టీమిండియా జెర్సీలో ఇషాన్ కిషన్ (పాత ఫొటో)
టీమిండియా యువ క్రికెటర్ ఇషాన్ కిషన్ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఫార్మాట్లో ఇంత వరకు ఏ ఆటగాడికి సాధ్యం కాని ఫీట్‌తో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దేశవాళీ టీ20 టోర్నమెంట్ సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ-2025లో ఇషాన్ కిషన్ (Ishan Kishan) తన సొంత జట్టు జార్ఖండ్‌కు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న విషయ తెలిసిందే.
182 పరుగులు
ఈ టోర్నీలో ఎలైట్ గ్రూప్ ‘డి’లో భాగంగా ఆదివారం జరిగిన పోరులో జార్ఖండ్... త్రిపుర (Jharkhand vs Tripura) జట్టుతో తలపడింది. అహ్మదాబాద్ వేదికగా టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది.
విజయ్ శంకర్ (41 బంతుల్లో 59; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ శతకం చేయగా... బ్రికమ్ కుమార్ దాస్ (29 బంతుల్లో 42; 6 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ మణిశంకర్ (21 బంతుల్లో 42; 5 సిక్స్‌లు) రాణించారు.
సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్
జార్ఖండ్ బౌలర్లలో వికాస్ సింగ్, అనుకూల్ రాయ్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం లక్ష్యఛేదనలో జార్ఖండ్ 17.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసి గెలుపొందింది.
కెప్టెన్ ఇషాన్ కిషన్ (50 బంతుల్లో 113 నాటౌట్; 10 ఫోర్లు, 8 సిక్స్‌లు) అజేయ శతకంతో చెలరేగాడు. విరాట్ సింగ్ (40 బంతుల్లో 53 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీతో అతడికి అండగా నిలిచాడు.
ఫలితంగా జార్ఖండ్ 8 వికెట్ల తేడాతో త్రిపురను చిత్తు చేసి గెలుపు నమోదు చేసింది. సెంచరీతో కదం తొక్కిన ఇషాన్ కిషన్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా
టీ20 ఫార్మాట్లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా వ్యవహరిస్తూ ఇషాన్ కిషన్ సాధించిన మూడో సెంచరీ ఇది. తద్వారా క్రికెట్ ప్రపంచంలో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా ఈ చోటా డైనమైట్ నిలిచాడు.
గతంలో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (SMAT) 2018-19 సీజన్‌లో జార్ఖండ్ సారథిగా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు శతకాలు బాదాడు ఇషాన్. అంతకు ముందు ఆస్ట్రేలియా దిగ్గజం ఆడం గిల్‌క్రిస్ట్ టీ20 ఫార్మాట్లో మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ పంజాబ్ (పంజాబ్ కింగ్స్) కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ రెండు సెంచరీలు చేశాడు.
టీ20 క్రికెట్‌లో ఒకే మ్యాచ్‌లో కెప్టెన్‌గా, వికెట్ కీపర్‌గా ఉంటూ అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్లు
🏏ఇషాన్ కిషన్ (ఇండియా)- జార్ఖండ్ తరఫున 3 శతకాలు
🏏ఆడం గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా)- మిడిల్‌స్సెక్స్, కింగ్స్ ఎలెవన్ తరఫున కలిని 2 శతకాలు
🏏మొహమ్మద్ రిజ్వాన్ (పాకిస్తాన్)- ముల్తాన్ సుల్తాన్స్ తరఫున 2 శతకాలు.
చదవండి: నాకు 37 ఏళ్లు.. అప్పటి వరకు ఆడుతూనే ఉంటా: కుండబద్దలు కొట్టిన కోహ్లి


