
టీమిండియా సీనియర్ పేసర్ మహ్మద్ షమీ (Mohammed Shami) వ్యాఖ్యలపై చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ (Ajit Agarkar) స్పందించాడు. షమీ నిజంగానే ఫిట్‌గా ఉండి ఉంటే కచ్చితంగా జట్టులో ఉండేవాడని తమ నిర్ణయాన్ని సమర్థించుకున్నాడు. ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ-2025 (ICC Champions Trophy)లో చివరగా టీమిండియాకు ఆడాడు షమీ.
టాప్ వికెట్ టేకర్
ఈ వన్డే మెగా టోర్నీలో తొమ్మిది వికెట్లు తీసిన షమీ.. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తితో కలిసి సంయుక్తంగా టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయినప్పటికీ ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో ఈ రైటార్మ్ పేసర్‌కు సెలక్టర్లు చోటివ్వలేదు.
అప్‌డేట్ లేదన్న అగార్కర్
ఈ విషయం గురించి జట్టు ప్రకటన సందర్భంగా అగార్కర్ మాట్లాడుతూ.. షమీ ఫిట్‌నెస్ గురించి తమకు అప్‌డేట్ లేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో షమీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.. తాను పూర్తి ఫిట్‌గా ఉన్నట్లు తెలిపాడు. రంజీలు ఆడగలిగే తాను వన్డేల్లో ఆడలేనా అంటూ సెలక్టర్ల తీరుపై విమర్శలు గుప్పించాడు.
షమీ కౌంటర్
ఫిట్‌నెస్ గురించి ఎవరైనా తనను అడిగితే సమాధానం ఇస్తానే తప్ప.. తనంతట తానే ఫిట్‌గా ఉన్నానని చెప్పలేను కదా అంటూ అగార్కర్‌కు కౌంటర్ ఇచ్చాడు. తద్వారా సెలక్షన్ సమయంలో తనను ఎవరూ సంప్రదించలేదనే సంకేతాలు ఇచ్చాడు. ఈ విషయం గురించి అగార్కర్ తాజాగా స్పందించాడు.
అగార్కర్ స్పందన ఇదే
ఎన్‌డీటీవీ వరల్డ్ సమ్మిట్‌కు హాజరైన అగార్కర్.. షమీ పట్ల తమ నిర్ణయం సరైందేనని పేర్కొన్నాడు. ‘‘ఒకవేళ అతడు నేరుగా మాట్లాడి ఉంటే.. అందుకు నేను సమాధానం ఇచ్చేవాడిని. కానీ అతడు సోషల్ మీడియాలో ఏ ఉద్దేశంతో మాట్లాడాడో తెలియదు.
ఒకవేళ నేను ఈ విషయం గురించి చదివి ఉంటే.. అతడికి ఫోన్ ద్వారానైనా జవాబు ఇచ్చేవాడిని. ప్రతి ఒక్క ప్లేయర్ కోసం నా ఫోన్ ఎల్లప్పుడూ ఆన్‌లోనే ఉంటుంది. గత కొన్నినెలలుగా అతడితో నేను తరచూ చాట్ చేస్తూనే ఉన్నాను.
ఏం జరుగుతుందో చూద్దాం
కానీ మీకు ఇక్కడ హెడ్‌లైన్ ఇచ్చేలా ఏమీ మాట్లాడదలచుకోలేదు. టీమిండియా తరఫున అద్భుత ప్రదర్శనలు ఇచ్చిన ఘనత షమీకి ఉంది. ఏదేనా ఉంటే పరస్పరం మాట్లాడుకుంటాం.
ఇంగ్లండ్ పర్యటనకు ముందు కూడా.. తను ఫిట్‌గా ఉంటే కచ్చితంగా టూర్‌కు పంపిస్తామని చెప్పాము. దురదృష్టవశాత్తూ అప్పుడు అతడు ఫిట్‌గా లేడు. ఇక దేశీ క్రికెట్ సీజన్ ఇప్పుడే ఆరంభమైంది కదా.. ఏం జరుగుతుందో చూద్దాం’’ అని పేర్కొన్నాడు.
అయితే, ఇంగ్లండ్‌తో టెస్టులకు సిద్ధంగా లేకపోయినా.. వన్డే ఫార్మాట్‌కు తాను ఫిట్‌గా ఉన్నానని షమీ చెప్పగా.. అగార్కర్ మాత్రం ఇలా స్పందించడం గమనార్హం.ఇదిలా ఉంటే.. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ కోసం టీమిండియా ఇప్పటికే అక్కడికి చేరుకుంది. అక్టోబరు 19- నవంబరు 8 వరకు ఇరుజట్ల మధ్య మూడు వన్డేలు, ఐదు టీ20 మ్యాచ్‌ల నిర్వహణకు షెడ్యూల్ ఖరారైంది.
చదవండి: ‘భర్త కంటే ‘బాబా’నే ఎక్కువ!.. తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. అతడికి రూ. 15 లక్షల గిఫ్ట్!’