
అఫ్గనిస్తాన్ క్రికెట్ జట్టు బంగ్లాదేశ్‌పై సంచలన విజయం సాధించింది. మూడో వన్డేలో బంగ్లా (Afg vs Ban)ను ఏకంగా 200 పరుగుల తేడాతో చిత్తు చిత్తుగా ఓడించింది. తద్వారా సౌతాఫ్రికా (South Africa) పేరిట ఉన్న రికార్డును బద్దలు కొట్టి సరికొత్త చరిత్ర లిఖించింది. ఇంతకీ అదేమిటి అంటారా?!..
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) వేదికగా ఆసియా దేశాలు బంగ్లాదేశ్- అఫ్గనిస్తాన్ మూడు టీ20, మూడు వన్డేల సిరీస్‌లు ఆడాయి. తొలుత టీ20 సిరీస్‌లో బంగ్లా.. అఫ్గన్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేయగా.. వన్డేల్లో అఫ్గన్.. బంగ్లాను 3-0తో మట్టికరిపించి ప్రతీకారం తీర్చుకుంది.
ఇక షార్జాలో బంగ్లా- అఫ్గన్ టీ20 మ్యాచ్‌లు జరుగగా.. అబుదాబి వేదికగా వన్డే సిరీస్ సాగింది. ఇందులో భాగంగా తొలి మ్యాచ్‌లో బంగ్లాను ఐదు వికెట్ల తేడాతో ఓడించిన అఫ్గన్.. రెండో వన్డేలో 81 పరుగుల తేడాతో జయభేరి మోగించింది. తద్వారా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ కైవసం చేసుకుంది.
200 పరుగుల తేడాతో గెలుపు
ఈ క్రమంలో ఇరుజట్ల మధ్య మంగళవారం అబుదాబిలో నామమాత్రపు మూడో వన్డే జరిగింది. ఇందులో టాస్ గెలిచిన అఫ్గనిస్తాన్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 293 పరుగులు సాధించింది. ఓపెనర్లు రహ్మనుల్లా గుర్బాజ్ (42), ఇబ్రహీం జద్రాన్ (95)లతో పాటు వెటరన్ బ్యాటర్ మహ్మద్ నబీ (37 బంతుల్లో 62 నాటౌట్) గొప్పగా రాణించాడు.
అనంతరం లక్ష్య ఛేదనలో బంగ్లాదేశ్‌ను 93 పరుగులకే ఆలౌట్ చేసిన అఫ్గనిస్తాన్.. ఏకంగా 200 పరుగుల తేడాతో విజయఢంకా మోగించింది. తద్వారా బంగ్లాతో వన్డే సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది.
ప్రపంచంలోనే తొలి జట్టుగా..
ఇదిలా ఉంటే.. అబుదాబిలో పరుగుల పరంగా వన్డేల్లో ఇదే అతిపెద్ద విజయం. అంతకు ముందు సౌతాఫ్రికా ఐర్లాండ్‌పై ఇదే వేదికగా 174 పరుగుల తేడాతో గెలిచి ఆల్‌టైమ్ రికార్డు సెట్ చేయగా.. అఫ్గనిస్తాన్ బంగ్లాపై 200 పరుగుల తేడాతో గెలిచి ఈ రికార్డును బ్రేక్ చేసింది. తద్వారా అబుదాబి వేదికగా వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం సాధించిన తొలి జట్టుగా నిలిచింది.
అబుదాబిలో వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయాలు సాధించిన జట్లు ఇవే
👉అఫ్గనిస్తాన్- బంగ్లాదేశ్‌పై 200 పరుగుల తేడాతో గెలుపు- 2025
👉సౌతాఫ్రికా- ఐర్లాండ్‌పై 174 పరుగుల తేడాతో గెలుపు- 2024
👉స్కాట్లాండ్- అఫ్గనిస్తాన్‌పై 150 పరుగుల తేడాతో గెలుపు- 2015.
చదవండి: BCCI: రోహిత్, కోహ్లిలకు ఇదే ఆఖరి సిరీస్!.. స్పందించిన బీసీసీఐ
𝐓𝐡𝐚𝐭 𝐰𝐢𝐧𝐧𝐢𝐧𝐠 𝐟𝐞𝐞𝐥𝐢𝐧𝐠! 🙌👏#AfghanAtalan | #AFGvBAN2025 | #GloriousNationVictoriousTeam pic.twitter.com/fqy0vLwdut
— Afghanistan Cricket Board (@ACBofficials) October 14, 2025