Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్‌జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం? | BJP Releases Third List Of Candidates, RG Kar Victim’s Mother Ratna Debnath To Contest In West Bengal Elections 2026 | Sakshi
Sakshi News home page

Bengal: బీజేపీ సంచలనం.. ‘ఆర్‌జీ కర్’ బాధితురాలి తల్లికి న్యాయం?

Mar 26 2026 8:23 AM | Updated on Mar 26 2026 10:22 AM

BJP releases third list RG Kar victims mother among contestants

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల వేళ భారతీయ జనతా పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. యావత్ దేశాన్ని కుదిపేసిన కోల్‌కతా ఆర్‌జీ కర్ (RG Kar) ఆస్పత్రి హత్యాచార ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ట్రైనీ డాక్టర్ తల్లి రత్న దేబ్‌నాథ్‌ను ఎన్నికల బరిలోకి దింపింది. బుధవారం విడుదల చేసిన 19 మంది అభ్యర్థుల మూడో జాబితాలో ఆమె పేరును ఉత్తర 24 పరగణాల జిల్లాలోని పాణిహతి నియోజకవర్గం నుండి ఖరారు చేసింది.

న్యాయం కోసమే ఈ పోరాటం: రత్న దేబ్‌నాథ్‌
తన అభ్యర్థిత్వంపై రత్న దేబ్‌నాథ్‌ ఉద్వేగంతో వ్యాఖ్యానిస్తూ.. ‘నా కూతురి విషయంలో న్యాయం కోసం ఎన్నో చోట్ల తిరిగాను. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో మహిళల భద్రత కోసం, నా బిడ్డకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడతాను. నేను గెలిస్తే అది నా ఒక్కదాని విజయం కాదు, పాణిహతి ప్రజల విజయం’ అని ఆమె పేర్కొన్నారు. 2024 ఆగస్టులో జరిగిన ఈ దారుణ ఘటనపై సీబీఐ విచారణ జరగగా, ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌కు 2025 జనవరిలో కోర్టు జీవిత ఖైదు విధించిన సంగతి తెలిసిందే.

మూడవ జాబితాలోని ఇతర విశేషాలు
బీజేపీ విడుదల చేసిన ఈ మూడో జాబితాలో పలువురు ప్రముఖులకు చోటు దక్కింది.
దీపాంజన్ చక్రవర్తి: నేషనల్ సెక్యూరిటీ గార్డ్ (ఎన్‌ఎస్‌జీ)మాజీ కమాండో అయిన ఈయనను హుగ్లీ జిల్లాలోని ఉత్తరపారా స్థానం నుండి బరిలోకి దింపారు.
మొత్తం అభ్యర్థులు: బెంగాల్‌లోని మొత్తం 294 స్థానాలకు గాను, తాజా జాబితాతో కలిపి బీజేపీ ఇప్పటివరకు 274 మంది అభ్యర్థులను బీజేపీ ప్రకటించింది.

రాజకీయ విమర్శలు - ఎన్నికల షెడ్యూల్
రత్న దేబ్‌నాథ్‌ బీజేపీ తరపున పోటీ చేయడాన్ని తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) తప్పుబట్టింది. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మహిళలపై జరుగుతున్న అన్యాయాలను ప్రస్తావిస్తూ టీఎంసీ నేత కునాల్ ఘోష్ విమర్శలు గుప్పించారు. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీల్లో రెండు దశల్లో జరగనున్నాయి. తుది ఫలితాలు మే 4న విడుదల కానున్నాయి.

ఇది కూడా చదవండి: Bengal Election: ‘సునామీ’కి సెంటర్ పాయింట్!

Advertisement
 
Advertisement
Advertisement