రోహిత్‌తో గంభీర్‌ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్‌! | BCCI Angry Gambhir Agarkar Rift With Rohit Virat In The Open: Report | Sakshi
Sakshi News home page

రోహిత్‌తో గంభీర్‌ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!.. బీసీసీఐ సీరియస్‌!

Dec 1 2025 5:07 PM | Updated on Dec 1 2025 5:18 PM

BCCI Angry Gambhir Agarkar Rift With Rohit Virat In The Open: Report

భారత బ్యాటింగ్‌ దిగ్గజాలు విరాట్‌ కోహ్లి, రోహిత్‌ శర్మల భవితవ్యం గరించి క్రికెట్‌ వర్గాల్లో గత కొన్నాళ్లుగా చర్చ జరుగుతోంది. వీరిద్దరు వన్డే ప్రపంచకప్‌-2027 టోర్నమెంట్‌ వరకు కొనసాగుతారా?.. యాజమాన్యం ఇందుకు అనుకూల పరిస్థితులు కల్పిస్తుందా? అనేది దీని సారాంశం.

వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి..
ఇప్పటికే అంతర్జాతీయ టీ20, టెస్టులకు రిటైర్మెంట్‌ ప్రకటించేశారు రో-కో. ఇద్దరూ కేవలం వన్డేల్లోనే కొనసాగుతున్నారు. ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫీ-2025 గెలిచిన కెప్టెన్‌గా రోహిత్‌ (Rohit Sharma).. జట్టులో కీలక ఆటగాడిగా కోహ్లి (Virat Kohli) ఉన్న వేళ.. చీఫ్‌ సెలక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ (Ajit Agarkar) నుంచి అనూహ్య ప్రకటన వచ్చింది.

ఆస్ట్రేలియా పర్యటనకు ముందు రోహిత్‌ను వన్డే కెప్టెన్సీ నుంచి తప్పించి శుబ్‌మన్‌ గిల్‌కు పగ్గాలు అప్పగించినట్లు అగార్కర్‌ తెలిపాడు. వన్డే వరల్డ్‌కప్‌-2027 ఆడేందుకు తాము కట్టుబడిఉన్నామనే హామీ రో-కో నుంచి రాలేదని ఈ సందర్భంగా పేర్కొన్నాడు.

 ఆద్యంతం అద్భుత ఆట తీరుతో
అయితే, ఆసీస్‌ టూర్‌లో అందుకు భిన్నంగా రోహిత్‌- కోహ్లి తమదైన శైలిలో సత్తా చాటారు. తొలి రెండు వన్డేల్లో డకౌట్‌ అయిన కోహ్లి మూడో వన్డేలో రాణించగా.. రోహిత్‌ మాత్రం ఆద్యంతం అద్భుత ఆట తీరుతో అలరించి ప్లేయర్‌ ఆఫ్‌ ది సిరీస్‌గా నిలిచాడు. తాజాగా సొంతగడ్డపై సౌతాఫ్రికాతో తొలి వన్డేలోనూ ఇద్దరూ దుమ్ములేపారు.

రాంచి వేదికగా రోహిత్‌ శర్మ మెరుపు అర్ధ శతకం (51 బంతుల్లో 57) బాదగా.. కోహ్లి ఏకంగా సెంచరీ (120 బంతుల్లో 135) చేశాడు. వన్డేల్లో 52వ, ఓవరాల్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో 83వ శతకం బాది తన బ్యాటింగ్‌లో పస తగ్గలేదని నిరూపించాడు. వీరిద్దరి అద్భుత ఆట తీరు వల్లే టీమిండియా సఫారీలతో తొలి వన్డేల్లో నెగ్గింది.

అగ్రెసివ్‌గా సెలబ్రేషన్స్‌
ఈ నేపథ్యంలో సెంచరీ తర్వాత కోహ్లి మునుపటి కంటే అగ్రెసివ్‌గా సెలబ్రేట్‌ చేసుకోగా.. రోహిత్‌ సైతం కోహ్లి శతక్కొట్టడంతో మురిసిపోయాడు. కోహ్లికి మద్దతుగా చప్పట్లు కొడుతూ వారెవ్వా అన్నట్లుగా రియాక్షన్‌ ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్‌కాగా..రో- కో ఫ్యాన్స్‌ హెడ్‌కోచ్‌ గౌతం గంభీర్‌తో పాటు అగార్కర్‌ను టార్గెట్‌ చేస్తూ పెద్ద ఎత్తున ట్రోల్‌ చేశారు.

 

బీసీసీఐ సీరియస్‌!
ఈ పరిణామాల నేపథ్యంలో గంభీర్‌- అగార్కర్‌లతో రో-కోలకు సఖ్యత పూర్తిగా చెడిందనే ప్రచారం జరుగగా.. బీసీసీఐ వర్గాలు స్పందించాయి. దైనిక్‌ జాగరణ్‌తో మాట్లాడుతూ.. ‘‘గంభీర్‌తో సీనియర్‌ ఆటగాళ్లు రోహిత్‌, కోహ్లిలకు సత్సంబంధాలు లేకుండా పోయాయి. కోచ్‌- ఆటగాళ్ల మధ్య ఉండాల్సిన సఖ్యత వారి మధ్య లోపించింది.

వీరిద్దరి భవితవ్యంపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. రాయ్‌పూర్‌ లేదంటే విశాఖపట్నం వన్డేల తర్వాత ఇందుకు సంబంధించి సమావేశం జరుగుతుంది. ఆస్ట్రేలియా సిరీస్‌లో రోహిత్‌- అగార్కర్‌కు అస్సలు మాటల్లేవు.

ఇక కోహ్లి- గంభీర్‌ కూడా ఎక్కువగా మాట్లాడుకోవడం లేదు. ఇందుకు తోడు రోహిత్‌- కోహ్లి అభిమానులు గంభీర్‌- అగార్కర్‌లను ట్రోల్‌ చేయడం పట్ల బీసీసీఐ సీరియస్‌గా ఉంది’’ అని సదరు వర్గాలు పేర్కొన్నాయి.

రోహిత్‌తో గంభీర్‌ ముచ్చట!.. అవేమీ వద్దన్న కోహ్లి!
ఇదిలా ఉంటే.. సౌతాఫ్రికాతో తొలి వన్డే తర్వాత డ్రెసింగ్‌రూమ్‌లోకి వెళ్లే సమయంలో గంభీర్‌ తలుపు దగ్గరే ఉన్నా కోహ్లి పట్టించుకోకుండా వెళ్లిపోయాడు. మరోవైపు.. హోటల్‌లాబీలో గంభీర్‌తో రోహిత్‌ సీరియస్‌గా ఏదో చర్చిస్తుండగా.. టీమ్‌తో హోటల్‌ సిబ్బంది జట్టు విజయాన్ని సెలబ్రేట్‌ చేసింది.

తాత్కాలిక కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ కేక్‌ కట్‌ చేయగా.. సిబ్బంది కోహ్లిని సైతం రావాల్సిందిగా కోరారు. అయితే, వాళ్లకు థాంక్స్‌ చెబుతూనే.. ‘‘అవేమీ వద్దు’’ అన్నట్లుగా సైగ చేస్తూ కోహ్లి అక్కడి నుంచి నిష్క్రమించాడు. 

చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్‌.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement