ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ ఆండ్రూ స్ట్రాస్ రెండో వివాహం చేసుకున్నాడు. ఏడేళ్ల క్రితం (2018లో) అరుదైన ఊపిరితిత్తుల క్యాన్సర్ కారణంగా మొదటి భార్య రూత్‌ను కోల్పోయిన స్ట్రాస్.. తాజాగా ఆంటోనియా లిన్నేయస్ పీట్ (30) అనే మాజీ పీఆర్ ఎగ్జిక్యూటివ్‌ను మనువాడాడు.
వీరి వివాహం అతి కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో స్ట్రాస్ జన్మస్థలమైన దక్షిణాఫ్రికాలోని (ఫ్రాన్స్‌హోక్) ఓ వైన్ యార్డ్‌లో జరిగింది. లిన్నేయస్ పీట్‌తో వివాహ సమాచారాన్ని స్ట్రాస్ సోషల్‌మీడియా వేదికగా పంచుకున్నాడు.
వివాహ ఫోటోలను షేర్ చేస్తూ, భార్య లిన్నేయస్‌ను ఉద్దేశిస్తూ ఈ సందేశాన్ని రాసుకొచ్చాడు. “మన ప్రియమైన ప్రదేశంలో అత్యంత ప్రత్యేకమైన రోజు జరుపుకున్నాం. నన్ను, నా పిల్లలను ప్రేమించి, నిజమైన ఆనందాన్ని చూపించినందుకు ధన్యవాదాలు. నేను ఎంతో అదృష్టవంతుడిని. మన జీవితంలో ఎన్నో అందమైన జ్ఞాపకాలు ఉండాలని కోరుకుంటున్నాను”
స్ట్రాస్ భార్య ప్రస్తుతం లిన్నేయస్ అనే ఫైన్ ఆర్ట్ అడ్వైజరీ సంస్థ నిర్వహిస్తుంది. 48 ఏళ్ల స్ట్రాస్ ఇటీవల ఈసీబీ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పని చేసి పదవీ విరమణ చేశాడు. స్ట్రాస్ ఇంగ్లండ్ జాతీయ జట్టుకు మూడు ఫార్మాట్లలో కెప్టెన్‌గా వ్యవహరించాడు.
లెఫ్ట్ ఆర్మ్ ఓపెనింగ్ బ్యాటర్ అయిన స్ట్రాస్.. 2003-2012 మధ్యలో 100 టెస్ట్‌లు, 127 వన్డేలు ఆడాడు. ఇందులో 27 సెంచరీలు, 54 హాఫ్ సెంచరీల సాయంతో 11000 పైచిలుకు పరుగులు చేశాడు. ఆస్ట్రేలియాలో యాషెస్ సిరీస్ గెలిచిన అతి కొద్ది మంది ఇంగ్లండ్ కెప్టెన్లలో స్ట్రాస్ ఒకరు.
స్ట్రాస్.. మొదటి భార్య రూత్ జ్ఞాపకార్థం Ruth Strauss Foundation స్థాపించాడు. ఈ ఫౌండేషన్ కుటుంబాలకు మద్దతు ఇవ్వడమే కాకుండా, క్యాన్సర్ పరిశోధనలకు నిధులు సమకూరుస్తుంది. ఈ సేవలకు గాను స్ట్రాస్‌కు 2019లో నైట్‌హుడ్ లభించింది.


