
అనుభవ లేమితోనే ప్రొ లీగ్‌లో పేలవ ప్రదర్శన
సీనియర్లు లేకపోవడంతో జట్టు డీలా
భారత మహిళల హాకీ జట్టు హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ వ్యాఖ్య
న్యూఢిల్లీ: యువ క్రీడాకారిణులు మరింత బాధ్యతగా ఆడాల్సిన అవసరముందని భారత మహిళల హాకీ జట్టు ప్రధాన కోచ్ హరేంద్ర సింగ్ అన్నాడు. లేకుంటే జట్టు సీనియర్ ప్లేయర్లపై ఎక్కువ ఆధారపడాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. మ్యాచ్‌కు ముందు ఎంత బాగా శిక్షణ పొందినా... ఒక్కసారి మైదానంలో అడుగు పెట్టాక అప్పటికప్పుడు వ్యూహాలు మార్చుకుంటూ ముందుకు సాగితేనే ఫలితాలు అనుకూలంగా వస్తాయని ఆయన వెల్లడించాడు. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్) ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత మహిళల హాకీ జట్టు ఎనిమిది మ్యాచ్‌ల్లోనూ ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలిచింది.
ఈ నేపథ్యంలో హరేంద్ర సింగ్ మాట్లాడుతూ... ‘ప్రొ లీగ్‌లో యువ జట్టుతో బరిలోకి దిగాం. పలువురు అనుభజు్ఞలైన ప్లేయర్లు గాయాలతో యూరప్ అంచె పోటీలకు దూరమవడం ఫలితాలపై ప్రభావం చూపింది. ముఖ్యంగా డిఫెన్స్ మరీ బలహీనంగా మారింది. దీంతో ప్రత్యర్థులు సులువుగా గోల్స్ చేస్తూ జట్టుపై ఒత్తిడి పెంచారు. దీనిపై మరింత కృషి చేయాల్సిన అవసరముంది. అనుభవరాహిత్యం కారణంగా యువ ప్లేయర్లు తాము మైదానంలో ఎక్కడ ఉన్నాం... తమ బాధ్యత ఏంటి అనే విషయంలో కాస్త అయోమయానికి గురయ్యారనేది సుస్పష్టం.
అందుకే పరిస్థితులకు తగ్గట్లు ముందుకు సాగాలి. లేకుంటే తిరిగి సీనియర్ ఆటగాళ్లపైనే భారం మోపాల్సి ఉంటుంది. ఫీల్డ్‌లో నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం పనికిరాదు. ఎంత వేగంగా స్పందిస్తే అంత మెరుగైన ఫలితం సాధించవచ్చు. ప్రత్యర్థి సర్కిల్‌లోకి ప్రవేశిస్తే... గోల్ పోస్ట్‌పై దాడులు చేసేందుకు వెరవకూడదు. పదేపదే దాడులు చేస్తూ ప్రత్యర్థిని ఒత్తిడిలోకి నెడితేనే మ్యాచ్‌పై పట్టు చిక్కుతుంది’ అని అన్నాడు.
సీనియర్లు అందుబాటులో లేకే...
అంతర్జాతీయ స్థాయిలో అపార అనుభవం ఉన్న ప్లేయర్లు వేర్వేరు కారణాలతో జట్టుకు దూరం కావడంతోనే యూరప్ అంచె పోటీల్లో భారత ఆటతీరు మరీ తీసుకట్టులా మారిందని హరేంద్ర సింగ్ అన్నాడు. ‘ప్రొ లీగ్ ప్రారంభానికి ముందు సుశీలా చాను జట్టుకు దూరమైంది. నిక్కీ ప్రధాన్, ఉదిత గాయాలతో ఇబ్బంది పడుతుండటంతో వారికి విశ్రాంతినివ్వాల్సి వచ్చింది. దీంతో ముగ్గురు ప్రధాన డిఫెండర్లు లేకపోవడంతో మన రక్షణ పంక్తి బలహీనపడింది.
యువ స్ట్రయికర్ సంగీత కుమారి కూడా గాయం కారణంగా జట్టుకు దూరమైంది’ అని హరేంద్ర వెల్లడించాడు. ప్లేయర్ల మానసిక బలాన్ని పెంపొందించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు హరేంద్ర అన్నాడు. ఐపీఎల్‌లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) జట్టు ప్లేయర్లకు మానసికంగా దృఢంగా ఉండేవిధంగా శిక్షణ ఇచ్చిన మోహన్ అనే వ్యక్తిని జట్టు సహాయక సిబ్బందిలో చేర్చినట్లు తెలిపారు.
ఒత్తిడిని అధిగమించడం, తక్షణం స్పందించే గుణం వంటి పలు కీలక అంశాల్లో అతడి శిక్షణ మన ప్లేయర్లకు ఎంతగానో ఉపయోగపడనుంది. ఈ ఏడాది సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు హాంగ్జౌ వేదికగా ఆసియ కప్ జరగనుండగా... ఆ లోపు ప్లేయర్లను మానసికంగా మరింత సంసిద్ధం చేస్తామని హరేంద్ర అన్నాడు.
అవకాశాలను వినియోగించుకుంటేనే...
ప్రొ లీగ్ యూరప్ అంచె పోటీల్లో భారత జట్టుకు ఎన్నో అవకాశాలు వచ్చినా... వాటిని సది్వనియోగ పరుచుకోలేకపోయింది. అనుభజు్ఞలు లేకపోవడంతో డిఫెన్స్ విభాగంలో వెనుకబడిన టీమిండియా... అటాకింగ్‌లోనూ ఆకట్టుకోలేకపోయింది. ముఖ్యంగా పెనాల్టీ కార్నర్‌లను గోల్స్‌గా మలచడంలో మనవాళ్లు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరముంది.
‘పెనాల్టీ కార్నర్‌ల విషయంలో చాలా మెరుగపడాల్సి ఉంది. మెరుగైన ప్రత్యర్థులతో తలపడుతున్నప్పుడు ప్రతి అంశంలో పక్కాగా ఉండాలి. అది లోపించడం వల్లే ప్రో లీగ్ నుంచి ఉద్వాసన ఎదురైంది. అయితే ఇక్కడితో ఆగిపోము. ఈ లోపాలను సవరించుకొని మరింత బలంగా పుంజుకుంటాం. ప్రత్యర్థికి పదే పదే పెనాల్టీ కార్నర్ అవకాశాలు ఇవ్వడం దెబ్బకొట్టింది. అయితే సానుకూల అంశాలు కూడా ఉన్నాయి.
మనకంటే మెరుగైన జట్లతో మ్యాచ్‌ల్లో సైతం అమ్మాయిలు ఆకట్టుకున్నారు. కొన్ని తప్పిదాలను పక్కన పెడితే ప్రపంచ స్థాయి ఆటతీరు కనబర్చారు. ఆసియా కప్ ప్రారంభానికి ముందే ఈ తప్పులను సరిదిద్దుకుంటాం. ప్లేయర్లకు పెద్దగా అనుభవం లేదు. వారిని నిందించాలనుకోవడం లేదు. ఏడుగురు ఆటగాళ్లకు ఇదే తొలి ప్రొ లీగ్’ అని హరేంద్ర అన్నాడు.