టెస్టుల్లో సౌతాఫ్రికా చేతిలో వైట్‌వాష్‌కు గురైన టీమిండియా వన్డే సిరీస్‌లో మాత్రం శుభారంభం చేసింది. సమిష్టి కృషితో రాణించి మొదటి వన్డేలో విజయం సాధించింది. అయితే, సఫారీలు సైతం ఓటమిని అంత తేలికగా అంగీకరించలేదు.
యాన్సెన్ మెరుపు ఇన్నింగ్స్
టీమిండియా విధించిన 350 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో కేవలం పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయినా.. ఆఖరి వరకు ప్రొటిస్ జట్టు గట్టిగా పోరాడింది. నాలుగో నంబర్ ఆటగాడు మ్యాథ్యూ బ్రీట్జ్‌కే (80 బంతుల్లో 72) ఆచితూచి ఆడగా.. పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ మార్కో యాన్సెన్ (Marco Jansen) మెరుపు ఇన్నింగ్స్ (39 బంతుల్లోనే 70)తో దుమ్ములేపాడు.
ఓ దశలో యాన్సెన్ సెంచరీ దిశగా పయనించగా.. కుల్దీప్ యాదవ్ (Kuldeep Yadav) అద్భుత బంతితో అతడిని వెనక్కి పంపించాడు. బ్రీట్జ్కే, యాన్సెన్ నిష్క్రమించిన తర్వాత సఫారీ జట్టు ఓటమి ఖాయమనే అంచనాలు ఏర్పడగా.. మరో పేస్ బౌలింగ్ ఆల్‌రౌండర్ కార్బిన్ బాష్ (Corbin Bosch) అద్భుత పోరాట పటిమ కనబరిచాడు.
బాష్ ఒంటరి పోరాటం
ఓవైపు వికెట్లు పడుతున్నా తనదైన శైలిలో బ్యాటింగ్ చేస్తూ జట్టును విజయం దిశగా నడిపించాడు. ఆఖరి ఓవర్ వరకు బాష్ పట్టుదలగా నిలబడి అర్ధ శతకం (51 బంతుల్లో 67) పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో చివరి ఓవర్లో సౌతాఫ్రికా విజయ సమీకరణం పద్దెనిమిది పరుగులుగా మారగా.. బాష్ జోరు టీమిండియాను భయపెట్టింది.
అయితే, ప్రసిద్ కృష్ణ వేసిన తొలి బంతికి పరుగు రాబట్టలేకపోయిన బాష్.. రెండో బంతికి రోహిత్ శర్మకు క్యాచ్ ఇచ్చి పదో వికెట్‌గా వెనుదిరిగాడు. ఫలితంగా పదిహేడు పరుగుల తేడాతో టీమిండియా గట్టెక్కింది.
ఈ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం, మాజీ కెప్టెన్ సునిల్ గావస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. సౌతాఫ్రికా పోరాట పటిమను ప్రశంసిస్తూ.. అదే సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని, ఆటలో అలసత్వం వద్దని భారత జట్టును హెచ్చరించాడు. ఈ మేరకు..
వాళ్ల పోరాటం అద్భుతం
‘‘సౌతాఫ్రికా జట్టు పోరాడిన తీరు అద్భుతం. వారి ఆట కనువిందు చేసింది. చివరి ఓవర్ వరకు వాళ్లు పట్టువీడలేదు. ఇలాంటి ఆటను అందరూ ఆరాధిస్తారు. ఓడినా సరే వారిని ప్రశంసించతప్పదు.
పదకొండు పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టు.. ఇంతలా పుంజుకుని ఆఖరి వరకు గట్టి పోటీనివ్వడం నిజంగా అద్భుతం లాంటిదే.
జాగ్రత్త అంటూ వార్నింగ్
తదుపరి రెండు మ్యాచ్‌లలో టీమిండియా జాగ్రత్తగా ఉండాలి. తమ ఆట తీరుతో సఫారీలు గట్టి హెచ్చరికనే జారీ చేశారు’’ అని గావస్కర్ స్టార్ స్పోర్ట్స్ షో వేదికగా టీమిండియాను హెచ్చరించాడు.
కాగా రాంచి వేదికగా ఆదివారం నాటి తొలి వన్డేలో రోహిత్ శర్మ (57), తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ (60) రాణించగా.. విరాట్ కోహ్లి భారీ శతకం (120 బంతుల్లో 135) రాణించాడు. ఫలితంగా టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి 349 పరుగుల భారీ స్కోరు చేసింది.
లక్ష్య ఛేదనలో సౌతాఫ్రికా 49.2 ఓవర్లలో 332 పరుగులకు ఆలౌట్ కావడంతో.. 17 పరుగుల తేడాతో భారత్ గెలుపొందింది. కుల్దీప్ యాదవ్ నాలుగు వికెట్లు తీయగా.. హర్షిత్ రాణా మూడు, అర్ష్‌దీప్ సింగ్ రెండు, ప్రసిద్ కృష్ణ ఒక వికెట్ తీశారు. తదుపరి బుధ, శనివారాల్లో భారత్- సౌతాఫ్రికా మధ్య మిగిలిన రెండు వన్డేలకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


