టీ20 వరల్డ్‌కప్-2026కు ఎంపికైన భారత స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీ-2025లో ఆడేందుకు శాంసన్ సిద్దమయ్యాడు. విజయ్ హజారే ట్రోఫీ కోసం కేరళ క్రికెట్ అసోసియేషన్ ప్రకటించిన జట్టులో సంజూకు చోటు దక్కింది.
ఈ జట్టుకు యువ ఓపెనర్ రోహన్ కున్నుమ్మల్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ 2025లో ముంబై ఇండియన్స్ తరపున రాణించిన స్పిన్నర్ విఘ్నేష్ పుత్తూర్ ఈ జట్టులో చోటు సంపాదించుకున్నాడు. కేరళ జట్టులో ఎండీ నిదీష్, విష్ణు వినోద్, మహ్మద్ అజారుద్దీన్, వంటి అనుభవం ఉన్న ప్లేయర్లు ఉన్నారు. ఈ టోర్నీలో కేరళ జట్టు గ్రూపు-ఈలో ఉంది. ఈ గ్రూప్‌లో కేరళతో పాటు త్రిపుర, కర్ణాటక, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, పాండిచ్చేరి, తమిళనాడు జట్లు ఉన్నాయి.
వన్డే జట్టులోకి వచ్చేందుకు..
భారత టీ20 టీ20 జట్టులో తన స్ధానాన్ని పదిలం చేసుకున్న సంజూ శాంసన్.. ఇప్పుడు వన్డే జట్టులోకి కూడా రావాలని తహతహలాడుతున్నాడు. వాస్తవానికి సంజూకు వన్డేల్లో అద్భుతమైన రికార్డు ఉంది. ఈ కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ ఇప్పటివరకు భారత్ తరపున 16 వన్డేలు ఆడి 56.67 సగటుతో 510 పరుగులు చేశాడు.
ఇందులో ఒక సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ విజయ్ హజారే ట్రోఫీలో సంజూ రాణిస్తే, భారత వన్డే జట్టులోకి రీఎంట్రీకి మార్గం సుగమం అవుతుంది. కాగా ఈ ఏడాది దేశవాళీ వన్డే టోర్నీలో విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ, రిషబ్ పంత్ వంటి అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆడనున్నారు.
విజయ్ హజారే ట్రోఫీకి కేరళ జట్టు:
రోహన్ కున్నుమ్మల్ (కెప్టెన్), సంజు శాంసన్, విష్ణు వినోద్ (వికెట్ కీపర్), మహమ్మద్ అజహరుద్దీన్ (వికెట్ కీపర్), అహమ్మద్ ఇమ్రాన్, సల్మాన్ నిజార్, అభిషేక్ జె. నాయర్, కృష్ణ ప్రసాద్, అఖిల్ స్కారియా, అభిజిత్ ప్రవీణ్ వి, బిజు నారాయణన్, అంకిత్ శర్మ, బాబా అపరాజిత్, విఘ్నేష్ పుత్తూర్, నిదీష్ ఎండి, ఆసిఫ్ కెఎమ్, అభిషేక్ పి. నాయర్, షరాఫుద్దీన్ ఎన్ఎమ్, ఎడెన్ ఆపిల్ టామ్.
చదవండి: 'అతడి రీ ఎంట్రీ చాలా సంతోషంగా ఉంది'


