ఐపీఎల్ పొమ్మంది.. పీఎస్ఎల్ ర‌మ్మంది! ఎన్ని కోట్లు న‌ష్ట‌మో తెలుసా? | Mustafizur Rahman takes 7.12 crore pay cut to play for Lahore Qalandars in PSL 2026 | Sakshi
Sakshi News home page

Mustafizur Rahman: ఐపీఎల్ పొమ్మంది.. పీఎస్ఎల్ ర‌మ్మంది! ఎన్ని కోట్లు న‌ష్ట‌మో తెలుసా?

Feb 5 2026 4:56 PM | Updated on Feb 5 2026 5:59 PM

Mustafizur Rahman takes 7.12 crore pay cut to play for Lahore Qalandars in PSL 2026

ఐపీఎల్ నుంచి ఉద్వాసనకు గురైన‌ బంగ్లాదేశ్ స్టార్ పేస‌ర్ ముస్తాఫిజుర్ రెహ్మాన్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నాడు. పాకిస్తాన్ సూప‌ర్ లీగ్‌-2026లో లాహోర్ ఖలందర్స్ త‌ర‌పున ముస్తాఫిజుర్ ఆడ‌నున్నాడు. పీఎస్ఎల్ వేలానికి ముందు అత‌డిని రూ. 2.08 కోట్లకు (పీకేర్‌ 6.44 కోట్లు) లాహోర్ ఒప్పందం కుదుర్చుకుంది.

ఈ విష‌యాన్ని లాహోర్ ఖలందర్స్ ఓనర్ సమీన్ రానా ధ్రువీక‌రించాడు. "ముస్తాఫిజుర్ లాహోర్ ఖలందర్స్ ఫ్యామిలీలో ఎల్ల‌ప్పుడూ భాగ‌మే. అత‌డు తిరిగి మా జ‌ట్టులో చేరినందుకు చాలా సంతోషంగా ఉంద‌ని" సమీన్ రానా పేర్కొన్నాడు. ఈ ఫ్రాంచైజీకి ముస్తాఫిజుర్ ప్రాతినిథ్యం వహించ‌డం ఇదే మూడవసారి కావ‌డం గ‌మ‌నార్హం. 

రూ. 7.12 కోట్ల నష్టం
కాగా ఐపీఎల్-2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ. 9.20 కోట్లకు దక్కించుకుంది. అయితే బంగ్లాదేశ్‌లో మైనార్టీల‌పై దాడుల నేపథ్యంలో అత‌డిని జ‌న‌వ‌రి 3న బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్‌ జట్టు నుంచి విడుదల చేసింది. దీంతో అప్ప‌టి నుంచి బంగ్లా-భార‌త్ మ‌ధ్య ప‌రిస్థితులు మ‌రింత ఉద్రిక్త‌మ‌య్యాయి.

భ‌ద్ర‌తా కార‌ణాల‌ను సాకుగా చూపుతూ టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం భార‌త్‌లో ప‌ర్య‌టించేందుకు బంగ్లాదేశ్ నిరాక‌రించింది. దీంతో రంగంలోకి దిగిన ఐసీసీ.. బంగ్లా క్రికెట్ బోర్డును ఒప్పించేందుకు ప్ర‌య‌త్నించింది. కానీ బీసీబీ మాత్రం త‌మ ప‌ట్టును వీడలేదు. ఫ‌లితంగా ఐసీసీ బంగ్లాదేశ్‌ను టోర్నీ నుంచి తప్పించి, వారి స్థానంలో స్కాట్లాండ్‌ను చేర్చింది. 

ఏదేమైన‌ప్ప‌టికి రెండు దేశాల ఉద్రిక్త‌ల‌కు ముస్తాఫిజుర్ బ‌లైపోయాడు. అత‌డు ఐపీఎల్‌లో ఆడి ఉంటే రూ. 9.20 కోట్లు ద‌క్కేవి. కానీ ఇప్పుడు పీఎస్ఎల్ ఒప్పందం కార‌ణంగా ముస్తాఫిజుర్‌కు కేవ‌లం రూ. 2.08 కోట్లు ల‌భించ‌నున్నాయి. దీంతో అత‌డు దాదాపు రూ. 7.12 కోట్ల‌ను కోల్పోవాల్సి వచ్చింది. కాగా ఈ ఏడాది పీఎస్ఎల్ సీజ‌న్ మార్చి 26 నుంచి ప్రారంభం కానుంది.

Advertisement
 
Advertisement
Advertisement