ధర దడ! | Consumer companies hike prices amid rising cost of Iran war | Sakshi
Sakshi News home page

ధర దడ!

Mar 26 2026 4:26 AM | Updated on Mar 26 2026 4:28 AM

Consumer companies hike prices amid rising cost of Iran war

ఆల్‌టైమ్‌ కనిష్టానికి రూపాయి 

విడిభాగాలపై మరింత వ్యయం 

పెరిగిపోతున్న తయారీ ఖర్చు 

తడిసి మోపెడవుతున్న రవాణా 

ఎలక్ట్రానిక్స్, కార్ల ధరల పెంపు బాటలో కంపెనీలు

ఇళ్లలో వినియోగించే ముఖ్యమైన ఎల్రక్టానిక్‌ వస్తువుల ధరలు ప్రియంగా మారుతున్నాయి. ఒకవైపు కొత్త ఇంధన సామర్థ్య ప్రమాణాలు అమల్లోకి రావడం, మరోవైపు ముడిసరుకుల ధరల పెరుగుదలతో కంపెనీలు ఒక విడత రేట్లను పెంచగా.. ఇప్పుడు ఇరాన్‌–ఇజ్రాయెల్, అమెరికా యుద్ధంతో వ్యయాల భారం పెరిగిపోయిందంటూ మరో విడత రేట్ల పెంపునకు తెరతీరాయి. 

దీంతో ఏసీలు, టీవీలు తదితర ఉత్పత్తుల ధరలు మరింత ప్రియం కానున్నాయి. గతేడాది సెపె్టంబర్‌లో జీఎస్‌టీలో శ్లాబుల కుదింపు ఫలితంగా వీటి ధరలు దిగిరాగా.. తాజాగా వీటి ధరలు పూర్వపు స్థాయిలను మించుతున్నాయి. మెమొరీ చిప్‌ల ధరల పెరుగుదలతో ఇప్పటికే స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్ల ధరలు ప్రియం కావడం తెలిసిందే. కమోడిటీ ధరల్లో అస్థిరతలు, రూపాయి క్షీణత, అధిక రవాణా, ఇంధన వ్యయాలను రేట్ల సవరణకు కారణాలని పంపిణీదారులు, డీలర్లకు కంపెనీలు తెలియజేస్తున్నాయి. ధరల పెంపు విషయమై తమ వాణిజ్య భాగస్వాములకు ఎల్‌జీ, శామ్‌సంగ్, పానాసోనిక్, డైకిన్, లాయిడ్స్‌ తాజాగా సమాచారమిచ్చాయి. 

ఏసీల ధరలు 10 శాతం వరకు, ఇతర ఉత్పత్తుల ధరలు 5 శాతం వరకు పెంచుతున్నట్టు ఎల్‌జీ ప్రకటించింది. ఏసీల ధరలను 8–12 శాతం మధ్య పెంచుతున్నట్టు పానాసోనిక్‌ తెలిపింది. డైకిన్, బ్లూస్టార్‌ సైతం 12 శాతం పెంపు దిశగా నిర్ణయాన్ని ప్రకటించింది. లాయిడ్స్‌ ఇప్పటికే ధరలను పెంచింది. శామ్‌సంగ్‌ సైతం ధరలను పెంచనున్నట్టు తెలిపింది. మెమొరీ చిప్‌లు ధరల పెరుగుదలతో టీవీల విక్రయ ధరలను పెంచక తప్పడం లేదని పేర్కొంది. వాస్తవానికి తయారీ వ్యయాల భారం పేరుతో ఏసీలు, టీవీల ధరలను 5–9% మధ్య కన్జ్యూమర్‌ గూడ్స్‌ కంపెనీలు జనవరిలో పెంచడం గమనార్హం. ఈ వరుస పెంపులతో డిమాండ్‌కు విఘాతం కలగొచ్చన్న ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

వాహన ధరలు సైతం.. 
తయారీ వ్యయాల పెరుగుదల నేపథ్యంలో ఆటోమొబైల్‌ సంస్థలు సైతం తమ వాహన విక్రయ ధరలను పెంచుతున్నాయి. టాటా మోటార్స్‌ తన ప్యాసింజర్, వాణిజ్య వాహనాల (ఇంటర్నల్‌ కంబస్టన్‌ ఇంజిన్‌) ధరలను 0.5–1.5% వరకు పెంచుతున్నట్టు ప్రకటించింది. ఏప్రిల్‌ నుంచి ఈ ధరల పెంపు అమల్లోకి రానుంది. లగ్జరీ కార్ల తయారీ సంస్థలైన మెర్సెడెజ్‌ బెంజ్, ఆడి, బీఎండబ్ల్యూ సైతం తమ వాహనాల ధరలను వచ్చే నెల నుంచి 2% వరకు పెంచుతున్నట్టు ప్రకటించాయి. హోండా సైతం ఈ దిశగా ఆలోచన చేస్తుండగా, మిగిలిన కంపెనీలూ ఇదే బాటలో నడిచే అవకాశాలు ఉన్నట్టు విశ్లేషకులు భావిస్తున్నారు. 

డిమాండ్‌పై ప్రభావం.. 
తాజా ధరల పెంపుతో గతేడాది జీఎస్‌టీ సవరణల కారణంగా తగ్గిన ధరల ప్రయోజనం పూర్తిగా ఆవిరైపోతోందని, ఇది డిమాండ్‌ను బలహీనం చేయొచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఇటీవలి వరుస ధరల పెంపు దురదృష్టకరమని, వినియోగ సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తుందని ప్రముఖ ఎల్రక్టానిక్‌ రిటైల్‌ చైన్‌ ‘గ్రేట్‌ ఈస్టర్న్‌ రిటైల్‌’ డైరెక్టర్‌ పులకిత్‌ బైద్‌ పేర్కొన్నారు. ‘‘జీఎస్‌టీ తగ్గింపు అనంతరం అధిక ముడి సరుకుల ధరల పేరుతో బ్రాండ్లు రేట్లను పెంచేశాయి. ప్రస్తుత అనిశి్చతుల్లో తరచుగా ధరల పెంపు డిమాండ్‌పై గణనీయమైన ప్రభావం చూపిస్తుంది’’అని బైద్‌ అన్నారు. డిమాండ్‌ కోలుకోవడం మొదలైందంటూ, అయితే వరుస ధరల పెంపు డిమాండ్‌ను దెబ్బతీయొచ్చని ప్రముఖ ఎల్రక్టానిక్స్‌ బ్రాండ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ సైతం అభిప్రాయపడ్డారు. 

– సాక్షి, బిజినెస్‌ డెస్క్‌ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement