భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సంచలన నిర్ణయం తీసుకుంది. వరుస మ్యాచ్‌లలో విఫలమవుతున్నా ఇన్నాళ్లు టీ20 జట్టు ఓపెనర్‌గా కొనసాగించిన శుబ్‌మన్ గిల్ (Shubman Gill)పై ఎట్టకేలకు వేటు వేసింది. ఊహించని రీతిలో ప్రపంచకప్-2026 జట్టు నుంచి అతడిని తప్పించింది.
వైస్ కెప్టెన్‌గా రీఎంట్రీ
టీమిండియా టెస్టు, వన్డే జట్ల కెప్టెన్‌గా.. టీ20 జట్టు వైస్ కెప్టెన్‌గా ఉన్న గిల్ విషయంలో బీసీసీఐ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగా మారింది. కాగా ఆసియా టీ20 కప్-2025 టోర్నమెంట్‌తో వైస్ కెప్టెన్‌గా భారత జట్టులో రీఎంట్రీ ఇచ్చాడు గిల్.
దీంతో దాదాపు ఏడాది కాలంపాటు అభిషేక్ శర్మ (Abhishek Sharma)తో కలిసి ఓపెనర్‌గా సత్తా చాటిన సంజూ శాంసన్‌కు కష్టాలు మొదలయ్యాయి. గిల్‌ను అభిషేక్ జోడీగా ఆడించిన యాజమాన్యం.. సంజూను తొలుత వన్‌డౌన్‌లో.. ఆ తర్వాత మిడిలార్డర్‌కు పంపింది. క్రమక్రమంగా తుదిజట్టు నుంచే తప్పించింది.
వరుస మ్యాచ్‌లలో విఫలం
వికెట్ కీపర్‌గానూ సంజూకు బదులు ఫినిషర్‌గా ఉపయోగపడే జితేశ్ శర్మకు ప్రాధాన్యం ఇచ్చింది. అయితే, సంజూ స్థానంలో ఓపెనర్‌గా తిరిగి వచ్చిన గిల్ వరుస మ్యాచ్‌లలో విఫలమయ్యాడు. అంతకు ముందు కూడా అతడి ప్రదర్శన అంతంత మా త్రమే.
గత ఇరవై ఒక్క ఇన్నింగ్స్‌లో గిల్ సాధించిన స్కోర్లు వరుసగా.. 20(9), 10(7), 5(8), 47(28), 29(19), 4(3), 12(10), 37*(20), 5(10), 15(12), 46(40), 29(16), 4(2), 0(1).
చివరగా సౌతాఫ్రికాతో స్వదేశంలో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌లలో తీవ్రంగా నిరాశపరిచిన గిల్ (4(2), 0(1)).. మూడో టీ20లో 28 బంతుల్లో 28 పరుగులు చేయగలిగాడు. అయితే, పాదానికి గాయమైన కారణంగా ఆఖరి రెండు టీ20ల నుంచి అతడు తప్పుకొన్నాడు. ఈ క్రమంలో నాలుగో టీ20 పొగమంచు వల్ల రద్దు కాగా.. ఐదో టీ20తో సంజూ తుదిజట్టులోకి వచ్చాడు.
నిరూపించుకున్న సంజూ
అహ్మదాబాద్ వేదికగా ధనాధన్ ఇన్నింగ్స్ (22 బంతుల్లో 37) ఆడి తన సత్తాను మరోసారి నిరూపించుకున్నాడు సంజూ. గిల్ మూడు మ్యాచ్‌లలో కలిపి చేసిన పరుగుల కంటే ఒక్క ఇన్నింగ్స్‌లోనే సంజూనే ఎక్కువ పరుగులు చేయడం విశేషం.
ఈ పరిణామాల నేపథ్యంలో మరోసారి మేనేజ్‌మెంట్ తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. గిల్ కోసం ఇంకెన్నాళ్లు సంజూను బలిచేస్తారని రవిశాస్త్రి వంటి మాజీ క్రికెటర్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఏకంగా ప్రపంచకప్ జట్టు నుంచే గిల్‌ను తప్పించడం సంచలనంగా మారింది.
అందుకే గిల్‌ను సెలక్ట్ చేయలేదు
ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా టీమిండియా చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ స్పందించాడు. విలేకరుల ప్రశ్నకు బదులిస్తూ... ‘‘శుబ్‌మన్ గిల్ పరుగులు రాబట్టడంలో వెనుకబడ్డాడు. 2024 వరల్డ్‌కప్ జట్టులోనూ అతడు లేడు.
మీ, నా అభిప్రాయాలు వేర్వేరుగా ఉండవచ్చు. కొన్నిసార్లు జట్టు ఎంపిక అత్యంత క్లిష్టంగా ఉంటుంది. గిల్ ఇప్పటకీ నాణ్యమైన ఆటగాడే అని మేము నమ్ముతున్నాం. ఫామ్ విషయంలో ప్రతి ఒక్కరి కెరీర్‌లో ఎత్తుపళ్లాలు సహజమే.
అయితే, జట్టు కూర్పునకు అనుగుణంగా ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అలాంటపుడు కొందరికి స్థానం దక్కదు. అతడు మెరుగైన ఆటగాడు కాదు కాబట్టి మేము ఈ నిర్ణయం తీసుకున్నామని అనుకోకూడదు. అదృష్టవశాత్తూ భారత క్రికెట్‌లో మనకెన్నో మంచి మంచి ఆప్షన్లు ఉన్నాయి’’ అని అగార్కర్ స్పష్టం చేశాడు.
చదవండి: రోహిత్ శర్మ యూటర్న్!


