జపాన్ ప్రజల ముఖాల్లో కొత్త ఏడాది సంబురం ఏ మూలన కనిపించడం లేదు. నాన్నా-పులి కథలో మాదిరి.. ఎప్పుడు ఏ ముప్పు ముంచెత్తుతుందా? అని వణికిపోతున్నారు. తాజాగా ఆవోమోరి తీరంలో 7.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. దీనికి కొనసాగింపుగా.. జపాన్ వాతావరణ సంస్థ (JMA) హొక్కైడో–సన్రికు తీరానికి అరుదైన మెగాక్వేక్(megaquake) అడ్వైజరీ జారీ చేసింది.
జేఎంఏ లెక్క ప్రకారం.. మరో వారం రోజుల్లో అక్కడ మెగా భూకంపం సంభవించే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో సునామీ ముప్పు పొంచి ఉంటుంది. దాదాపు 98 అడుగుల ఎత్తున అలలు ఎగసిపడతాయి. ఫలితంగా ఊహకు అందని విషాదం నెలకొనే అవకాశం లేకపోలేదు. భూకంపం సంభవించే అవకాశాలు ఎక్కువే ఉన్నాయని అక్కడి పరిశోధకులు చెబుతున్నారు. ఇదే అక్కడ ఆందోళనకు కారణమైంది. ప్రపంచ చరిత్రలోనే ఈ తరహా ప్రకటన జారీ చేయడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి.
భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 8.0 కన్నా ఎక్కువగా నమోదైతే మెగా భూకంపంగా (Mega Earthquake) పరిగణిస్తారు. భూ ఫలకాల్లో కదలికలు అంటే.. ఒక టెక్టోనిక్ ప్లేట్ మరో దానిలో కూరుకుపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. ఒక్కోసారి దాదాపు వెయ్యి కిలోమీటర్ల మేర చీలిక ఏర్పడొచ్చు. అదే జరిగితే గనుక సముద్ర గర్భం కింద పరిస్థితులతో భారీ సునామీకి కారణమవుతుంది.
అలా అప్రమత్తమై..
జపాన్ చరిత్రలో అత్యంత ప్రమాదకరమైన భూకంపం (Great East Japan Earthquake) 1923లో (కాంటో భూకంపం) సంభవించింది. అప్పుడు రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 8.0గా నమోదైంది. దాదాపు లక్ష నుంచి 1.40 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. ఆపై 2011లో వచ్చిన టోహోకు భూకంపం ఇటీవలి సంవత్సరాల్లో అతిపెద్దది. 9.0 తీవ్రతతో వచ్చిన ఆ భూకంపం దాదాపు ఆరు నిమిషాల పాటు కొనసాగింది. 23 అడుగుల ఎత్తులో ఎగిసిపడిన సునామీ అలలతో దాదాపు 20వేల మంది ప్రాణాల్ని బలిగొంది. ఆ విషాదం నుంచి జపాన్ కొత్త పాఠాలు నేర్చుకుంది. ప్రపంచంలోనే భూకంపాలను ఎదుర్కొనడం కోసం అత్యాధునికమైన ముందస్తు హెచ్చరికల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది.
లక్షల్లో మరణాలు?..
జపాన్ వాతావరణ సంస్థ ఊహించిందే జరిగితే.. భారీగా ప్రాణ నష్టం ఉంటుంది. ఒకవేళ సముద్ర తీరంలో చీలిక సంభవిస్తే మాత్రం దాదాపు 2లక్షల మంది ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి.. ఆస్తి నష్టం కూడా భారీ స్థాయిలోనే ఉంటుంది.
అంతా తూచేనా?
జపాన్ ఉంది ‘పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్’ (Pacific Ring of Fire) వెంట. ఇక్కడ టెక్టానిక్ ప్లేట్లలో కదలికలు ఎక్కువగా ఉండటంతో.. ప్రతి ఐదు నిమిషాలకు ఓసారి ఎక్కడో ఓ చోట ప్రకంపనలు నమోదవుతాయి. ఈ క్రమంలోనే.. ఈ ఏడాది జులై 5వ తేదీన ఏదో జరగబోతోందంటూ ఓ ప్రచారం బాగా జరిగింది. రియో టుత్సుకి అనే కళాకారిణి 1999లో రాసిన ది ఫ్యూచర్ ఐ సా అనే బుక్ ఆధారంగా జపాన్ జనాలు వణికపోయారు.
2025 జూలైలో జపాన్‌లో 2011 తూర్పు జపాన్ సునామీ కంటే 3 రెట్లు పెద్ద విపత్తు వస్తుందని హడావిడి చేశారు. ఊళ్లు ఖాళీ చేసి తరలిపోయారు. ప్రయాణాలు రద్దు చేసుకుని ఇళ్లలో ఉండిపోయారు. ఈ భయాందోళనను ప్రపంచం ఆసక్తిగా తిలకించింది. చివరకు.. ఏం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే.. ఆ సమయంలో సైస్మాలజిస్టులు.. వాతావరణ సంస్థ (JMA) హెచ్చరికలను మాత్రమే నమ్మాలని సూచించారు. ప్రస్తుతం చిషిమా ట్రెంచ్ (హొక్కైడో ద్వీపం), జపాన్ ట్రెంచ్ (సన్‌రికు) వెంట తీవ్ర భూకంపం వచ్చే అవకాశం ఉందని జపాన్ వాతావరణ విభాగం అలర్ట్ జారీ చేసింది. ఇప్పుడు.. నిజంగానే అలాంటి హెచ్చరిక రావడంతో వణుకు మొదలైంది.
లైట్ తీస్కోవద్దు!
జపాన్ మెగా క్వేక్ అడ్వైజరీ హొక్కైడో నుంచి చిబా ప్రిఫెక్చర్ వరకు సుమారు 800 మైళ్ళ (1,300 కిలోమీటర్ల) పసిఫిక్ తీర ప్రాంతం మొత్తానికి జారీ చేయబడింది. మధ్యలో సన్రికు, ఆఓమోరి, మియాగి, ఫుకుషిమా వంటి తీర ప్రాంతాలు ఉన్నాయి. ఎట్టి పరిస్థితుల్లో మెగాక్వేక్ అడ్వైజరీని తేలికగా తీసుకోవద్దని.. అవసరమైతే ఆ ప్రాంతాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి పోవాలని ప్రజలను అధికారులు హెచ్చరిస్తున్నారు.
ప్రభావం ఎంత..
జపాన్ తీరానికే మెగాక్వేక్ పరిమితం కావడంతో.. ఇతర దేశాలపై ప్రభావం చూపించే అవకాశం తక్కువ. ఒకవేళ భారీ భూకంపం, సునామీ తీవ్ర ప్రభావం చూపితే మాత్రం.. పసిఫిక్ మహాసముద్ర తీరంలోని దేశాలు ప్రభావితం కావొచ్చు. కాబట్టి.. భారతదేశానికి ఎలాంటి ముప్పు పొంచి లేదు.


