రాంఛీ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో టీమిండియా సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు అద్భుత ప్రదర్శనలతో సత్తాచాటిన సంగతి తెలిసిందే. కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 11 ఫోర్లు, 7 సిక్సర్లతో 135)తో కదం తొక్కగా.. రోహిత్ (51 బంతుల్లోనే 57) తనదైన శైలిలో ధనాధన్ హాఫ్ సెంచరీ సాధించాడు.
ఆరంభంలోనే జైశ్వాల్ వికెట్ కోల్పోయిన భారత జట్టుకు వీరిద్దరూ తమ అనుభవంతో భారీ స్కోర్‌ను అందించారు. రో-కో ద్వయం రెండో వికెట్‌కు ఏకంగా 136 పరుగులు జోడించారు. కాగా ఇప్పటికే టీ20, టీ20లకు వీడ్కోలు పలికిన రోహిత్, కోహ్లిలు ప్రస్తుతం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్నారు.
దీంతో వన్డే వరల్డ్‌కప్-2027లో ఈ వెటరన్ క్రికెటర్లు ఆడుతారా? అప్పటివరకు ఫిట్‌నెస్‌గా ఉంటారా? లాంటి సందేహలు చాలా మంది మాజీ క్రికెటర్లు వ్యక్తం చేశారు. తమ భవిష్యత్తుపై విమర్శలు చేస్తున్న వారికి ఈ వెటరన్ జోడీ అద్భుత ఇన్నింగ్స్‌లతో సమాధానమిచ్చింది.
ఈ నేపథ్యంలో భారత మాజీ సెలెక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ కీలక వ్యాఖ్యలు చేశాడు. రోహిత్-కోహ్లి జోడీ లేకుండా 2027 వన్డే ప్రపంచకప్‌ను గెలవడం అసాధ్యమని అతడు చెప్పుకొచ్చాడు. "విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు వేరే లెవల్‌లో ఆడుతున్నారు. వీరిద్దరూ వన్డే ప్రపంచకప్ 2027లో ఆడాల్సిందే. రో-కో లేకుండా మనం వరల్డ్‌కప్‌ను గెలవలేం.
కాబట్టి ఇకపై ప్రపంచకప్‌లో వారిద్దరూ ఆడుతారా? ఫిట్‌నెస్‌గా ఉంటారా? లాంటి ప్రశ్నలు వేయొద్దు. రోహిత్-కోహ్లిలు 20 ఓవర్లు పాటు కలిసి బ్యాటింగ్ చేస్తే ప్రత్యర్ధి కథ సమాప్తమైనట్లే. రాంచీలో కూడా అదే జరిగింది. వారిద్దరూ తమ సంచలన బ్యాటింగ్‌తో సౌతాఫ్రికా ఓటమిని శాసించారు.
వారు నెలకొల్పిన భాగస్వామ్యం దక్షిణాఫ్రికాను మానసికంగా దెబ్బతీసింది. రో-కో జోడీ చాలా కష్టపడుతున్నారు. కేవలం ఒకే ఫార్మాట్‌లో ఆడుతూ తమ రిథమ్ కొనసాగించడం అంత సులువు కాదు. వరల్డ్‌కప్‌లో కూడా వారు కీలకం కానున్నారు" అని శ్రీకాంత్ తన యూట్యూబ్ ఛానల్‌లో పేర్కొన్నాడు.
ఇక తొలి వన్డేలో సౌతాఫ్రికాపై 17 పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది. 350 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 332 పరుగులకు ఆలౌటైంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


