
పాకిస్తాన్ టీ20 క్రికెట్ జట్టుకు కొత్త కెప్టెన్ రానున్నాడా? అంటే అవునానే అంటున్నాయి పీసీబీ వర్గాలు. టీ20 ప్రపంచకప్-2026కు ముందు పాకిస్తాన్ కెప్టెన్సీలో మార్పు చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. తమ జట్టు టీ20 కెప్టెన్‌గా స్టార్ ఆల్‌రౌండర్ షాదాబ్ ఖాన్‌ను నియమించాలని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు భావిస్తున్నట్లు సమాచారం.
భుజం గాయం కారణంగా ఆసియా కప్‌కు దూరమైన షాదాబ్ ఖాన్.. తిరిగి జట్టులోకి వచ్చేందుకు సిద్దమయ్యాడు. షాదాబ్ ప్రస్తుతం పాక్ టీ20 జట్టుకు వైస్ కెప్టెన్‌గా ఉన్నాడు. అయితే ప్రస్తుత కెప్టెన్ అఘా సల్మాన్ స్థానంలో షాదాబ్‌కు బాధ్యతలు అప్పగించేందుకు పీసీబీ సిద్దమైందంట.
సల్మాన్ అఘా నాయకత్వంలో పాకిస్తాన్ 30 టీ20 మ్యాచ్‌లలో 17 విజయాలు సాధించినప్పటికీ.. అతడి బ్యాటింగ్ ప్రదర్శన మాత్రం దారుణంగా పడిపోయింది. ఆసియాకప్-2025లో 7 మ్యాచ్‌లు ఆడిన అఘా.. 12 సగటుతో 72 పరుగులు చేశాడు.
ఆఖరికి ఒమన్, యూఏఈ వంటి పసికూనలపై కూడా అతడు రాణించలేకపోయాడు. అంతేకాకుండా ఈ ఖండాంతర టోర్నీలో పాక్ భారత్‌పై ఆడిన మూడు మ్యాచ్‌లలోనూ ఓటమి పాలైంది. ఈ ప్రభావం సల్మాన్ కెప్టెన్సీపై పడింది. ఈ క్రమంలోనే నాయకత్వ మార్పుకు పీసీబీ రెడీ అయ్యినట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి.
పాకిస్తాన్ తరపున ఇప్పటివరకు 112 టీ20 మ్యాచ్‌లు ఆడిన షాదాబ్.. 112 వికెట్లతో పాటు 792 పరుగులు సాధించాడు. కెప్టెన్‌గా కూడా అతడు అనుభవం ఉంది. పాకిస్తాన్ సూపర్ లీగ్ (PSL) లో ఇస్లామాబాద్ యునైటెడ్ జట్టుకు కెప్టెన్‌గా టైటిల్‌ను అందించాడు.
చదవండి: అఫ్గాన్ చేతిలో వైట్ వాష్.. బంగ్లాదేశ్ క్రికెటర్ల వాహనాలపై దాడి!