
హాంగ్జౌ (చైనా): భారత మహిళల హాకీ జట్టు ఆసియా కప్ టోర్నమెంట్ ఫైనల్‌కు దూసుకెళ్లింది. ‘సూపర్–4’ దశ చివరి మ్యాచ్‌లో శనివారం డిఫెండింగ్ చాంపియన్ జపాన్‌తో పోరును భారత జట్టు 1–1 గోల్స్‌తో ‘డ్రా’ చేసుకుంది. భారత్ తరఫున బ్యూటీ డుంగ్ డుంగ్ 7వ నిమిషంలో గోల్ సాధించింది. చివరి క్వార్టర్ వరకు ఆధిక్యాన్ని కొనసాగించిన టీమిండియా... విజయం సాధించడం ఖాయమే అనుకుంటుండగా... 58వ నిమిషంలో కోబయకావా షిహో గోల్‌తో జపాన్ స్కోరు సమం చేసింది.
ఇరు జట్ల మధ్య గ్రూప్ దశలో జరిగిన మ్యాచ్ సైతం ‘డ్రా’గానే ముగిసింది. మరో మ్యాచ్‌లో చైనా 1–0 గోల్స్ తేడాతో దక్షిణ కొరియాపై గెలవడంతో టీమిండియా ఫైనల్‌కు అర్హత సాధించింది. దీంతో ‘సూపర్–4’ దశలో మూడు మ్యాచ్‌లాడిన భారత్ ఒక విజయం, ఒక పరాజయం, ఒక ‘డ్రా’తో 4 పాయింట్లు ఖాతాలో వేసుకొని పట్టిక రెండో స్థానంతో ఫైనల్లో అడుగుపెట్టింది. నేడు జరగనున్న ఫైనల్లో చైనాతో భారత్ తలపడనుంది. ఇందులో గెలిచిన జట్టు వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్ వేదికగా జరగనున్న ప్రపంచకప్‌నకు నేరుగా అర్హత సాధిస్తుంది.