
ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందు సంజూ శాంసన్ రాజస్థాన్ రాయల్స్‌ను వీడాలని అనుకుంటున్నట్లు సోషల్‌మీడియా కోడై కూస్తుంది. ఈ ప్రచారం నిజమేనని తాజాగా పరిణామాలు సూచిస్తున్నాయి.
ఏ ఫ్రాంచైజీ అయినా సంజూను ట్రేడింగ్ ద్వారా తీసుకోవాలని అనుకున్నట్లైతే బదులుగా ఇద్దరు ఆటగాళ్లతో పాటు నగదును కూడా ఇవ్వాలని రాయల్స్ మేనేజ్‌మెంట్ డిమాండ్ చేసినట్లు తెలుస్తుంది.
ఈ విషయం ప్రచారంలోకి వచ్చిన తర్వాత రాయల్స్ యాజమాన్యం సంజూను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టమవుతుంది. వాస్తవానికి ఈ డీల్‌ను రాయల్స్ యాజమాన్యం సంజూపై అమితాసక్తి ప్రదర్శిస్తున్న సీఎస్‌కే కోసం తీసుకొచ్చిందట.
సంజూను వారికిస్తే బదులుగా ఓ విదేశీ ప్లేయర్‌ను, ఓ దేశీయ ఆటగాడిని ఇవ్వాలని ప్రతిపాదన పెట్టిందట. ఈ డీల్‌పై సీఎస్‌కే సైతం సానుకూలంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే రాయల్స్ యాజమ్యానం ఎవరిని కోరుకుంటుందనే దానిపై ఆ ఫ్రాంచైజీ తుది నిర్ణయం ఆధారపడి ఉంటుంది.
ఈ ప్రక్రియ పూర్తివడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. సంజూకు రాయల్స్‌తో 2027 సీజన్ వరకు ఒప్పందం ఉంది. వారు రిలీజ్ చేస్తే తప్ప అతను వేరే ఫ్రాంచైజీకి వెళ్లలేడు.
వాస్తవానికి సంజూకు యాజమాన్యంతో చాలా మంది సంబంధాలు ఉన్నాయి. పైగా కోచ్ ద్రవిడ్‌కు సంజూ ప్రియ శిష్యుడు. మరి ఏ విషయంలో వీరి మధ్య అభిప్రాయ భేదాలు వచ్చాయో తెలియడం లేదు.
2025 సీజన్‌కు ముందు మార్పులు చేర్పుల విషయంలో యాజమాన్యానికి-సంజూకు మధ్య గ్యాప్ ఏర్పడినట్లు వినికిడి. ఆ గ్యాప్ సీజన్ పూర్తయ్యే సరికి తారాస్థాయికి చేరింది. మొత్తానికి సంజూ రాయల్స్‌ను వీడాలని గట్టిగా అనుకున్నాడు. ఈ క్రమంలో సీఎస్‌కే అతన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది.
గత ఐపీఎల్ సీజన్ ముగిసాక సీఎస్‌కే సీఈవో, ఆ ఫ్రాంచైజీ హెడ్ కోచ్ సంజూను అమెరికాలో కలిసారని సమాచారం. వారి మధ్య సానుకూల చర్చలు జరిగినట్లు తెలుస్తుంది. ఒకవేళ అన్నీ అనుకున్నట్లు జరిగి సంజూ సీఎస్‌కేకు వస్తే, సాధారణ ఆటగాడిగా కొనసాగుతాడా లేక రుతురాజ్‌ను తప్పించి అతనికి కెప్టెన్సీ అప్పగిస్తారా అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
రుతురాజ్ ఇప్పుడిప్పుడే ధోని అండర్‌లో కెప్టెన్‌గా ఓనమాలు దిద్దుకుంటున్నాడు. ఈ పరిస్థితుల్లో సంజూ కోసం అతన్ని కెప్టెన్సీ త్యాగం చేయమని సీఎస్‌కే మేనేజ్‌మెంట్ ఆడగకపోవచ్చు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
2013లో రాయల్స్‌తోనే ఐపీఎల్ జర్నీ ప్రారంభించిన సంజూ.. మధ్యలో రెండేళ్లు మినహా ఐపీఎల్ కెరీర్ మొత్తం ఆ ఫ్రాంచైజీతోనే కొనసాగాడు. 2019, 2020 సీజన్లలో అదిరిపోయే ప్రదర్శనలు చేసిన అతను.. 2021 సీజన్‌లో రాయల్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సంజూ నేతృత్వంలో ఆ జట్టు 2022 సీజన్ ఫైనల్స్‌కు చేరింది.