దద్దరిల్లిన ‘ఖర్గ్‌’ | US attacks military sites on Iran Kharg island | Sakshi
Sakshi News home page

దద్దరిల్లిన ‘ఖర్గ్‌’

Mar 15 2026 2:04 AM | Updated on Mar 15 2026 2:04 AM

US attacks military sites on Iran Kharg island

90 సైనిక లక్ష్యాలపై బాంబుల వర్షం 

ఇరాన్‌ మౌలిక వ్యవస్థలన్నీ ధ్వంసం: అమెరికా 

త్వరలో భూతల దాడుల దిశగా యోచన! 

గల్ఫ్‌కు మరిన్ని యుద్ధ నౌకల తరలింపు 

హుటాహుటిన 2,500 మంది సైనికులు 

గల్ఫ్‌ చమురు వ్యవస్థలపై ఇరాన్‌ దాడులు 

యూఏఈలోని చమురు క్షేత్రంలో మంటలు  

పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్రం  

దుబాయ్‌/వాషింగ్టన్‌: పశ్చిమాసియాలో యుద్ధం మరింత తీవ్ర రూపు దాలుస్తోంది. ఇరాన్‌కు ఆర్థిక ఆయువుపట్టు వంటి ఖర్గ్‌ దీవిపై అమెరికా దాడులు, ప్రతీకారంగా పలు గల్ఫ్‌ దేశాల్లోని చమురు వ్యవస్థలపై ఇరాన్‌ తీవ్రస్థాయి ప్రతిదాడులతో శనివారం పోరు కీలక మలుపు తిరిగింది. ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలనే గాక ఆ దేశంతో సంబంధమున్న చమురు వ్యవస్థలన్నింటినీ ఇకపై లక్ష్యం చేసుకుంటామని ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్‌ (ఐఆర్‌జీసీ) ప్రకటించింది. తమపై అమెరికా దాడులకు ఉపయోగపడుతున్న గల్ఫ్‌ నగరాలన్నింటిపైనా ప్రతీకార దాడులు తప్పవని హెచ్చరించింది.

అమెరికా సేనలు మోహరించిన ప్రదేశాల నుంచి పౌరులంతా తక్షణం వెళ్లిపోవాలని సూచించింది! మరోవైపు ఖర్గ్‌పై భూతల దాడులకు కూడా అమెరికా రంగం సిద్ధం చేసుకుంటున్నట్టు చెబుతున్నారు. 2,500 మందితో కూడిన నావికా దళాన్ని, మరిన్ని ఆంఫీబియస్‌ యుద్ధ నౌకలను హుటాహుటిన గల్ఫ్‌కు తరలిస్తుండటం ఇందుకు బలం చేకూరుస్తోంది. వీటికి తోడు ఇరాన్‌తో యుద్ధం నిర్ణాయక దశలోకి ప్రవేశించిందని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి కట్జ్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో యుద్ధ పరిధి మరింతగా విస్తరించడం ఖాయమని, తద్వారా మరింత జనహననం, ఆస్తి నష్టం తప్పవని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 

చమురు వ్యవస్థలు బుగ్గే: ట్రంప్‌
ఇరాన్‌ చమురు నెట్‌వర్క్‌కు జీవనాడి వంటి ఖర్గ్‌ దీవిపై అమెరికా భారీ స్థాయిలో దాడులకు దిగింది. అక్కడ పదులకొద్దీ సంఖ్యలో భారీ పేలుళ్లు విని్పంచాయి. సముద్రంలో అమర్చే మందుపాతరల నిల్వ కేంద్రం, క్షిపణి నిల్వ కేంద్రం, బంకర్లతో పాటు మొత్తం 90కి పైగా సైనిక లక్ష్యాలను ధ్వంసం చేసినట్టు యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. దీవిలోని కీలకమైన సైనిక స్థావరాలను పూర్తిస్థాయిలో ధ్వంసం చేసినట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రకటించారు. అయితే కీలకమైన చమురు వ్యవస్థల జోలికి మాత్రం పోలేదని తెలిపారు.

హార్మూజ్‌ గుండా నౌకల ప్రయాణాన్ని ఇరాన్‌ నిరోధిస్తే వాటిని కూడా తుడిచి పెట్టేస్తామంటూ తీవ్ర హెచ్చరికలు చేశారు. ఈ మేరకు ట్రూత్‌ సోషల్‌లో ఆయన పోస్టులు చేశారు. జపాన్‌ నుంచి తక్షణం పశ్చిమాసియాకు తరలాలంటూ 31వ మరీన్‌ ఎక్స్‌పెడిషనరీ యూనిట్, యాంఫిబియస్‌ షిప్‌ యూఎస్‌ఎస్‌ ట్రిపోలీకి ఆదేశాలు జారీ అయ్యాయి. యూఎస్‌ఎస్‌ అబ్రహంలింకన్‌తో పాటు అమెరికా ఇప్పటికే 12 యుద్ధ నౌకలను, 8 డి్రస్టాయర్లను గల్ఫ్‌లో మోహరించింది. అమెరికా దాడిలో ఖర్గ్‌లోని తమ చమురు వ్యవస్థలకు ఎలాంటి నష్టమూ వాటిల్లలేదని ఇరాన్‌ పేర్కొంది.

ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ, నావల్‌ బేస్, విమానాశ్రయ కంట్రోల్‌ టవర్, ఒక చమురు కంపెనీ తాలూకు హెలికాప్టర్‌ హ్యాంగర్‌పై దాడులు జరిగినట్టు తెలిపింది. శనివారం ఇరాన్‌లో 200 పై చిలుకు లక్ష్యాలను తుడిచిపెట్టినట్టు ఇజ్రాయెల్‌ పేర్కొంది. వాటిలో క్షిపణి కేంద్రాలు, ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థలు, ఆయుధ తయారీ కేంద్రాలున్నట్టు తెలిపింది. అయితే ఖర్గ్‌ నుంచి చమురు ఎగుమతులు నిర్నిరోధంగా కొనసాగుతున్నట్టు వెల్లడించింది. 

లెబనాన్‌లో మృతులు 826 మంది 
లెబనాన్‌పైనా ఇజ్రాయెల్‌ దాడుల తీవ్రత కొనసాగుతూనే ఉంది. బీరూట్, శివార్లపై ఇజ్రాయెల్‌ సైన్యం క్షిపణులతో విరుచుకుపడింది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 826 మందికి పైగా మరణించినట్టు ప్రభుత్వం పేర్కొంది. వారిలో 31 మంది వైద్య సిబ్బందేనని తెలిపింది. దాడుల తీవ్రతకు ఐదు ఆస్పత్రులను మూసేయాల్సి వచ్చినట్టు వివరించింది. దేశవ్యాప్తంగా 8.5 లక్షల మందికి పైగా నిర్వాసితులయ్యారు.  

మొజ్తబాపై 92 కోట్ల రివార్డు 
ఇరాన్‌ నూతన సుప్రీం నేత మొజ్తబా ఖమేనీ జాడ తెలిపిన వారికి కోటి డాలర్ల (రూ.92.5 కోట్ల) రివార్డును అమెరికా ప్రకటించింది. విదేశాంగ శాఖ ఎక్స్‌లో ఈ మేరకు ఒక ప్రకటన జారీ చేసింది. ఖమేనీతో పాటు ఆయన కార్యాలయ చీఫ్‌ అలీ హస్గర్‌ హెజాజీ, భద్రతా విభాగం ఉన్నతాధికారి అల లరిజానీ తదితరుల పేర్లను కూడా పేర్కొంది. వాళ్లకు సంబంధించిన సమాచారం అందించే వారికి తగిన పారితోíÙకంతో పాటు పునరావాసం కూడా కలి్పస్తామని పేర్కొంది.

గల్ఫ్‌పై క్షిపణుల వర్షం
ఖర్గ్‌పై అమెరికా దాడులకు తమ ప్రతీకారం ఊహించని స్థాయిలో ఉంటుందని ఇరాన్‌ పార్లమెంట్‌ స్పీకర్‌ మొహమ్మద్‌ బఘెర్‌ ఖలీబాఫ్‌ హెచ్చరించారు. కనీవిని ఎరుగని రీతిలో పూర్తిస్థాయి దాడులకు దిగుతామన్నారు. అందుకు తగ్గట్టే ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్‌ దేశాలపైనా దాడుల తీవ్రతను ఇరాన్‌ యథాతథంగా కొనసాగించింది. శనివారమంతా వాటిపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడింది. ఇరాక్‌ రాజధాని బాగ్దాద్‌లో అమెరికా రాయబార కార్యాలయ ప్రాంగణంలోని హెలిప్యాడ్‌పై క్షిపణి దాడికి దిగింది. తీవ్ర నష్టానికి సంకేతంగా అక్కడినుంచి భారీగా పొగలు వెలువడ్డాయి.

ఇరాన్‌ డ్రోన్‌ దాడిలో యూఏఈలో ఒక చమురు కేంద్రానికి తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడి నుంచి వెలువడే పొగలు ఆకాశాన్నంటుతున్నాయి. గల్ఫ్‌ దేశాల్లోని అమెరికా బ్యాంకులు, ఇతర వ్యవస్థలపై కూడా ఇరాన్‌ డ్రోన్‌ దాడులు జరుపుతోంది. దుబాయ్‌లోని జెబెల్‌ అలీ, అబుదాబిలోని ఖలీఫా, పుజైరా నౌకాశ్రయాలను విడిచి వెళ్లాల్సిందిగా సిబ్బందిని, ప్రజలను ఇరాన్‌ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో వాటిపైనా భారీ దాడులు తప్పవని భావిస్తున్నారు. 9 బాలిస్టిక్‌ క్షిపణులను, 33 డ్రోన్లను అడ్డుకున్నట్టు యూఏఈ ప్రకటించింది.

నిమిషాల్లో 1,430 క్షిపణులు! 
ఇజ్రాయెల్‌పై విరుచుకుపడ్డ ఇరాన్‌ 
ఖర్గ్‌ దీవిపై అమెరికా దాడితో ఇరాన్‌ ప్రతీకారేచ్ఛతో రగిలిపోతోంది. ఇజ్రాయెల్‌పై శనివారం తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. నిమిషాల వ్యవధిలోనే ఏకంగా 1,430 క్షిపణులు ప్రయోగించింది! ఇజ్రాయెల్‌ వైద్య సేవా విభాగానికి చెందిన మాగెన్‌ డేవిడ్‌ ఆడొమ్‌ దీన్ని ధ్రువీకరించారు. ఈలట్‌ నగరంలో చాలా ప్రాంతాలపై దాడులు జరిగాయి. ఎంతోమంది గాయపడ్డారని, వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉందని సమాచారం. జెరూసలేం, టెల్‌ అవీవ్‌తో పాటు పలు ఇజ్రాయెలీ నగరాలు కూడా క్షిపణుల మోతతో దద్దరిల్లిపోయాయి.

హార్మూజ్‌కు యుద్ధనౌకలు పంపండి 
ప్రపంచ దేశాలకు ట్రంప్‌ విజ్ఞప్తి
హార్మూజ్‌ జలసంధిని తెరిపించేందుకు ప్రపంచ దేశాలు యుద్ధ నౌకలు పంపాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరారు. చైనా, ఫ్రాన్స్, బ్రిటన్, జపాన్, దక్షిణ కొరియా తదితర దేశాలకు ఈ మేరకు విజ్ఞప్తి చేశారు.  పలు దేశాలు ఇప్పటికే అమెరికాకు దన్నుగా తమ యుద్ధ నౌకలను పంపేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాయని చెప్పారు. హార్మూజ్‌ను త్వరలో తెరిపించి అక్కడినుంచి అంతర్జాతీయ రవాణా యథావిధిగా సాగేలా చర్యలు తీసుకుంటామని ప్రకటించారు.

గల్ఫ్‌ దేశాలపై దాడులొద్దు 
ఇరాన్‌కు హమాస్‌ పిలుపు 
గల్ఫ్‌ దేశాలపై దాడులకు ఇరాన్‌ స్వస్తి పలకాలని పాలస్తీనా సాయుధ సంస్థ హమాస్‌ విజ్ఞప్తి చేసింది! పొరుగు దేశాలపై దాడులు మానుకోవాలని హితవు పలికింది. యుద్ధానికి తక్షణం తెర దించేలా దేశాలన్నీ కృషి చేయాలని కూడా పిలుపునిచి్చంది. ఇరాన్‌కు హమాస్‌ అత్యంత సన్నిహితమన్నది తెలిసిందే. దానికి ఇరాన్‌ పూర్తిస్థాయిలో సాయుధ, ఆర్థిక సాయం చేస్తుంటుంది. హమాస్‌ ప్రకటనపై ఇరాన్‌ ఇప్పటిదాకా ఎలాంటి వ్యాఖ్యలూ చేయలేదు.

మరో ఐదు విమానాలను నష్టపోయిన అమెరికా! 
ఇరాన్‌ దాడుల్లో అమెరికా గత రెండు రోజుల్లో మరో ఐదు రీ ఫ్యూయలింగ్‌ విమానాలను నష్టపోయినట్టు తెలుస్తోంది. సౌదీ అరేబియాలోని ప్రిన్స్‌ సుల్తాన్‌ వైమానిక స్థావరంపై జరిగిన డ్రోన్‌ దాడుల్లో అమెరికా వైమానిక దళానికి చెందిన ఐదు కేసీ–135 స్ట్రాటో ట్యాంకర్‌ రీ ఫ్యూయలింగ్‌ విమానాలకు భారీ నష్టం వాటిల్లినట్టు వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌ పేర్కొంది. యుద్ధ ప్రాతిపదికన వాటికి మరమ్మతులు చేపట్టారని ఇద్దరు అమెరికా సైనికాధికారులను ఉటంకిస్తూ కథనం వెలువరించింది.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మాత్రం ఈ వార్తలను పూర్తిగా తోసిపుచ్చారు. ఇదంతా అమెరికా ఓటమిని కోరుకునే కొన్ని పనికిమాలిన మీడియా సంస్థల దిగజారుడు ప్రచారమేనంటూ మండిపడ్డారు. ‘‘నాలుగు విమానాలకు ఎలాంటి నష్టమూ జరగలేదు. ఇరాన్‌పై దాడుల్లో అవి చురుగ్గా పాల్గొంటున్నాయి. ఒక్క రీ ఫ్యూయలింగ్‌ విమానానికి స్వల్ప నష్టం జరిగింది. మా సైన్యం దానికి వెంటనే మరమ్మతు చేసింది కూడా’’అని ట్రంప్‌ చెప్పుకొచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement