భారత మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ హరేంద్ర రాజీనామా  | Indian womens hockey team coach Harendra Singh resigns | Sakshi
Sakshi News home page

భారత మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ హరేంద్ర రాజీనామా 

Dec 2 2025 12:34 AM | Updated on Dec 2 2025 12:34 AM

Indian womens hockey team coach Harendra Singh resigns

న్యూఢిల్లీ: భారత సీనియర్‌ మహిళల హాకీ జట్టు చీఫ్‌ కోచ్‌ పదవి నుంచి హరేంద్ర సింగ్‌ తప్పుకున్నాడు. వ్యక్తిగత కారణాలతో తాను రాజీనామా చేస్తున్నట్లు అతను సోమవారం ప్రకటించాడు. గత ఏడాది ఏప్రిల్‌లో హరేంద్ర బాధ్యతలు తీసుకున్న తర్వాత భారత మహిళల బృందం ఆసియా చాంపియన్స్‌ ట్రోఫీలో విజేతగా నిలిచింది. అయితే ఎఫ్‌ఐహెచ్‌ ప్రొ లీగ్‌ 2024–25 సీజన్‌లో ఆఖరి స్థానంతో సరిపెట్టుకొని దిగువ స్థాయికి పడిపోయింది. 

ఆడిన 16 మ్యాచ్‌లలో 2 మాత్రమే గెలిచిన జట్టు తర్వాతి సీజన్‌కు అర్హత సాధించడంలో విఫలమైంది. ‘భారత మహిళల హాకీ జట్టుకు శిక్షణ ఇవ్వడం నా కెరీర్‌లో చెప్పుకోదగ్గ విశేషంగా నిలిచిపోతుంది. అయితే వ్యక్తిగత కారణాలతో నేను తప్పుకోవాల్సి వస్తోంది. భవిష్యత్తులో మన జట్టు మరిన్ని విజయాలు సాధించాలని కోరుకుంటున్నా’ అని హరేంద్ర పేర్కొన్నాడు. 

అయితే బయటకు వ్యక్తిగత కారణం అని చెబుతున్నా... ప్రదర్శన బాగా లేకపోవడంతో రాజీనామా చేయాలని హాకీ ఇండియా (హెచ్‌ఐ)నే కోరినట్లు సమాచారం. ‘హరేంద్ర అడిగిన ప్రతీ సౌకర్యాలు హెచ్‌ఐ కల్పించింది. అతని ఏ అభ్యర్థననూ కాదనలేదు. కానీ టీమ్‌ ప్రదర్శన మాత్రం పేలవంగా ఉంది. ఫిట్‌నెస్‌పరంగా చూసిన ప్రధాన జట్టులో 13 మంది ఆటగాళ్లు గాయాలపాలయ్యారు. పైగా అతని వ్యవహార శైలి, మహిళా ప్లేయర్ల పట్ల అతని కఠిన వైఖరిపై కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి’ అని హెచ్‌ఐ అధికారి ఒకరు వెల్లడించారు. హరేంద్ర రాజీనామాను ఆమోదించామని ప్రకటించిన హెచ్‌ఐ అధ్యక్షుడు దిలీప్‌ టిర్కీ త్వరలోనే కొత్త కోచ్‌ను ఎంపిక చేస్తామన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement