సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌ను టీమిండియా అద్భుతమైన విజయంతో ప్రారంభించింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో పర్యాటక ప్రోటీస్ జట్టును 17 పరుగుల తేడాతో భారత్ ఓడించింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ గెలిచినప్పటికి సరిదిద్దుకోవాల్సిన తప్పులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా బౌలింగ్ విభాగంలో రాహుల్ సేన ఇంకా మెరుగైన ప్రదర్శన చేయాల్సింది.
జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ లేని లోటు స్పష్టంగా కన్పించింది. 350 పరుగుల భారీ లక్ష్యాన్ని కాపాడుకునేందుకు భారత బౌలర్లు తీవ్రంగా శ్రమించారు. ఓ దశలో జాన్సెన్, బాష్ జోరు చూస్తే సఫారీలదే మ్యాచ్ అన్నట్లు అన్పించింది. కానీ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మయాజాలంతో ఓటమి నుంచి మెన్ బ్లూ గట్టెక్కింది.
అదేవిధంగా రాంచీ వన్డేలో భారత మిడిలార్డర్ బ్యాటర్లు కూడా విఫలమయ్యారు. ఛాన్నాళ్ల తర్వాత జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్(8) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాడు. బ్యాటింగ్ ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్(13) కూడా నామమాత్రపు స్కోరుకే పరిమితమయ్యాడు.
వారిద్దరిపై వేటు..
ఈ నేపథ్యంలో బుధవారం రాయ్‌పూర్ వేదికగా సఫారీలతో జరిగే రెండో వన్డేలో భారత్ పలు మార్పులతో బరిలోకి దిగే అవకాశముంది.తొలి వన్డేలో విఫలమైన రుతురాజ్ గైక్వాడ్, సుందర్‌లపై వేటు వేసేందుకు మెనెజ్‌మెంట్ సిద్దమైనట్లు సమాచారం.
రుతు స్ధానంలో స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ రిషబ్ పంత్, సుందర్ స్ధానంలో ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీష్ కుమార్ జట్టులోకి రానున్నట్లు బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. పంత్ గతేడాది చివరగా భారత్ తరపున వన్డే మ్యాచ్ ఆడాడు. మళ్లీ ఇప్పుడు ఏడాది తర్వాత ఈ డేంజరస్ బ్యాటర్ బ్లూ జెర్సీలో కన్పించనున్నాడు.
గత మ్యాచ్‌లో సుందర్ కేవలం మూడు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేశాడు. జట్టులో స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్‌తో పాటు రవీంద్ర జడేజా ఉండడంతో సుందర్‌ను బెంచ్‌కు పరిమితం చేయాలని గంభీర్ యోచిస్తున్నట్లు సమాచారం. నితీష్ బ్యాట్‌తో పాటు మీడియం పేస్ బౌలర్‌గా కూడా తన సేవలను అందించనున్నాడు. అయితే సఫారీలతో జరిగిన రెండో టెస్టులో మాత్రం నితీష్ దారుణ ప్రదర్శన కనబరిచాడు.
రెండో వన్డేకు భారత తుది జట్టు(అంచనా)
రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లి, రిషబ్ పంత్, కేఎల్ రాహుల్, నితీశ్ కుమార్ రెడ్డి, రవీంద్ర జడేజా, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, అర్ష్‌దీప్ సింగ్
చదవండి: రోహిత్‌తో గంభీర్ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్!


