ఒకప్పుడు సినిమా గురించి ఓ మాదిరిగా ప్రచారం చేసినా సరే థియేటర్లకు ప్రేక్షకుడు వచ్చేవాడు. యావరేజ్‌గా ఉన్నా గానీ చూసి ఎంజాయ్ చేసేవాడు. ఇప్పుడు అలా కాదు రకరకాలుగా ప్రమోషన్స్ చేసినా సరే థియేటర్‌కి వచ్చేందుకు ప్రేక్షకుడు చాలా ఆలోచిస్తున్నాడు. ఇలాంటి టైంలో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండ్ ఒకటి కనిపిస్తుంది. కన్నడలో ఇది ఎక్కువగా ఉండగా.. తెలుగులోనూ కొన్ని మూవీస్ ఈ తరహా ప్రయత్నాలు చేసి హిట్ కొట్టాయనే చెప్పొచ్చు. ఇంతకీ ఏంటి విషయం?
చిన్న సినిమాని ప్రేక్షకుడికి చేరువ చేయడం చాలా కష్టం. తమ సినిమాలో కంటెంట్ ఉందని, కచ్చితంగా ఎంటర్‌టైన్ చేస్తామని చెబితే సరిపోదు. ఆ విషయాన్ని తాము చెప్పకుండా.. వేరే ప్రేక్షకులతోనే చెప్పిస్తున్నారు. అదే 'ఫ్రీ' పబ్లిసిటీ. అంటే రిలీజ్‌కి కొన్నిరోజుల ముందే కొందరు ఆడియెన్స్ కోసం ఉచితంగా షోలు వేస్తున్నారు. అలా సినిమా చూసిన వాళ్లు ఏదైతే చెబుతారో ఆ విషయాలతో మూవీ టీమ్ ప్రమోషన్ చేసుకుంటోంది. రీసెంట్ టైంలో కన్నడ చిత్రం '45'కి ఇలాంటి ప్రయత్నమే చేశారు. గతంలో 'చార్లీ 777'కి కూడా ఇలానే చేసి హిట్ కొట్టారనే విషయం మర్చిపోవద్దు.
ఈ ఏడాది తెలుగులోనూ రిలీజైన లిటిల్ హార్ట్స్, కోర్ట్, రాజు వెడ్స్ రాంబాయి చిత్రాలకు కూడా ఉచితంగా షోలు వేయలేదు గానీ విడుదలకు ముందే ప్రీమియర్స్ వేశారు. వాటిలో అద్భుతమైన కంటెంట్ ఉండేసరికి రిలీజ్ రోజు ఉదయానికి మౌత్ టాక్ బలంగా వినిపించింది. దీంతో చాలామంది ప్రేక్షకులు.. చిన్న సినిమాలు అయినా సరే వీటిని థియేటర్లకు వెళ్లి చూశారు. ఆదరించారు. వీటికి మంచి లాభాలు కూడా వచ్చాయి.
అయితే ప్రీమియర్లు అన్ని సినిమాలకు వర్కౌట్ కావు. ఎందుకంటే 'హరిహర వీరమల్లు' లాంటి మూవీకి ప్రీమియర్స్ అనేవి నెగిటివ్ కావడానికి చాలా కారణమయ్యాయి. ఎందుకంటే కంటెంట్‌పై చాలా నమ్మకం ఉండి ప్రీమియర్స్ వేస్తే.. తెల్లారేసరికి అది మౌత్ టాక్ రూపంలో ప్లస్ అవుతుంది. లేదంటే మాత్రం మొత్తానికే నెగిటివ్ కావడం గ్యారంటీ. దీనికి ఫెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ పవన్ 'హరిహర వీరమల్లు'.
రీసెంట్‌గా క్రిస్మస్‌కి రిలీజైన 'ఛాంపియన్'కి తప్పితే దాదాపు మిగతా తెలుగు సినిమాలకు ప్రీమియర్స్ వేశారు. ఉచితంగా టికెట్ గివ్ అవేలు కూడా ఇచ్చారు. అయినా సరే కంటెంట్ ఉన్న 'శంబాల' మాత్రమే ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. ఇన్నాళ్లు చిన్న సినిమాలకు సరైన ఆదరణ దక్కేది కాదు. రీసెంట్ టైంలో మాత్రం ఫ్రీగా స్క్రీనింగ్, ప్రీమియర్స్‌తో వస్తున్న మౌత్ టాక్ కలిసొస్తోంది. కలెక్షన్స్ కూడా బాగానే వస్తున్నాయి.


