వాషింగ్టన్: ఇరాన్‌పై ఇజ్రాయెల్–అమెరికా యుద్ధం మరింత తీవ్రమైంది. ఈ యుద్ధం ప్రాంతీయ స్థిరత్వాన్ని, ఇంధన భద్రతను, అంతర్జాతీయ రాజకీయ సమీకరణాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో ఇప్పటి వరకు చేయని చర్యలను ఇకపై చేపట్టబోతున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ప్రపంచ ఇంధన ఎగుమతిలో కీలకమైన ఖార్గ్ ఐలాండ్‌పై సరదా కోసమైనా దాడులు చేస్తామని ఇరాన్‌ను హెచ్చరించారు.
అదే సమయంలో హర్మూజ్ జలసంధిని కాపాడేందుకు యుద్ధనౌకలను పంపాలని ప్రపంచ దేశాలకు ట్రంప్ విజ్ఞప్తి చేశారు. ప్రతిగా, ఇరాన్ దాడుల్ని మరింత ముమ్మరం చేసింది.
తాను విధించిన షరతులకు లోబడి ఇరాన్ నడుచుకోవాలని, లేదంటే యుద్ధం తీరుతెన్నులు, లక్ష్యాల్ని ఎప్పటికప్పుడూ మారుస్తుంటామని ట్రంప్ హెచ్చరిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్‌పై కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించేలా పశ్చిమాసియా దేశాలు ట్రంప్‌తో సంప్రదింపులు జరిపాయి. ట్రంప్‌తో జరిగిన చర్చలు విఫలమైనట్లు తెలుస్తోంది.
ఇరాన్ తన హెచ్చరికలను పట్టించుకోకపోవడంతో, ఆ దేశానికి ఆర్థిక ఆయువుపట్టైన ఖార్గ్ దీవిపై దాడులు చేయడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఖార్గ్ దీవిని లక్ష్యంగా చేసుకుని పదేపదే దాడులు చేస్తామని ఆయన ఎన్‌బీసీ న్యూస్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
వాస్తవానికి అమెరికా ఇప్పటి వరకు ఖార్గ్ దీవిలోని సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడులు చేసింది. కానీ చమురు కేంద్రాలపై దాడులు చేసే ప్రయత్నం చేయలేదు. కానీ ఇరాన్ తన డిమాండ్‌లకు తలొగ్గకపోవడంతో ఇప్పు ట్రంప్ ఖార్గ్ ఐలాండ్‌పై పడినట్లు సమాచారం.
ఖార్గ్ ఐలాండ్‌పై దాడులు జరగడం వల్ల ఇరాన్‌తో పాటు ప్రపంచంలోని పలు దేశాలు తీవ్ర ప్రభావానికి గురవుతున్నాయి. ముఖ్యంగా హర్మూజ్ జలసంధికి సమీపంలో ఖార్గ్ ద్వీపం ఉండటం.. చమురు దిగుమతులకు ఆటంకం ఏర్పడనుంది. దీంతో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకుతుండగా.. గ్యాస్ కొరత ప్రజలను మరింతగా వేధించనుందని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


