మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా? | Iran rejects US Mojtaba Khamenei is disfigured claim | Sakshi
Sakshi News home page

మొజ్తబా ఖమేనీ ముఖం చిద్రమైందా?

Mar 15 2026 7:31 AM | Updated on Mar 15 2026 7:52 AM

Iran rejects US Mojtaba Khamenei is disfigured claim

టెహ్రాన్: ఇరాన్ కొత్త సుప్రీం లీడర్ మొజ్తబా ఖమేనీ ఆరోగ్యంపై గత కొన్ని రోజులుగా సాగుతున్న ఉత్కంఠకు ఇరాన్ ప్రభుత్వం తెరదించింది. మొజ్తబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా మారిపోయిందంటూ అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ తీవ్రంగా ఖండించారు. తాజాగా ఒక అంతర్జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఖమేనీ ఆరోగ్య పరిస్థితిపై ఎటువంటి ఆందోళన అవసరం లేదని, ఆయన క్షేమంగా ఉన్నారని స్పష్టం చేశారు.

అమెరికా అనుమానం ఏంటి?
అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ ఇటీవల ఇరాన్ నాయకత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇజ్రాయెల్-అమెరికా జరిపిన దాడుల్లో మొజ్తబా ఖమేనీ తీవ్రంగా గాయపడ్డారని, అందుకే ఆయన కేవలం రాతపూర్వక సందేశాలకే పరిమితమవుతున్నారని హెగ్సెత్ ఆరోపించారు. అత్యాధునిక సాంకేతికత అందుబాటులో ఉన్నా, మొజ్తబా వీడియో లేదా ఆడియో సందేశం ద్వారా ప్రజల ముందుకు రాకపోవడం వెనుక ఏదో రహస్యం ఉందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

హోర్ముజ్ జలసంధిపై కీలక ప్రకటన
ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరఘ్చీ మరో కీలక విషయాన్ని వెల్లడించారు. ప్రపంచ వాణిజ్యానికి అత్యంత కీలకమైన ‘హోర్ముజ్ జలసంధి’ అందరికీ మూసివేయలేదని క్లారిటీ ఇచ్చారు. కేవలం తమను అటాక్ చేస్తున్న శత్రు దేశాలైన అమెరికా, ఇజ్రాయెల్ నౌకలకు మాత్రమే ప్రవేశం లేదని, మిగిలిన దేశాల నౌకలు యధావిధిగా  రాకపోకలు సాగించవచ్చని స్పష్టం చేశారు.

ముదురుతున్న ఉద్రిక్తతలు
ఒకవైపు టెహ్రాన్‌లో ప్రభుత్వానికి మద్దతుగా భారీ ర్యాలీలు జరుగుతుండగా, మరోవైపు ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో ఇజ్రాయెల్‌తో పాటు కొన్ని గల్ఫ్ దేశాలపై దాడులు ముమ్మరం చేసింది. ఇక లెబనాన్‌లో పరిస్థితులు మరింత దారుణంగా మారాయి. దక్షిణ లెబనాన్‌లోని ఆరోగ్య కేంద్రంపై ఇజ్రాయెల్ జరిపిన దాడిలో 12 మంది వైద్య సిబ్బంది ప్రాణాలు కోల్పోవడం ఆందోళనకరంగా మారింది. 

ఇది కూడా చదవండి: ట్రంప్‌ విధ్వంసం: ‘క్రౌన్ జ్యువెల్’పై భీకర దాడి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement