సంగారెడ్డి వేదికగా జరిగిన 11వ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్‌లో మేడ్చల్ మల్కాజిగిరి సీనియర్స్ బాలికల జట్టు విజేతగా నిలిచింది. అద్యంతం ఉత్కంఠభరితంగా జరిగిన ఫైనల్‌లో హైదరాబాద్ గర్ల్స్ టీంపై 61-59 స్కోరుతో గెలిచింది. మూడో స్థానంలో రంగారెడ్డి జట్టు నిలిచింది.
మేడ్చల్ మల్కాజిగిరి జట్టు చివరి వరకూ అద్భుతంగా ఆడింది. ఒక దశలో రెండు జట్ల స్కోర్లు సమానమయ్యాయి. అయితే ఫైనల్ మ్యాచ్ మరికొద్ది క్షణాల్లో ముగుస్తుందన్న సమయంలో మేడ్చల్ జట్టు బాస్కెట్ చేసి విజయాన్ని తమ వైపు తిప్పుకుంది. 11వ సీనియర్ ఇంటర్-డిస్ట్రిక్ట్ బాస్కెట్బాల్ టోర్నమెంట్‌లో మొత్తం 14 జిల్లాల టీంలు హోరాహోరీగా పోటీపడ్డాయి. బాలుర పోటీలో హైదరాబాద్ టోర్నీ గెలుచుకోగా, రెండో స్థానంలో రంగారెడ్డి, మూడో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి నిలిచాయి.
మేడ్చల్ మల్కాజిగిరి తరపున ఆడిన ఇద్దరు ప్లేయర్లు వివ్హా రెడ్డి మరియు నేత్ర బిరుదవోలు భారత టీంకు కూడా ప్రాతినిధ్యం వహిస్తుండడం విశేషం. మేడ్చల్ మల్కాజిగిరి జట్టు భవిష్యత్తులో మరెన్నో విజయాలు, ఛాంపియన్‌షిప్‌లు సాధించాలని అసొసియేషన్ అధ్యక్షులు సుధీర్, ప్రధాన కార్యదర్శి రవిశంకర్ ఆకాంక్షించారు.


