ఉరుము లేని పిడుగు | Japan air and sea forces struck the US naval base at Pearl Harbor 7December 1941 | Sakshi
Sakshi News home page

ఉరుము లేని పిడుగు

Dec 7 2025 6:19 AM | Updated on Dec 7 2025 6:19 AM

Japan air and sea forces struck the US naval base at Pearl Harbor 7December 1941

చరిత్ర – పెర్ల్‌ హార్బర్‌పై దాడి

1941 డిసెంబర్‌ 7న జపాన్‌ సైన్యం హవాయిలోని పెర్ల్‌ హార్బర్‌లో ఉన్న అమెరికా నౌకా స్థావరం పైన ఆకస్మికంగా దాడి జరిపింది. అసలు ఏ మాత్రం ఊహించని ఆ పరిణామంతో అమెరికా, రెండో ప్రపంచ యుద్ధంలోకి దిగక తప్పని పరిస్థితులు ఏర్పడ్డాయి. డిసెంబర్‌ 8న, అమెరికా అధ్యక్షుడు ఫ్రాంక్లిన్‌ డెలానో రూజ్‌వెల్ట్‌ జపాన్ పై యుద్ధ ప్రకటన కోసం చట్ట సభ ‘కాంగ్రెస్‌’ ఆమోదం కోరారు. కాంగ్రెస్‌ వెంటనే సమ్మతించింది. అందుకు ప్రతిచర్యగా డిసెంబర్‌ 11న, జపాన్ తో పొత్తు ఉన్న జర్మనీ, ఇటలీ అమెరికాపై యుద్ధం ప్రకటించాయి. ఆ విధంగా అమెరికా పూర్తిస్థాయిలో రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించవలసి వచ్చింది.


స్నేహితులు శత్రువులయ్యారు!
నిజానికి అమెరికా, జపాన్‌ ఒక జట్టులో ఉండి మొదటి ప్రపంచ యుద్ధంలో పాల్గొన్నాయి. పెర్ల్‌ హార్బర్‌పై దాడి కారణంగా రెండో ప్రపంచ యుద్ధంలో రెండూ పరస్పరం శత్రు దేశాలు అయ్యాయి. అసలెందుకు జపాన్‌ పెర్ల్‌ హార్బర్‌ నౌకా స్థావరంపై దాడి చేయవలసి వచ్చింది? ఆసియా, పసిఫిక్‌ ప్రాంతంలో సైనిక విస్తరణను నిలిపివేయాలని జపాన్ పై అమెరికా ఒత్తిడి తెస్తుండటమే అందుకు కారణం. 

పుస్తకం ఇచ్చిన ప్రేరణ!
పెర్ల్‌ హార్బర్‌పై దాడి చేయాలన్న ఆలోచన మొదట వచ్చింది.. జపాన్‌ అడ్మిరల్‌ ‘ఇసోరోకు యమమోటో’కు. ఆ దాడికి పథక రచన చేసింది కెప్టెన్‌ మినోరు గెండా. యమమోటోకు ఆ ఆలోచన రావటానికి రెండు విషయాలు ప్రేరణనిచ్చాయి. ఒకటి : కాలజ్ఞాన గ్రంథం. రెండోది, అప్పటికి ఏడాది క్రితమే జరిగిన ఒక దాడి. యమమోటోకు ప్రేరణ కలిగించిన ఆ గ్రంథం పేరు ‘ది గ్రేట్‌ పసిఫిక్‌ వార్‌’. దానిని 1925లో బ్రిటిష్‌ నౌకాదళ అధికారి హెక్టర్‌ బైవాటర్‌ రాశారు. అందులోని కథాంశం, అమెరికా– జపాన్‌ల మధ్య ఘర్షణలు జరగడం. జపనీయులు యుఎస్‌ నౌకాదళాన్ని నాశనం చేయడంతో ఆ గ్రంథం ప్రారంభమై గువామ్‌ (పశ్చిమ పసిఫిక్‌ ప్రాంతం), ఫిలిప్పీన్స్  లపై జపాన్‌ దాడి చేయడం వరకు కొనసాగుతుంది. అలాగే, 1940 నవంబర్‌ 11న ఇటలీలోని టొరంటో నౌకాశ్రయంలో ఇటాలియన్‌ నౌకాదళంపై బ్రిటన్‌ రాయల్‌ వైమానిక దళం విజయవంతంగా దాడి చేయటం కూడా యమమోటోకు స్ఫూర్తిని ఇచ్చింది. 

దాడికి ఒక రోజు ముందు
1941 డిసెంబర్‌ 6న పెర్ల్‌ హార్బర్‌లో ఓడల కదలికలు, మోహరింపు స్థానాల గురించి జపాన్‌ వివరాలు రాబడుతున్నట్లు అమెరికాకు సమాచారం అందింది. ఆ సమాచారాన్ని ఒక క్రిప్టాలజిస్ట్‌ తన ఉన్నతాధికారి అయిన మహిళా ఆఫీసర్‌కు చేరవేసి, తను డిసెంబర్‌ 8 సోమవారం వచ్చి కలుస్తానని చెప్పారు. ఆ మర్నాడు డిసెంబర్‌ 7 ఆదివారం... హవాయిలోని ఓహులో ద్వీపంలో ఒక రాడార్‌ ఆపరేటర్‌ తన కంప్యూటర్‌ స్క్రీన్‌పై... ద్వీపం మీదుగా వెళుతున్న పెద్ద విమానాల సమూహాన్ని చూశాడు. వెంటనే అతను ఆ విషయాన్ని తన ఉన్నతాధికారికి ఫోన్‌ చేసి చెప్పారు. అయితే ఆ అధికారి, ఆ విమానాలు ఆరోజు అక్కడికి రావాల్సిన యు.ఎస్‌. బి–17 బాంబర్‌ యుద్ధ విమానాలు అయి ఉండవచ్చని, వాటి గురించి ఆందోళ చెందాల్సిన పని లేదనీ చెప్పాడు. 

గంట 15 నిముషాల్లోనే!
ఆ తర్వాత కొద్ది సేపటికే ఉదయం 7:55 గంటలకు పెర్ల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడి ప్రారంభమైంది. ఆ మొత్తం దాడి కేవలం ఒక గంట 15 నిముషాల్లోనే పూర్తయింది. దానికి ముందు కెప్టెన్‌ మిట్సువో ఫుచిడా.. ఓహూలో ద్వీప గగన తలంలోకి రాగానే, ‘అమెరికా దిక్కుతోచని విధంగా మా చేతికి చిక్కింది’ అని చెప్పటానికి ‘టోరా, టోరా, టోరా’ అనే కోడ్‌ సందేశాన్ని జపాన్‌ నౌకాదళానికి పంపారు. నిజానికి 1907 నాటి హేగ్‌ సమావేశంలోని మొదటి నిబంధన ప్రకారం, దాడి ప్రారంభించే ముందు ఏ దేశమైనా ముందుగా యుద్ధ ప్రకటన చేయాలి. అయితే జపాన్‌ ఆ విషయాన్ని ముందస్తుగా వాషింగ్టన్‌లోని అమెరికా అధికారులకు తెలియబరచటానికి ముందే దాడి మొదలైపోయింది. దాంతో జపాన్‌ పెర్ల్‌ హార్బర్‌పై దొంగదాడి చేసినట్లయింది.   

విమానాల నుంచి విధ్వంసం
పెర్ల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడిలో నాలుగు వాహక నౌకల నుండి పైకి లేచిన 353 యుద్ధ విమానాలు పాల్గొన్నాయి. వాటిలో 40 టార్పెడో విమానాలు, 103 లెవల్‌ బాంబర్లు, 131 డైవ్‌–బాంబర్లు, 79 ఫైటర్‌ జెట్‌లు ఉన్నాయి. ఇంకా... రెండు భారీ క్రూజర్లు, 35 జలాంతర్గాములు, రెండు లైట్‌ క్రూజర్లు, తొమ్మిది ఆయిలర్లు, రెండు యుద్ధనౌకలు, 11 డిస్ట్రాయర్‌లు ఉన్నాయి. ఆ దాడిలో 68 మంది అమెరికన్‌ పౌరులు సహా 2,403 మంది అమెరికా సైనికులు మరణించారు. 8 యుద్ధనౌకలు సహా 19 యూఎస్‌ నేవీ నౌకలు ధ్వంసం అయ్యాయి. యూఎస్‌ పసిఫిక్‌ నౌకాదళానికి చెందిన మూడు విమాన వాహక నౌకలు దాడికి ముందే సముద్రంలోకి వెళ్లి ఉండటంతో జపాన్‌ సైన్యం వాటిని గుర్తించలేకపోయింది.  

డోరీ మిల్లర్‌ అసమాన శౌర్యం
జపాన్‌ దాడిలో ‘యు.ఎస్‌.ఎస్‌. (యునైటెడ్‌ స్టేట్స్‌ షిప్‌) అరిజోనా యుద్ధనౌక’ సిబ్బంది సహా పాటుగా పసిఫిక్‌ మహా సముద్రంలో మునిగిపోయింది. పెర్ల్‌ హార్బర్‌ దాడిలో చనిపోయిన వారిలో సగం మంది అరిజోనా షిప్‌లోని వారే. మునిగిపోయిన యుద్ధనౌక పైన అమెరికా జెండా ఎగురుతూ ఉంది. ఆనాటి దాడిలో మరణించిన అమెరికన్‌ అమర వీరులకు స్మారక చిహ్నంగా ఆ జెండా నిలిచిపోయింది. యు.ఎస్‌.ఎస్‌. వెస్ట్‌ వర్జీనియా నౌక స్టీవార్డ్‌ డోరీ మిల్లర్, పెర్ల్‌ హార్బర్‌పై జపాన్‌ దాడి జరుపుతున్న సమయంలో కనబరచిన అసమాన ధైర్య సాహసాలు, విధి నిర్వహణ పట్ల ఆయన అంకిత భావం అమెరికాకు చిరస్మరణీయమైనవి. మొదట అతడు ప్రాణాంతకంగా గాయపడిన కెప్టెన్‌కు సహాయం అందించాడు. తరువాత మెషిన్‌గన్ తో రెండు జపాన్‌ విమానాలను ధ్వంసం చేశాడు. నిజానికి  మెషిన్‌ గన్‌ని ఆపరేట్‌ చేయటం డోలీ మిల్లర్‌కు అదే మొదటిసారి. దాడి సమయంలో అతడు చూపిన తెగువకు, సమయస్ఫూర్తికి, సేవకు గుర్తింపుగా అమెరికా అత్యున్నత పురస్కారం ‘నేవీ క్రాస్‌’ లభించింది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఆ నేవీ క్రాస్‌ను పొందిన మొదటి ఆఫ్రికన్‌ అమెరికన్‌ డోరీ మిల్లర్‌. 
 

జపాన్‌పై ప్రతీకార దాడులు
పెర్ల్‌ హార్బర్‌ దాడిలో అమెరికా ప్రతిఘటనతో జపాన్‌ 29 విమానాలను, 5 చిన్న జలాంతర్గాములను కోల్పోయింది. ఒక జపాన్‌ సైనికుడు ఖైదీగా పట్టుబడ్డాడు. 129 మంది జపాన్‌ సైనికులు మరణించారు. పెర్ల్‌ హార్బర్‌పై దాడిలో పాల్గొన్న అన్ని జపాన్‌ నౌకలలో, ఉషియో అనే ఒక్క నౌక మాత్రమే చెక్కు చెదరకుండా బయటపడింది. దీనిని యోకోసుకా నౌకా స్థావరం వద్ద అమెరికా స్వాధీనం చేసుకుంది. 

కూటమి ధాటికి ఓటమి
మొత్తానికి అమెరికా కోలుకుంది. అది కూడా జపాన్‌ ఊహించిన దాని కంటే త్వరగా! కేవలం ఆరు నెలల తర్వాత, 1942 జూన్‌ ఉత్తర పసిఫిక్‌ మహా సముద్రంలోని మిడ్‌వే ప్రాంతంలో అమెరికాకు చెందిన విమాన వాహక నౌకాదళం... యమమోటో నావికాదళానికి చెందిన నాలుగు జపాన్‌ విమాన వాహక నౌకలను ధ్వంసం చేసింది. ఈ మిడ్‌వే విజయం తర్వాత, 1945 సెప్టెంబరులో మూడో ప్రపంచ యుద్ధం ముగిసేనాటికి, ఒక నెల ముందు ఆగస్టులో అమెరికా, బ్రిటన్, చైనా, రష్యాల కూటమి ధాటికి జపాన్‌ సామ్రాజ్యం ఓటమి పాలైంది.   

సాక్షి, స్పెషల్‌ డెస్క్‌

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement