మైదానంలో డిసెంబర్ 24న ఆంధ్ర-ఢిల్లీ జట్ల మధ్య మ్యాచ్ జరగనుంది.
ఢిల్లీ జట్టు తరపున విరాట్ కోహ్లి(Virat kohli), రిషబ్ పంత్ స్టార్ ప్లేయర్లు ఆడనున్నారు. అయితే చిన్నస్వామి స్టేడియంలో కోహ్లిని మళ్లీ చూడాలనుకున్న అభిమానులకు తీవ్ర నిరాశ ఎదురైంది. చిన్నస్వామి స్టేడియంలో జరిగే విఎచ్‌టి మ్యాచ్‌లకు ప్రేక్షకులను అనుమతించకూడదని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయించింది.
ఈ మ్యాచ్‌లకు సుమారు 2,000 నుండి 3,000 మంది వరకు అభిమానులను అనుమతించాలని కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ప్రతిపాదించింది. కానీ భద్రతా కారణాల దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. గతంలో జరిగిన విషాద ఘటన దృష్ట్యా సిద్ధరామయ్య సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.
కాగా ఐపీఎల్-2025 విజయోత్సవ వేడుకల సందర్భంగా చిన్నస్వామి స్టేడియం వెలుపుల జరిగిన తొక్కిసలాటలో 11 మంది మరణించిన సంగతి తెలిసిందే. ఈ విషాద ఘటన తర్వాత చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్‌ల నిర్వహణను నిలిపివేశారు.
అయితే ఇటీవలే చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్‌ల నిర్వహణకు కర్ణాటక ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాస్తవానికి ఈ దేశవాళీ వన్డే టోర్నీలోని గ్రూపు-డి మ్యాచ్‌లకు బెంగళూరులోని అలూర్ క్రికెట్ స్టేడియం వేదికగా ఉంది.
కానీ కోహ్లి, పంత్ వంటి స్టార్ ప్లేయర్లు ఆడుతుండడంతో అలూర్ వంటి చిన్న వేదికలో మ్యాచ్‌లు నిర్వహిస్తే భద్రత, లాజిస్టికల్ సవాళ్లు తలెత్తే అవకాశం ఉందని కేసీఎ భావించింది. ఈ క్రమంలోనే గ్రూపు-డి మ్యాచ్‌ల వేదికను అలూర్ నుంచి చిన్నస్వామి స్టేడియంకు మార్చారు.
చదవండి: IND vs NZ: భారత్‌తో వన్డే సిరీస్.. విలియమ్సన్ సంచలన నిర్ణయం!


