పొట్టి క్రికెట్ ప్రేమికులను అలరించేందుకు మరో లీగ్ సిద్దమైంది. యూఏఈ వేదికగా వచ్చే ఏడాది చివరి త్రైమాసికంలో ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ (APL T20) ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈ లీగ్ 2018లోనే ప్రారంభమైంది. అయితే వేర్వేరు కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తూ, చివరికి ఆరేళ్ల తర్వాత రీఎంట్రీకి సిద్దమైంది. ఈ మేరకు తాజాగా ప్రకటన విడదలైంది.
APL T20 లీగ్ యూఏఈలో జరుగనున్నా, ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు ఆథ్వర్యంలోనే జరుగుతుంది. తొలి ఎడిషన్ తరహాలోనే 2026 ఎడిషన్‌లోనూ ఐదు ఫ్రాంచైజీలు (బాల్ఖ్ లెజెండ్స్, కాబూల్ జ్వానన్, కందహార్ నైట్స్, నంగర్‌హార్ లియోపార్డ్స్, పక్తియా పాంథర్స్) పాల్గొంటాయి. తొలి ఎడిషన్‌లో బల్క్ లెజెండ్స్ విజేతగా నిలిచింది. ఈ లీగ్‌లో కూడా ఇతర లీగ్‌ల్లో లాగే భారత ఆటగాళ్లు మినహా ప్రపంచవాప్తంగా ఉండే ఆటగాళ్లు పాల్గొంటారు.
ఆఫ్ఘనిస్తాన్ ప్రీమియర్ లీగ్ రీఎంట్రీ వార్త నేపథ్యంలో ప్రైవేట్ టీ20 లీగ్‌లకు సంబంధించిన ఓ ఆసక్తికర చర్చ మళ్లీ మొదలైంది. ప్రస్తుతం ఐసీసీ ఫుల్‌టైమ్ మెంబర్‌గా ఉండే ప్రతి దేశంలో ఓ ప్రైవేట్ టీ20 లీగ్ జరుగుతుంది. వీటిలో భారత్‌లో జరిగే ఐపీఎల్‌కే ఆదరణ ఎక్కువన్నది కాదనలేని సత్యం. అయితే, ఐపీఎల్ తర్వాత రెండో స్థానం ఏ లీగ్‌దన్నదే ప్రస్తుత చర్చ.
ఆదరణ ప్రకారం చూసినా, బిజినెస్ పరంగా చూసినా ఐపీఎల్ తర్వాత ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌బాష్ లీగ్‌దే రెండో స్థానమన్నది బహిరంగ రహస్యం. ఐపీఎల్ మొదలైన మూడేళ్ల తర్వాత పురుడుపోసుకున్న ఈ లీగ్, ప్రారంభ దినాల్లో పెద్దగా సక్సెస్ కాకపోయినా, క్రమంగా ఆదరణ చూరగొంది. ఈ లీగ్‌లో ఆస్ట్రేలియా జాతీయ జట్ల స్టార్లందరూ పాల్గొనడంతో పాటు భారత్ మినహా ప్రపంచ క్రికెట్ స్టార్లంతా పాల్గొంటారు. ఐపీఎల్ తరహాలోనే ఈ లీగ్ కూడా సదీర్ఘంగా సాగుతుంది.
ఐపీఎల్, బీబీఎల్ తర్వాత అత్యంత ప్రజాదరణ పొందిన లీగ్ ఏదంటే.. 2023లో ప్రారంభమైన సౌతాఫ్రికా టీ20 లీగ్ అని చెప్పాలి. ఈ లీగ్‌లో కూడా బీబీఎల్ తరహాలోనే స్థానిక స్టార్లు, విదేశీ స్టార్లు పాల్గొంటారు. SA20లో ఫ్రాంచైజీలన్నీ ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే కావడం విశేషం. పారితోషికాల విషయంలో ఈ లీగ్ ఐపీఎల్‌కు దగ్గరగా ఉంటుంది. ఈ లీగ్ పుణ్యమా అని సౌతాఫ్రికా టీ20 జట్టు చాలా పటిష్టంగా తయారయ్యిందనే టాక్ ఉంది.
సౌతాఫ్రికా టీ20 లీగ్ తర్వాత ఇంచుమించు అదే స్థాయి ఆదరణ కలిగిన లీగ్‌గా ఇంటర్నేషనల్ టీ20 లీగ్‌కు పేరుంది. దుబాయ్‌లో జరిగే ILT20, సౌతాఫ్రికా టీ20 లీగ్ ప్రారంభమైన 2023వ సంవత్సరంలోనే ప్రారంభమైంది. ఈ లీగ్‌లో కూడా చాలావరకు ఐపీఎల్ ఆధారిత ఫ్రాంచైజీలే ఉన్నాయి. ప్రస్తుతం ఈ లీగ్ నాలుగో ఎడిషన్ నడుస్తుంది.
SA20, ILT20 తర్వాత ఇప్పుడిప్పుడే యూఎస్‌ఏలో జరిగే మేజర్ లీగ్ క్రికెట్ (MLC), ఇంగ్లండ్‌లో జరిగే ద హండ్రెడ్ లీగ్‌లకు ఆదరణ పెరుగుతోంది. మేజర్ లీగ్ క్రికెట్ 2023లో ప్రారంభం కాగా.. హండ్రెడ్ లీగ్ 2021లో మొదలైంది. హండ్రెడ్ లీగ్ 100 బంతుల ఫార్మాట్లో జరిగినా టీ20 ఫార్మాట్ పరిధిలోకే వస్తుంది.
ఈ లీగ్‌ల కంటే చాలా ముందుగానే ప్రారంభమైనా పాకిస్తాన్‌లో జరిగే పాకిస్తాన్ సూపర్ లీగ్ (2016), బంగ్లాదేశ్‌లో జరిగే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (2012), వెస్టిండీస్‌లో జరిగే కరీబియన్ ప్రీమియర్ లీగ్ (2013), శ్రీలంకలో జరిగే లంక ప్రీమియర్ లీగ్ (2020) పెద్దగా సక్సెస్ కాలేదు.
పైన పేర్కొన్న లీగ్‌లతో పోలిస్తే ఈ లీగ్‌ల్లో ఆటగాళ్ల పారితోషికాలు చాలా తక్కువగా ఉంటాయి. ఈ కారణంగా స్టార్ క్రికెటర్లు ఈ లీగ్‌ల్లో పాల్గొనేందుకు పెద్దగా సుముఖత చూపారు. దీంతో ఆటోమేటిక్‌గా ఈ లీగ్‌లకు ఆదరణ తక్కువగా ఉంటుంది.
పీఎస్‌ఎల్ లాంటి లీగ్ ఐపీఎల్‌కు తాము సమానమని జబ్బలు చరుచుకుంటున్నా, ఆ లీగ్‌లో ఆడేందుకు చాలామంది విదేశీ స్టార్లు ఇష్టపడరు. భద్రతా కారణాలు, సదుపాయాల లేమి, పారితోషికాలు తక్కువగా ఉండటం లాంటి కారణాల చేత విదేశీ ప్లేయర్లు ఈ లీగ్ ఆడేందుకు రారు.
ఐపీఎల్‌తో పోలిస్తే ఆటగాళ్ల పారితోషికాలు పీఎస్‌ఎల్‌లో కనీసం పావు శాతం కూడా ఉండవు. ఇటీవల జరిగిన ఐపీఎల్ 2026 మినీ వేలంలో కెమరూన్ గ్రీన్‌కు రికార్డు స్థాయిలో రూ. 25.20 కోట్ల భారీ మొత్తం దక్కింది. పీఎస్‌ఎల్‌లో ఇంత మొత్తంలో పది శాతం కూడా ఆ దేశ స్టార్ క్రికెటర్‌కు దక్కదు.


