ఐపీఎల్-2026 వేలానికి ముందు డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఇంగ్లండ్ స్టార్ ఆల్‌రౌండర్ లియామ్ లివింగ్‌స్టోన్‌ను విడిచిపెట్టిన సంగతి తెలిసిందే. గత సీజన్ మెగా వేలంలో లివింగ్‌స్టోన్‌ను రూ.8.75 కోట్ల భారీ ధరకు ఆర్సీబీ కొనుగోలు చేసింది. కానీ ఆర్సీబీ యాజమాన్యం నమ్మకాన్ని ఈ ఇంగ్లీష్ క్రికెటర్ నిలబెట్టుకోలేకపోయాడు.
ఎనిమిది మ్యాచ్‌లలో కేవలం 16 సగటుతో 112 పరుగులు చేసి తీవ్ర నిరాశపరిచాడు. దీంతో అతడిని వేలంలో బెంగళూరు ఫ్రాంచైజీ విడిచిపెట్టింది. వారి పర్స్ బలాన్ని పెంచుకోవడం కోసం ఆర్సీబీ ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో బెంగళూరు జట్టుకు టీమిండియా మాజీ ప్లేయర్ మహ్మద్ కైఫ్ కీలక సూచన చేశాడు.
వచ్చే నెలలో జరగనున్న మినీ వేలంలో లివింగ్‌స్టోన్‌ను తక్కువ ధరకు తిరిగి కొనుగోలు చేయాలని కైఫ్ అభిప్రాయపడ్డాడు. కృనాల్ పాండ్యా, సుయాష్ శర్మతో పాటు మూడో స్పిన్నర్‌గా లివింగ్‌స్టోన్‌ను ఉపయోగించుకోవచ్చని అతడు తెలిపాడు.
"ఐపీఎల్-2026 మినీ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లియామ్ లివింగ్‌స్టోన్‌ను తిరిగి కొనుగోలు చేసే అవకాశం ఉంది. వారు తమ పర్స్ బలాన్ని పెంచుకోవడం కోసం అతడిని వేలంలోకి విడిచిపెట్టి ఉండొచ్చు. గత సీజన్‌లో లివింగ్‌స్టోన్‌పై భారీ మొత్తాన్ని వెచ్చించారు.
కాబట్టి ఈసారి ఆ మొత్తంతో ఇద్దరు ఆటగాళ్లను కొనుగోలు చేసేందుకు ఆర్సీబీ ప్రయత్నించవచ్చు. లివింగ్‌స్టోన్‌కు అద్భుతమైన ఆల్‌రౌండ్ స్కిల్స్ ఉన్నాయి. ఆర్సీబీ ఒకవేళ పుణే(హోం గ్రౌండ్)లో ఆడితే అతడు మూడో స్పిన్నర్‌గా ఉపయోగపడతాడు.
అదేవిధంగా వేలంలో ఉత్తరాఖండ్ పేసర్ ఆకాశ్ మధ్వల్ కోసం ఆర్సీబీ ప్రయత్నించాలి. గత సీజన్‌లో రాజస్తాన్ రాయల్స్ అతడిని సరిగ్గా ఉపయోగించుకోలేదు. అతడు చాలా తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. పిచ్ కాస్త డ్రైగా ఉంటే అతడు బంతిని అద్భుతంగా సీమ్ చేయగలడు. అదే అతడి బలం" అని తన యూట్యూబ్ ఛానల్‌లో కైఫ్ పేర్కొన్నాడు. కాగా ఐపీఎల్-2026 మినీ వేలం డిసెంబర్ 16న అబుదాబి వేదికగా జరిగే అవకాశముంది.
చదవండి: Ashes: ఆస్ట్రేలియా సంచలన నిర్ణయం.. 75 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి


