విదర్భ విజయఢంకా | Vidarbha beats Nagaland by an innings and 179 runs | Sakshi
Sakshi News home page

విదర్భ విజయఢంకా

Oct 18 2025 4:14 AM | Updated on Oct 18 2025 4:14 AM

Vidarbha beats Nagaland by an innings and 179 runs

నాగాలాండ్‌పై ఇన్నింగ్స్‌ 179 పరుగుల తేడాతో ఘనవిజయం

రంజీ ట్రోఫీలో శుభారంభం చేసిన డిఫెండింగ్‌ చాంపియన్‌

బెంగళూరు: దేశవాళీ క్రికెట్‌ టోర్నమెంట్‌ రంజీ ట్రోఫీలో... డిఫెండింగ్‌ చాంపియన్‌ విదర్భ శుభారంభం చేసింది. గత సీజన్‌లో చక్కటి ఆటతీరుతో ట్రోఫీ చేజిక్కించుకున్న విదర్భ... తాజా సీజన్‌ ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా ఆడిన తొలి పోరులో భారీ విజయం నమోదు చేసుకుంది. మూడు రోజుల్లోనే ముగిసిన పోరులో ఇరానీ కప్‌ విజేత విదర్భ జట్టు... ఇన్నింగ్స్‌ 179 పరుగుల తేడాతో నాగాలాండ్‌ను చిత్తు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 81/3తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన నాగాలాండ్‌ జట్టు 69.3 ఓవర్లలో 171 పరుగులకు ఆలౌటైంది. 

డేగ నిశ్చల్‌ (146 బంతుల్లో 50; 3 ఫోర్లు), చేతన్‌ బిస్త్‌ (91 బంతుల్లో 52; 5 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీలు చేశారు. విదర్భ బౌలర్లలో నచికేత్‌ 5 వికెట్లు పడగొట్టాడు. అనంతరం ఫాలోఆన్‌ ఆడిన నాగాలాండ్‌ రెండో ఇన్నింగ్స్‌లో 46.3 ఓవర్లలో 113 పరుగులకే ఆలౌటైంది. చేతన్‌ బిస్త్‌ (88 బంతుల్లో 55; 8 ఫోర్లు) మరో హాఫ్‌సెంచరీ చేయగా మిగతా వారు విఫలమయ్యారు.

విదర్భ బౌలర్లలో ఎడంచేతి వాటం స్పిన్నర్‌ హర్ష్ దూబే 4 వికెట్లు పడగొట్టగా... పార్థ్‌ రేఖడే, దర్శన్‌ నల్కండే చెరో 2 వికెట్లు తీశారు. అంతకుముందు విదర్భ తొలి ఇన్నింగ్స్‌లో 463 పరుగులు చేసింది. భారీ సెంచరీతో చెలరేగిన అమన్‌ మోఖడేకు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది.  

ఫాలోఆన్‌లో తమిళనాడు 
బ్యాటర్లు ముకుమ్మడిగా విఫలమవడంతో... జార్ఖండ్‌తో రంజీ మ్యాచ్‌లో తమిళనాడు జట్టు ఫాలోఆన్‌లో పడింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా కోయంబత్తూర్‌ వేదికగా జరుగుతున్న పోరులో ఓవర్‌నైట్‌ స్కోరు 18/5తో శుక్రవారం మూడో రోజు తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన తమిళనాడు చివరకు 50.4 ఓవర్లలో 93 పరుగులకే ఆలౌటైంది. అంబరీష్‌ (28; 5 ఫోర్లు) టాప్‌స్కోరర్‌ కాగా... మరో ఇద్దరు ప్లేయర్లు మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. 

జార్ఖండ్‌ బౌలర్లలో జతిన్‌ పాండే 5 వికెట్లతో అదరగొట్టగా... సాహిల్‌ రాజ్‌ 4 వికెట్లు తీశాడు. అనంతరం ఫాలోఆన్‌ బరిలోకి దిగిన తమిళనాడు శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 3 వికెట్లకు 52 పరుగులు చేసింది. కెప్టెన్‌ జగదీశన్‌ (21), అంబరీష్‌ (15), ప్రదోశ్‌ (8) అవుటయ్యారు. 

చేతిలో 7 వికెట్లు ఉన్న తమిళనాడు జట్టు ఇన్నింగ్స్‌ పరాజయాన్ని తప్పించుకోవాలంటే ఇంకా 274 పరుగులు చేయాల్సి ఉంది. ఆండ్రె సిద్ధార్థ్‌ (3 బ్యాటింగ్‌), జగన్నాథన్‌ (3 బ్యాటింగ్‌) క్రీజులో ఉన్నారు. జార్ఖండ్‌ బౌలర్లలో రిషవ్‌ రాజ్‌ 2 వికెట్లు తీశాడు. 

రైల్వేస్‌పై హరియాణా విజయం 
ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో ఆకట్టుకున్న హరియాణా జట్టు రంజీ ట్రోఫీ తాజా సీజన్‌లో తొలి విజయం ఖాతాలో వేసుకుంది. ఎలైట్‌ గ్రూప్‌ ‘సి’లో భాగంగా సూరత్‌ వేదికగా శుక్రవారం ముగిసిన పోరులో హరియాణా 96 పరుగుల తేడాతో రైల్వేస్‌ జట్టును మట్టికరిపించింది. 249 పరుగుల లక్ష్యఛేదనలో రైల్వేస్‌ జట్టు చివరకు 49.4 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ఓపెనర్‌లు సూరజ్‌ అహుజా (61 బంతుల్లో 44; 7 ఫోర్లు), వివేక్‌ సింగ్‌ (64 బంతుల్లో 44; 6 ఫోర్లు) తొలి వికెట్‌కు 90 పరుగులు జోడించి శుభారంభం ఇశ్మీచ్చినా... ఆ తర్వాత వశ్మీచ్చిన బ్యాటర్లు నిలవలేకపోవడంతో రైల్వేస్‌కు పరాజయం తప్పలేదు. 

హర్యానా బౌలర్లలో నిఖిల్‌ కశ్యప్‌ 5, నిశాంత్‌ సింధు 4 వికెట్లు పడగొట్టారు. అంతకముందు హరియాణా తొలి ఇన్నింగ్స్‌లో 171 పరుగులు చేయగా... రైల్వేస్‌ 128 పరుగులకు పరిమితమైంది. అనంతరం హరియాణా రెండో ఇన్నింగ్స్‌లో 205 పరుగులు చేసి ప్రత్యర్థి ముందు ఉరించే లక్ష్యాన్నిం ఉచింది. హరియాణా బ్యాటర్‌ పార్థ్‌ వత్స్‌కు ‘ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌’అవార్డు దక్కింది.  

ఓటమి అంచున త్రిపుర... 
ఆంధ్ర ఆటగాడు హనుమ విహారితో పాటు తమిళనాడు ప్లేయర్‌ విజయ్‌ శంకర్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న త్రిపుర జట్టు ఇన్నింగ్స్‌ పరాజయం అంచున నిలిచింది. గ్రూప్‌ ‘సి’లో భాగంగా సర్వీసెస్‌తో జరుగుతున్న మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులకే ఆలౌటైన త్రిపుర శుక్రవారం ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్‌లో 42 ఓవర్లలో 7 వికెట్లకు 114 పరుగులు చేసింది. 

తొలి ఇన్నింగ్స్‌లో విహారి (16) విఫలం కాగా... విజయ్‌ శంకర్‌ (132 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) హాఫ్‌ సెంచరీ సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో హనుమ విహారి 7 పరుగులే చేయగా... విజయ్‌ శంకర్‌ 8 పరుగుల వద్ద అవుటయ్యాడు. చేతిలో 3 వికెట్లు ఉన్న త్రిపుర జట్టు ఇన్నింగ్స్‌ పరాజయం తప్పించుకోవాలంటే ఇంకా 69 పరుగులు చేయాల్సి ఉంది.  

జమ్మూకశ్మీర్‌ లక్ష్యం 243 
బ్యాటర్లు స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోవడంతో... ముంబై జట్టు రెండో ఇన్నింగ్స్‌లో స్వల్ప స్కోరుకే పరిమితమైంది. రంజీ ట్రోఫీ ఎలైట్‌ గ్రూప్‌ ‘డి’లో భాగంగా శ్రీనగర్‌ వేదికగా జమ్మూకశ్మీర్‌తో జరుగుతున్న పోరులో ముంబై రెండో ఇన్నింగ్స్‌లో 181 పరుగులకు ఆలౌటైంది. టీమిండియా ప్లేయర్‌ అజింక్యా రహానే (0), ముషీర్‌ ఖాన్‌ (8), ఆయుశ్‌ మాత్రే (13), సిద్ధేశ్‌ లాడ్‌ (10), శార్దుల్‌ ఠాకూర్‌ (9), తనుశ్‌ కొటియాన్‌ (10) విఫలం కాగా... సర్ఫరాజ్‌ ఖాన్‌ (32), షమ్స్‌ ములానీ (41), ఆకాశ్‌ ఆనంద్‌ (31) ఫర్వాలేదనిపించారు. 

జమ్మూకశ్మీర్‌ బౌలర్లలో అఖీబ్‌ నబీ 5 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు ముంబై తొలి ఇన్నింగ్స్‌లో 386 పరుగులు చేయగా... జమ్మూకశ్మీర్‌ జట్టు 325 పరుగులు చేసింది. దీంతో కశ్మీర్‌ ముందు 243 పరుగుల లక్ష్యం నిలవగా... శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 7 ఓవర్లలో ఒక వికెట్‌ కోల్పోయి 21 పరుగులు చేసింది. చేతిలో 9 వికెట్లు ఉన్న జమ్మూకశ్మీర్‌ జట్టు విజయానికి ఇంకా 222 పరుగులు చేయాల్సి ఉంది.  

» కేరళతో జరుగుతున్న మ్యాచ్‌లో మహారాష్ట్ర జట్టు స్వల్ప తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకుంది. మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 239 పరుగులకు ఆలౌట్‌ కాగా... కేరళ జట్టు 219 పరుగులకే పరిమితమైంది. మూడో రోజు ఆట ముగిసే సరికి మహారాష్ట్ర 9 ఓవర్లలో వికెట్‌ నష్టపోకుండా 51 పరుగులు చేసింది.  

» రంజీ ట్రోఫీ గ్రూప్‌ ‘ఎ’లో బాగంగా ఒడిశాతో మ్యాచ్‌లో బరోడా జట్టు తొలి ఇన్నింగ్స్‌ ఆధిక్యం దక్కించుకుంది. ఒడిశా తొలి ఇన్నింగ్స్‌లో 271 పరుగులకు పరిమితం కాగా... మూడో రోజు ఆట ముగిసే సమయానికి బరోడా తొలి ఇన్నింగ్స్‌లో 146 ఓవర్లలో 7 వికెట్లకు 413 పరుగులు చేసింది. శివాలిక్‌ శర్మ (124; 10 ఫోర్లు, 2 సిక్స్‌లు), మితేశ్‌ పటేల్‌ (100 బ్యాటింగ్‌; 11 ఫోర్లు) సెంచరీలు బాదారు.  

రజత్‌ డబుల్‌ సెంచరీ 
రజత్‌ పాటీదార్‌ (332 బంతుల్లో 205 బ్యాటింగ్‌; 26 ఫోర్లు) అజేయ ద్విశతకంతో చెలరేగడంతో... మధ్యప్రదేశ్‌ జట్టు భారీ స్కోరు సాధించింది. ఎలైట్‌ గ్రూప్‌ ‘బి’లో భాగంగా ఇండోర్‌ వేదికగా పంజాబ్‌తో జరుగుతున్న రంజీ మ్యాచ్‌లో మూడో రోజు ఆట ముగిసే సమయానికి మధ్యప్రదేశ్‌ జట్టు 146 ఓవర్లలో 8 వికెట్లకు 519 పరుగులు చేసింది. ఓవర్‌నైట్‌ స్కోరు 305/6తో శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ కొనసాగించిన మధ్యప్రదేశ్‌... వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్‌లో మరో మూడు వికెట్లు కోల్పోయి 200 పైచిలుకు పరుగులు జత చేసింది. 

క్రితం రోజే సెంచరీ పూర్తి చేసుకున్న పాటీదార్‌... డబుల్‌ సెంచరీ ఖాతాలో వేసుకోగా... అర్షద్‌ ఖాన్‌ (60 బంతుల్లో 60; 3 ఫోర్లు, 5 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో సత్తా చాటాడు. సారాంశ్‌ జైన్‌ (30), సాగర్‌ సోలంకి (26) ఫర్వాలేదనిపించారు. పంజాబ్‌ బౌలర్లలో ప్రేరిత్‌ దత్తా 4 వికెట్లు పడగొట్టాడు. అంతకుముందు పంజాబ్‌ 232 పరుగులకే ఆలౌటైంది. చేతిలో మరో రెండు వికెట్లు ఉన్న మధ్యప్రదేశ్‌ జట్టు ప్రస్తుతం 287 పరుగుల ఆధిక్యంలో ఉంది. రజత్‌ పాటీదార్‌తో పాటు అర్షద్‌ ఖాన్‌ క్రీజులో ఉన్నారు. నేడు ఆటకు చివరి రోజు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement