టెహ్రాన్: పశ్చిమ ఆసియాలో యుద్ధ పరిస్థితులు త్వరలో చల్లబడేలా కనిపించడం లేదు. యుద్ధాన్ని ఆపేందుకు తాను సిద్ధమని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటనపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ట్రంప్‌ను రెచ్చగొట్టేలా ఇరాన్ ఒక ఏఐ జనరేటెడ్ వీడియోను విడుదల చేసింది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అంటూ అమెరికా, ఇజ్రాయెల్‌కు హెచ్చరిక జారీ చేసింది.
ఈ వీడియోలో అమెరికా చరిత్రలో జరిగిన యుద్ధాలు, అణు దాడులు, ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఘర్షణలను చూపిస్తూ చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షస రూపంలో చిత్రీకరించారు. స్టాచ్యూని క్షిపణితో ధ్వంసం చేస్తామని హెచ్చరించేలా వీడియోని క్రియేట్ చేయడం గమనార్హం.
అమెరికా గత చర్యలపై విమర్శ
వీడియోలో అమెరికా స్థానిక ప్రజల భూ స్వాధీనం, హిరోషిమాపై అణు బాంబు దాడి, వియత్నాం యుద్ధం, అలాగే యెమెన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాక్, గాజా, పాలస్తీనా ఘర్షణలను ప్రస్తావించారు. ఈ సంఘటనలన్నింటినీ అమెరికా కారణమని చూపిస్తూ, బాధితుల తరఫున ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ సందేశం ఇచ్చింది.
స్టాచ్యూ ఆఫ్ లిబర్టీపై దాడి
వీడియో చివర్లో స్టాచ్యూ ఆఫ్ లిబర్టీని రాక్షసుడిగా చూపించి, దానిపై క్షిపణి దాడి చేసిన దృశ్యం ఉంది. ‘అందరి కోసం ఓ ప్రతీకారం’ అనే నినాదంతో అమెరికాకు స్పష్టమైన హెచ్చరిక జారీ చేసింది. ఈ వీడియో ఇజ్రాయెల్–అమెరికా దాడుల తర్వాత విడుదల కావడం గమనార్హం. ఇరాన్ ఇటీవల అమెరికాను పశ్చిమ ఆసియాలో అస్థిరతకు కారణమని ఆరోపిస్తూ, ప్రతీకారం తప్పదని హెచ్చరిస్తోంది. మరోవైపు అమెరికా అదనపు సైనిక దళాలు, యుద్ధ నౌకలు, విమాన దళాలను ఇరాన్ ప్రాంతంలో మోహరించింది.
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం.. ఈ వీడియో కేవలం ప్రచార సాధనం మాత్రమే కాదు. ఇరాన్ తన ప్రతీకారాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించబోతున్నట్లు చూపించడానికి ఉద్దేశించబడింది. ఇది ప్రాంతీయ శాంతి, భద్రతపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని వారు హెచ్చరిస్తున్నారు.


