జాతీయ జట్టు సెలెక్టర్ల పని ఎప్పుడూ కత్తిమీద సామే. వారు ఎంపిక చేసిన జట్టు గెలిస్తే శెభాష్ అంటారు. అదే ఒక్క ఓటమి ఎదురైనా చాలు విమర్శలు వెల్లువెత్తుతాయి. తాజాగా టీ20 ప్రపంచకప్-2026కు ఎంపిక చేసిన భారత జట్టుపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది. ఈ మెగా టోర్నీకి జట్టు ఎంపిక సందర్భంగా అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సెలక్షన్ కమిటీ అనుహ్య నిర్ణయాలు తీసుకుంది.
స్టార్ బ్యాటర్, వైస్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌పై వేటు పడింది. పేలవ ఫామ్‌తో సతమతమవుతున్న గిల్‌ను జట్టు నుంచి తప్పించారు. అతడి స్దానంలో రింకూ సింగ్.. జితేష్ శర్మ ప్లేస్‌లో వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్‌ను జట్టులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్‌కు పదికి పది మార్కులు వేశాడు. కిషన్‌తో పాటు ఫినిషర్ రింకూ సింగ్ కూడా తిరిగి జట్టులోకి వచ్చాడు.
"టీ20 వరల్డ్‌కప్‌కు అద్భుతమైన జట్టును ఎంపిక చేశారు. అజిత్ అగార్కర్, మెనెజ్‌మెంట్‌కు 10కి 10 మార్కులు ఇవ్వాలనుకుంటున్నాను. అయితే శుభ్‌మన్ గిల్‌ను పక్కన పెట్టడం కష్టమైన నిర్ణయమైనప్పటికి.. జట్టు కూర్పుకే సెలెక్టర్లు ప్రాధాన్యత ఇచ్చారు. కానీ టీ20ల్లో ఇదే అతడికి చివరి అవకాశం కాదు. గిల్ తిరిగొస్తాడన్న నమ్మకం నాకు ఉంది.
రింకూ సింగ్ తిరిగి జట్టులోకి రావడం చాలా చాలా సంతోషంగా ఉంది. అతడికి రాక జట్టుతో మరింత పటిష్టంగా మారింది. అదేవిధంగా జితేష్ శర్మ స్ధానంలో సెకెండ్ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్‌ను ఎంపిక చేయడం సరైన నిర్ణయమే. ఎందుకంటే 7 లేదా 8వ స్థానాల్లో ఆడే బ్యాటర్లు ఇప్పటికే జట్టులో చాలా మంది ఉన్నారు. టాప్ ఆర్డర్‌లో మెరుపులు మెరిపించే పవర్ హిట్టర్ జట్టుకు కావాలి. ఆ బాధ్యతను ఇషాన్ నెరవేరుస్తాడన్న నమ్ముతున్నాను" అని భజ్జీ పేర్కొన్నాడు.


