
టీమిండియా స్టార్ క్రికెటర్ సంజూ శాంసన్ (Sanju Samson) రంజీ ట్రోఫీ 2025-26 సీజన్‌లో శుభారంభం అందుకున్నాడు. మహారాష్ట్రతో మ్యాచ్‌లో ఈ కేరళ బ్యాటర్ ‘మెరుపు’ అర్ధ శతకం సాధించాడు. దేశీ ఫస్ట్‌క్లాస్ టోర్నీ రంజీ తాజా సీజన్ బుధవారం మొదలైన విషయం తెలిసిందే.
రుతురాజ్ గైక్వాడ్ పోరాటం
ఈ క్రమంలో ఎలైట్ గ్రూప్-బిలో భాగంగా తిరువనంతపురం వేదికగా కేరళ- మహారాష్ట్ర (Kerala Vs Maharashtra) తలపడుతున్నాయి. టాస్ గెలిచిన కేరళ తొలుత బౌలింగ్ ఎంచుకోగా.. మహారాష్ట్ర బ్యాటింగ్‌కు దిగింది. టాపార్డర్ విఫలమైన చోట రుతురాజ్ గైక్వాడ్ (Ruturaj Gaikwad- 151 బంతుల్లో 91; 11 ఫోర్లు) విలువైన ఇన్నింగ్స్ ఆడటంతో... మహారాష్ట్ర తొలి ఇన్నింగ్స్‌లో 84.1 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది.
కేరళ బౌలర్ల ధాటికి ఒక దశలో 18/5తో నిలిచిన మహారాష్ట్ర ఆ తర్వాత లోయర్ ఆర్డర్ పోరాటంతో తేరుకుంది. జలజ్ సక్సేనా (49; 4 ఫోర్లు), వికీ ఓస్త్వాల్ (38), రామకృష్ణ ఘోష్ (31) ఆకట్టుకున్నారు.
కేరళ బౌలర్లలో నిదీశ్ 5 వికెట్లతో సత్తాచాటాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కేరళ జట్టు గురువారం నాటి రెండో రోజు ఆట ముగిసే సమయానికి 10.4 ఓవర్లలో 3 వికెట్లకు 35 పరుగులు చేసింది.ఘీ క్రమంలో 35/3 ఓవర్‌నైట్ స్కోరుతో శుక్రవారం నాటి మూడో రోజు ఆట మొదలు పెట్టిన కేరళ ఇన్నింగ్స్‌ను సంజూ చక్కదిద్దాడు.
సంజూ శాంసన్ ‘మెరుపు’ అర్ధ శతకం
ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన సంజూ 63 బంతులు ఎదుర్కొని ఐదు ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 54 పరుగులు సాధించాడు. అతడికి తోడుగా కెప్టెన్, వికెట్ కీపర్ బ్యాటర్ అజారుద్దీన్ 36 పరుగులతో ఆకట్టుకోగా.. సల్మాన్ నిజార్ 49 పరుగులతో రాణించాడు.
అయితే, మిగిలిన వారి నుంచి పెద్దగా సహకారం అందకపోవడంతో 63.2 ఓవర్లలో కేరళ 219 పరుగులకు ఆలౌట్ అయింది. సంజూ పోరాడినప్పటికీ కేరళను ఆధిక్యంలోకి తీసుకురాలేకపోయాడు. ఇరవై పరుగుల స్వల్ప ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన మహారాష్ట్రకు శుభారంభమే దక్కింది.
ఆధిక్యంలో మహారాష్ట్ర
తొలి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన ఓపెనర్లు పృథ్వీ షా 37, అర్షిన్ కులకర్ణి 14 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఫలితంగా మూడో రోజు ఆట ముగిసేసరికి తొమ్మిది ఓవర్లలో వికెట్ నష్టపోకుండా మహారాష్ట్ర 51 పరుగులు చేసింది. తద్వారా కేరళ కంటే 71 పరుగుల ఆధిక్యంలో నిలిచింది.
ఆసీస్‌తో టీ20 సిరీస్ ఆడేందుకు సంజూ
కాగా ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు టీమిండియా సెలక్టర్లు సంజూ శాంసన్‌ను ఎంపిక చేయలేదన్న విషయం తెలిసిందే. దీంతో అతడు సొంత జట్టు కేరళ తరఫున రీఎంట్రీ ఇస్తూ రంజీ బరిలో దిగాడు. అయితే, ఆసీస్‌తో టీ20 సిరీస్ కోసం సన్నద్ధమయ్యే క్రమంలో త్వరలోనే సంజూ జట్టును వీడనున్నాడు. ఇక అక్టోబరు 19- 29 వరకు ఆసీస్- భారత్ మధ్య వన్డే సిరీస్.. అక్టోబరు 29- నవంబరు 8 మధ్య టీ20 సిరీస్ జరుగునుంది.