
సహచర ఆటగాడు హర్భజన్ సింగ్‌తో యువీ (పాత ఫొటో)
టీమిండియా దిగ్గజ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ తండ్రి, కోచ్ యోగ్‌రాజ్ సింగ్ ((Yograj Singh) ) మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తన కుమారుడికి తండ్రి కంటే.. ఓ ‘బాబా’నే ఎక్కువైపోయాడన్నాడు.
తన మాజీ భార్య షబ్నమ్ (Shabnam)కు భర్త కంటే ‘బాబా’కు సేవ చేయడం అంటేనే ఎక్కువ ఇష్టం అని పేర్కొన్నాడు. కాగా అంతర్జాతీయ క్రికెట్‌లో ఏడాది కాలం భారత్‌కు ప్రాతినిథ్యం వహించిన యోగ్‌రాజ్ సింగ్ విజయవంతమైన క్రికెటర్ కాలేకపోయాడు.
యువీ తల్లితో విడాకులు
అయితే, తన కలను కుమారుడి ద్వారా నెరవేర్చుకోవాలనే ఉద్దేశంతో యువరాజ్ సింగ్ (Yuvraj Singh)ను చిన్ననాటి నుంచే కఠినంగా శ్రమించేలా చేశాడు. ఈ క్రమంలో కుమారుడితో పాటు భార్య షబ్నమ్‌కు కూడా దూరమయ్యాడు. తన పితృస్వామ్య భావజాలం కారణంగా షబ్నమ్‌తో పెళ్లి పెటాకులై విడాకులకు దారి తీసింది.
ఆ తర్వాత నీనా బుంధేల్ అనే నటిని పెళ్లి చేసుకున్న యోగ్‌రాజ్ సింగ్‌కు ఆమె ద్వారా ఓ కుమార్తె, కుమారుడు కలిగారు. ఇక షబ్నమ్ ద్వారా అతడికి యువరాజ్ సింగ్, జొరావర్ జన్మించారు. అయితే, తన మొండిపట్టుదల కారణంగానే యువీ, అతడి తల్లి షబ్నమ్ తనను విడిచిపెట్టి వెళ్లిపోయారని.. వీలైతే తనను క్షమించాలంటూ ఇటీవల యోగ్‌రాజ్ వేడుకున్నాడు.
నేనొక పాపిని
అయితే, తాజా ఇంటర్వ్యూలో మరోసారి యువీ, షబ్నమ్‌లను ఉద్దేశించి యోగ్‌రాజ్ సింగ్ సంచలన ఆరోపణలు చేశాడు. అన్‌టోల్డ్ పంజాబ్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘‘నేనొక పాపిని. నా జీవితంలో చాలా తప్పులు చేశాను. ఆ దేవుడే నన్ను అన్ని విషయాల్లో శిక్షితుడిని చేశాడని భావించా.
నేను దేవుడిని నమ్ముతాను. జేబులో కేవలం ఐదు రూపాయలే ఉన్నపుడు నాకు రూ. 5 లక్షల సినిమా ఆఫర్ వచ్చింది. భాగ్ మిల్కా భాగ్‌లో నన్ను ఓ పాత్ర కోసం సంప్రదించారు.
భర్త కంటే బాబానే ఎక్కువ
నా దృష్టిలో గురు గ్రంథ్ సాహిబ్ కంటే మించినది ఏదీ లేదు. హన్సాలీ వాలే బాబా వంటి నాయకులను నేను నమ్మను. వీరిలో కొందరు నిజంగానే మంచివారై ఉండవచ్చు. కానీ భర్త పాదాలు ఒత్తడాన్ని నామూషీగా భావించేవాళ్లు.. భర్త కోసం వండిపెట్టలేని వారు.. ఇలాంటి బాబాల కోసం మాత్రం భోజనం వండటంతో పాటు సేవలు చేయడానికి సిద్ధమైపోతారు.
అందరినీ ఉద్దేశించి అంటున్న మాట ఇది. కేవలం నా ఇంట్లోనే ఇలా జరిగిందని చెప్పను’’ అని పరోక్షంగా షబ్నమ్ గురించి యోగ్‌రాజ్ సింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.
తండ్రి కోసం కుర్తా కొనలేని వాడు.. ‘బాబా’ కేమో రూ. 15 లక్షల గిఫ్ట్!
అదే విధంగా.. ‘‘తండ్రిగా రక్తం పంచి.. చెమట చిందిస్తూ కష్టనష్టాలకోర్చి పెంచి పెద్ద చేసి.. కన్నీళ్లు దిగమింగుకుంటూ నిన్ను ఉన్నత శిఖరాలకు చేర్చిన వ్యక్తి కంటే నీకు బాబా ఎక్కువైపోయాడా?
కుటుంబాన్ని పోషిస్తూ.. పిల్లల ఎదుగుదల కోసం సర్వస్వం ధారబోసిన వ్యక్తి.. తనకంటూ ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయని వ్యక్తి.. అలాంటి నీ తండ్రి కోసం కనీసం ఒక్క కుర్తా- పైజామా కొనలేవు. కానీ బాబాకు రూ. 15 లక్షల వాచ్ బహుమతిగా ఇస్తావా?
నాకోసం ఇల్లు కొంటానని ఎవరూ ఎలాంటి ఆఫర్ ఇవ్వలేదు. వీళ్లేం బంధువులు? వీళ్లేం పిల్లలు’’ అంటూ యువీని ఉద్దేశించి యోగ్‌రాజ్ సింగ్ ఆరోపణలు చేశాడు. కాగా క్రికెట్ కోచ్‌గా ఉంటూనే..నటుడిగా మారిన యోగ్‌రాజ్ సింగ్ ఇప్పటికి 200కు పైగా సినిమాల్లో నటించాడు.
చదవండి: మా అమ్మకి 19 ఏళ్లు.. నాన్నకు 60.. నా కూతురే నా పరువు.. హద్దు దాటితే అంతే!