సియోల్: ప్రపంచవ్యాప్తంగా కోట్లాది అభిమానుల హృదయాలను గెలుచుకున్న పాప్ సెన్సేషన్ బీటీఎస్ ఇప్పుడు చిక్కుల్లో పడింది. తన సొంత సంస్థ ‘హైబ్’(HYBE)తోనే పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ కొరియన్ అస్తిత్వాన్ని కాపాడుకునేందుకు, ముఖ్యంగా మాతృభాషలో పాటలు పాడేందుకు ‘బీటీఎస్ ’ ఏడుగురు సభ్యులు చేసిన అంతర్గత పోరాటం ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ సాక్షిగా వెలుగులోకి వచ్చింది.
ఇంగ్లీష్ వద్దు.. కొరియన్ ముద్దు!
బీటీఎస్ కొత్త ఆల్బమ్ ‘అరిరంగ్’ (Arirang) నిర్మాణ సమయంలో తీవ్ర ఉత్కంఠ నెలకొన్నట్లు తెలుస్తోంది. నెట్‌ఫ్లిక్స్ త్వరలో విడుదల చేయనున్న ‘బీటీఎస్ : ది రిటర్న్స్’ డాక్యుమెంటరీ ప్రకారం.. అంతర్జాతీయ మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని ఆల్బమ్‌లో ఎక్కువ ఇంగ్లీష్ పాటలు ఉండాలని ‘హైబ్’ యాజమాన్యం ఒత్తిడి తెచ్చింది. అయితే ఆర్‌ఎం,సుగా, జిన్, జె-హోప్, జిమిన్, వీ, జంగ్‌కుక్.. ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. ‘కనీసం రాప్ భాగాల్లోనైనా కొరియన్ పదాలు ఉండాల్సిందే’ అని వారు మేనేజ్‌మెంట్‌తో వాదించినట్లు సమాచారం. ముఖ్యంగా జిమిన్ తన ఇంగ్లీష్ ఉచ్చారణ వల్ల పాట సహజత్వం దెబ్బతింటుందని ఆందోళన వ్యక్తం చేయగా, లీడర్ ఆర్‌ఎం తమ మూలాలను వదులుకోవడానికి ఇష్టపడలేదు.
నికోల్ కిమ్ వ్యాఖ్యలపై ‘ఆర్మీ’ ఆగ్రహం
బిగ్ హిట్ మ్యూజిక్ వైస్ ప్రెసిడెంట్ నికోల్ కిమ్ తీరు ఇప్పుడు అభిమానుల ఆగ్రహానికి కారణమైంది. బీటీఎస్ కెరీర్‌లో మైలురాళ్లుగా నిలిచిన ‘ఆన్’, బ్లాక్ స్వాన్’వంటి పాటలు జనాలకు అంతగా కనెక్ట్ కాలేదని ఆమె వ్యాఖ్యానించడం వివాదానికి దారితీసింది. ఇంగ్లీష్ పాటలు ఉంటేనే గ్లోబల్ సక్సెస్ సాధ్యమని ఆమె వాదించడాన్ని సోషల్ మీడియాలో ‘ఆర్మ్మీ’(బీటీఎస్ ఫ్యాన్స్) తప్పుబడుతున్నారు. ‘మాతృభాషలో పాడి ప్రపంచాన్ని జయించిన వారిని మార్చాలని చూడటం మూర్ఖత్వం" అంటూ నెటిజన్లు మండిపడుతున్నారు.
వివాదాల నడుమ రికార్డుల వర్షం
ఇలాంటి విమర్శలు వివాదాలు ఎన్ని వస్తున్నా ‘అరిరంగ్’ మాత్రం రికార్డులను తిరగరాస్తోంది. విడుదలైన 24 గంటల్లోనే స్పాటిఫైలో 110 మిలియన్ల స్ట్రీమ్స్ సాధించడమే కాకుండా, కేవలం మూడు రోజుల్లోనే 40 లక్షల ఆల్బమ్ కాపీలు అమ్ముడయ్యాయి. గ్వాంగ్వామున్ ఈవెంట్‌లో రద్దీ వల్ల ‘హైబ్’ షేర్లు స్వల్పంగా తగ్గినప్పటికీ, మ్యూజిక్ చార్ట్స్‌లో మాత్రం బీటీఎస్ తిరుగులేని విధంగా దూసుకుపోతోంది.
ఇది కూడా చదవండి: Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్‌జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం?


