చండీగఢ్ లోని టింబర్ మార్కెట్ సమీపంలో ఇంద్రపీత్ సింగ్ (ప్యారీ) అనే గ్యాంగ్ స్టార్ ని గుర్తుతెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ప్యారీ తన వాహనంలో ప్రయాణిస్తుండగా దుండగులు కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. మృతుడు గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ కి ఒకప్పుడు చాలా సన్నిహితంగా ఉండే వారని తెలిపారు.
ఇంద్రపీత్ సింగ్ పై కాల్పులు జరిపిన అనంతరం వెంటనే అతడిని దగ్గర్లోని పీజీ మెడికల్ కాలేజ్ కి తీసుకెళ్లగా అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపినట్లు పేర్కొన్నారు. ఏదైనా గొడవ కారణంగానే బాధితుడిపై కాల్పులు జరిపి ఉంటారని భావిస్తున్నారు. కాగా కాల్పులు జరిగిన కొద్దిసేపటికి హరీ బాక్సర్ ఆర్జో బిష్ణోయ్ పేరుతో ఫేస్ బుక్ లో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది.
ప్యారీ ( ఇంద్రప్రీత్ సింగ్) ను తామే చంపామని అతను లోకల్ క్లబ్స్ నుండి డబ్బులు వసూలు చేసి తమను చంపాడానికి ప్లాన్ చేస్తున్నాడని అందులో ఉంది. అయితే ఆ పోస్టును ఇంకా అధికారికంగా ధృవీకరించలేదని దానిపై విచారణ చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. గ్యాంగ్ స్టర్ ప్యారీ చంఢీగఢ్ లోని సెక్టార్ 36లో నివసిస్తారని అతనిపై గతంలోనూ అనేక క్రిమినల్ కేసులున్నాయని పేర్కొన్నారు.
ఇంద్రపీత్ సింగ్, గ్యాంగ్ స్టార్ బిష్ణోయ్ డీఏవీ కాలేజీలో పూర్వ విద్యార్థులు. వీరిద్దరూ 2010లో పంజాబ్ యూనివర్సిటీ నుంచి విద్యార్థి రాజకీయాలలో ప్రవేశించారు. ఒక సందర్భంలో వీరిద్దరూ కలిసి చండీగఢ్ సెక్టార్ 40లో ఒకరిపై దాడి చేశారు. ఆ కేసులో బిష్ణోయ్, ఇంద్రప్రీత్ సింగ్ ఇద్దరూ ఒకేసారి అరెస్టయ్యారు.
పంజాబ్ కు చెందిన లారెన్స్ బిష్ణోయ్ పెద్ద గ్యాంగ్ స్టార్ ఇతని గ్యాంగ్ దేశవ్యాప్తంగా ఉంది. ప్రస్తుతం బిష్ణోయ్ జైలు శిక్ష అనుభవిస్తున్నారు. మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు బాబా సిద్ధీఖీ హత్య తరువాత ఇతని పేరు మరోసారి తెరమీదకు వచ్చింది. ప్రముఖ పంజాబీ సింగర్ సిద్ధూ మూసేవాలా హత్యలోనూ ఇతను ప్రధాన నిందితుడిగా ఉన్నారు.
ప్రముఖ హీరో సల్మాన్ ఖాన్ కు ఈయన నుంచి బెదిరింపులు వచ్చాయి. కృష్ణ జింకలను వేటాడిన కేసులో సల్మాన్ శిక్ష ఎదుర్కొంటున్నారు. అయితే కృష్ణ జింక బిష్ణోయ్ కమ్యూనిటికి చాలా పవిత్ర జంతువు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కు ఈ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. దీంతో కేంద్రం బాలీవుడ్ స్టార్ కు భద్రత పెంచింది.


