
యూఏఈ వేదికగా అఫ్గానిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో 3-0 తేడాతో బంగ్లాదేశ్ వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. టీ20 సిరీస్‌ను సొంతం చేసుకున్న బంగ్లా టైగర్స్.. వన్డేల్లో మాత్రం ప్రత్యర్ధి ముందు పూర్తిగా తేలిపోయారు. మెహిదీ హసన్ మిరాజ్ నాయకత్వంలోని బంగ్లా జట్టు మొదటి వన్డేలో 5 వికెట్ల తేడాతో ఓడిపోగా, రెండో వన్డేలో 81 పరుగులు, చివరి మ్యాచ్‌లో 200 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలైంది.
అయితే యూఏఈ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన బంగ్లా జట్టుకు ఊహించని షాక్ తగిలింది. అఫ్గాన్ చేతిలో ఓటమిని జీర్ణించుకోలేకపోయిన బంగ్లా అభిమానులు మెహదీ బృందంపై దాడికి యత్నించినట్లు తెలుస్తోంది. తొలుత విమానాశ్రయంలో ఆటగాళ్లను ఫ్యాన్స్ హేళన చేయగా.. అనంతరం వారు ప్రయత్నిస్తున్న వాహనాలపై దాడి చేసి నట్లు పలు రిపోర్ట్‌లు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ ఆటగాడు మొహమ్మద్ నయీమ్ షేఖ్ సోషల్ మీడియాలో భావోద్వేగ నోట్‌ను షేర్ చేశాడు.
"మేము మైదానంలో దేశం బరువు బాధ్యతలనూ మోస్తూ ఆడుతున్నాము. ఎరుపు-ఆకుపచ్చ జెండా మా జెర్సీలపైనే కాదు, మా రక్తంలో కూడా ఉంది. దేశం గర్వపడేలా ఆడేందుకు ప్రతీ మ్యాచ్‌లోనూ ప్రయత్నిస్తాం. ప్రతీ క్రీడలోనూ గెలుపోటములు సహజం. కొన్నిసార్లు గెలుస్తాం, కొన్నిసార్లు ఓడిపోతాం.
మీరు కూడా దేశాన్ని ప్రేమిస్తున్నారు కాబట్టి మేము ఓడిపోయినప్పుడు బాధ కలుగుతుందని నాకు తెలుసు. కానీ మాపై అంత ద్వేషం చూపడం సరికాదు. వాహనాలపై దాడులు నన్ను తీవ్రంగా బాధించాయి. మేము మళ్లీ తిరిగి బలంగా పుంజుకుంటామని" నయీమ్ పేర్కొన్నాడు. కాగా అఫ్గాన్ చేతిలో వైట్‌వాష్ అయిన తొలి ఆసియా జట్టుగా బంగ్లాదేశ్ చెత్త రికార్డు మూట కట్టుకుంది.
చదవండి: IND vs SA: ఇండియా టూర్.. సౌతాఫ్రికా జట్టు ప్రకటన! కెప్టెన్ ఎవరంటే?