మొరాకోలోని రెండు భవనాలు కూలిపోవడంతో కనీసం 22 మంది మరణించగా, మరో 16 మంది గాయపడ్డారు. అత్యంత పురాతనమైన ఫెజ్ నగరంలో బుధవారం తెల్లవారుజామున నాలుగు అంతస్తుల నివాస భవనాలు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఈ భవనాల్లో ఎనిమిది కుటుంబాలు ఉన్నాయని స్థానిక అధికారులు తెలిపారు.
గాయపడినవారిని హుటాహుటిన ఆసుపత్రులకు తరలించారు. శిథిలాల కింద ఇంకా చిక్కుకున్న వారిని గుర్తించేందుకు రక్షణ ఆపరేషన్ కొనసాగుతోంది. ముందస్తు చర్యల్లో భాగంగా నివారణ సమీపంలోని భవనాల నివాసితులను ఖాళీ చేయించారు. ఈశాన్య
మొరాకోలోని ఫెజ్, ఉత్తర ఆఫ్రికా దేశంలోని పురాతన నగరాల్లో ఒకటి. 8వ శతాబ్దం నాటి మాజీ సామ్రాజ్య రాజధాని అయిన ఫెజ్‌లో ఈ విషాదం జరిగింది. అల్-ముస్తాక్బాల్ ప్రాంతంలోని ఈ భవనాలలో ఎనిమిది కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ భవనాలు చాలా కాలంగా సరిగా పట్టించుకోకపోవడంతో శిథిలావస్థకు చేరినట్లు అధికారులు చెబుతున్నారు.
మే నెలలో ఫెజ్‌లోని వేరే ప్రాంతంలో ఒక శిథిలావస్థకు చేరుకున్న భవనం కూలిపోవడంతో తొమ్మిది మంది మరణించారు. అంతకుముందు ఫిబ్రవరి 2024లో భారీ వర్షాలు, బలమైన గాలుల కారణంగా పాత నగరంలో ఒక ఇల్లు కూలిపోవడంతో ఐదుగురు మరణించారు.
ఇటీవలి సంవత్సరాలలో, మొరాకోలో ఇలాంటి భవనాలు కూలిపోయిన అనేక సంఘటనలు జరిగాయి. సెప్టెంబర్ 8, 2023న అట్లాస్ పర్వత ప్రాంతంలో 6.8 తీవ్రతతో సంభవించిన భూకంపం తర్వాత అనేక నిర్మాణాలు బలహీనపడ్డాయని కొందరు అధికారులు చెబుతున్నారు.


