వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ ఆండ్రీ రసెల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు వీడ్కోలు పలికాడు. గత పన్నెండు సీజన్లుగా కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) ఫ్రాంచైజీకి ప్రాతినిధ్యం వహిస్తున్న అతడు.. 2026 మినీ వేలానికి ముందు లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు ఆదివారం ప్రకటించాడు. ఈ నేపథ్యంలో కేకేఆర్ సహ యజమాని, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ స్పందిస్తూ.. రసెల్‌ను ఉద్దేశించి ఉద్వేగపూరిత ట్వీట్ చేశాడు.
నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా..
‘‘మాకెన్నో మధురమైన, అద్భుతమైన జ్ఞాపకాలు ఇచ్చినందుకు ధన్యవాదాలు ఆండ్రీ. నీ అద్భుత ఆట తీరుతో క్లిష్ట పరిస్థితుల్లో జట్టును ఆదుకున్నావు. కేకేఆర్ (KKR)కు నువ్వు అందించిన సేవలు మరువలేనివి.
ఇక క్రీడాకారుడిగా నీ జీవితంలో మరో అధ్యాయం మొదలైంది. పవర్ కోచ్‌గా మాతో నీ ప్రయాణం కొనసాగుతుంది. నీ తెలివి, శక్తిని మన ఆటగాళ్లకు బదిలీ చేసెయ్. వారిని చాంపియన్లుగా నిలిపే ఉత్ప్రేరకంగా మారు.
ఏదేమైనా నీ ఒంటిపై కేకేఆర్ తప్ప ఏ జట్టు జెర్సీ అయినా అంత బాగా కనిపించదు ఆండ్రీ. లవ్ యూ రసెల్. ఆటను ప్రేమించే ప్రతి ఒక్కరి తరఫున నేను ఈ మాట చెబుతున్నా’’ అంటూ షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan).. రసెల్‌తో తమ జట్టుకు ఉన్న అనుబంధాన్ని మాటల్లో వ్యక్తపరిచాడు. కాగా... కేకేఆర్ యాజమాన్యం రసెల్ (Andre Russell)ను తమ జట్టు ‘పవర్ కోచ్’గా నియమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
నాలో సిక్స్‌లు కొట్టే సత్తా ఉంది
ఇదిలా ఉంటే.. 2012 నుంచి ఐపీఎల్‌లో ఆడుతున్న 37 ఏళ్ల రసెల్ 2014 నుంచి ఇప్పటి వరకు కేకేఆర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. ఈ నేపథ్యంలో ఐపీఎల్ రిటైర్మెంట్ సందర్భంగా.. ‘కేకేఆర్‌తో బంధం విడదీయలేనిది. ఇప్పటికీ నాలో సిక్స్‌లు కొట్టే సత్తా... మ్యాచ్‌లు గెలిపించగల పట్టుదల ఉన్నాయి. కానీ వీడ్కోలు పలికేందుకు ఇదే సరైన సమయం అని భావించా.
ఇక మీద కొత్త అవతారంలో దర్శనమిస్తా. 2026 సీజన్‌లో అదే ఉత్సాహంతో కేకేఆర్ ‘పవర్ కోచ్’గా పనిచేయనున్నాను. 12 సీజన్‌లుగా కోల్‌కతా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నా. ఇక్కడ నాకెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇతర లీగ్‌ల్లో ఆటగాడిగా కొనసాగుతున్నా... ఐపీఎల్‌లో మాత్రం ప్లేయర్‌గా కాకుండా వేరే బాధ్యతలు నిర్వర్తించనున్నా. ఇంకా ఆడే సత్తా ఉన్నప్పుడే
తప్పుకోవాలనేది నా అభిమతం.
ఎంతో నమ్మకముంచారు
అందుకే ఇంకొన్నాళ్లు ఆడే దమ్ము ఉన్నప్పటికీ ముందే వీడ్కోలు పలుకుతున్నా. ఆటగాడిగా రిటైర్ అయినా... కేకేఆర్ కుటుంబంలో నేనెప్పుడూ భాగమే. ఈ నిర్ణయం తీసుకునే ముందు ఫ్రాంచైజీ యాజమాన్యంతో సుదీర్ఘంగా చర్చించా.
వాళ్లు నాపై ఎంతో నమ్మకముంచారు. ఇన్నాళ్లు మైదానంలో ప్లేయర్‌గా నిర్వర్తించిన బాధ్యతలను ఇకపై ‘పవర్ కోచ్’గా డగౌట్‌లో ఉండి చక్కబెట్టమని సూచించారు. అందుకు అంగీకరించా’ అని రసెల్ వీడ్కోలు సందేశంలో పేర్కొన్నాడు.
కాగా తొలి రెండు సీజన్‌ల పాటు ఢిల్లీ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన రసెల్... ఓవరాల్‌గా ఐపీఎల్‌లో 140 మ్యాచ్‌లాడి 174.18 స్ట్రయిక్‌రేట్‌తో 2,651 పరుగులు చేశాడు. పేస్ ఆల్‌రౌండర్‌గా తన బౌలింగ్‌తోనూ ఎన్నో మ్యాచ్‌ల్లో జట్టుకు విజయాలు అందించిన రసెల్ 123 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
చదవండి: చరిత్ర సృష్టించిన ఇషాన్.. ప్రపంచంలోనే తొలి ప్లేయర్‌గా


