సౌతాఫ్రికాతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్ శుభారంభం చేసింది. రాంచీ వేదికగా జరిగిన తొలి వన్డేలో 17 పరుగుల తేడాతో టీమిండియా విజయం సాధించింది. బుధవారం (డిసెంబర్ 3) జరగనున్న రెండో వన్డేలో కూడా ప్రోటీస్‌ను చిత్తు చేసి సిరీస్‌ను సొంతం చేసుకోవాలని రాహుల్ సేన పట్టుదలతో ఉంది.
అయితే ఈ మ్యాచ్‌కు ముందు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు (BCCI) అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ మీటింగ్‌కు టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అజిత్ అగార్కర్‌తో పాటు మరికొంత మంది ఉన్నత అధికారులు హాజరు కానున్నట్లు సమాచారం. సౌతాఫ్రికా చేతిలో టెస్టు సిరీస్ ఓటమికి గల కారణాలను, భవిష్యత్తు ప్రణాళికలను గంభీర్, అగార్కర్‌తో బీసీసీఐ చర్చించే అవకాశముంది.
బీసీసీఐ సీరియస్?
"హోమ్ టెస్టు సీజన్‌లో మాకు కొన్ని ఫలితాలు తీవ్ర నిరాశ కలిగించాయి. ఈ సీజన్‌లో మైదానంలోనూ, బయట కొన్ని గందరగోళ వ్యూహాలు కనిపించాయి. వాటిపై మాకు స్పష్టత కావాలి. మా తదుపరి టెస్టు సిరీస్‌కు ఇంకా ఎనిమిది నెలల సమయం మిగిలి ఉంది. అందుకోసం ముందుస్తు ప్రణాళికలను కోచ్, చీఫ్ సెలక్టర్ నుంచి అడిగి తెలుసుకోవాలనుకుంటున్నాము.
అంతేకాకుండా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో భారత్ డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో బరిలోకి దిగనుంది. ఆ తర్వాత వన్డే ప్రపంచకప్‌లో కూడా టీమిండియా టైటిల్ ఫేవరేట్‌గా ఉంది. కాబట్టి ఈ రెండు మెగా ఈవెంట్లను దృష్టిలో ఉంచుకుని ప్రస్తుత సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోర్డు భావిస్తోంది" అని బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు.
కాగా టీమ్‌మెనెజ్‌మెంట్‌కు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మ వంటి సీనియర్ ఆటగాళ్ల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందనే ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సమావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ మీటింగ్‌కు బీసీసీఐ కొత్త బాస్ మిథున్ మన్హాస్ హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ లేదు.
అయితే ఈ సమావేశం మ్యాచ్ రోజే జరగనుండడంతో సీనియర్ ప్లేయర్లు మాత్రం దూరంగా ఉండనున్నారు. ఇక టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్ కావడంతో గంభీర్‌పై తీవ్ర స్ధాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. వెంటనే అతడిని కోచ్ పదవి నుంచి తప్పించాలని చాలా డిమాండ్ చేశారు.
గంభీర్ మాత్రం బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పుకొచ్చాడు. అయితే ఇప్పటిలో గంభీర్ హెడ్‌కోచ్ పదవికి ఎటువంటి ముప్పులేదు. ఒప్పందం ప్రకారం వన్డే ప్రపంచకప్-2027 వరకు భారత హెడ్ కోచ్‌గా కొనసాగే అవకాశముంది.
చదవండి: వాళ్ల పోరాటం అద్భుతం: టీమిండియాకు మాజీ కెప్టెన్ వార్నింగ్


