
కోల్‌కతా: ఒలింపిక్ పతక విజేత, ప్రముఖ క్రీడా వైద్యుడు, బహుముఖ ప్రజ్ఞాశాలి డాక్టర్ వేస్ పేస్ అంత్యక్రియలు పూర్తయ్యాయి. పార్కిన్‌సన్స్ వ్యాధితో బాధపడ్డ 80 ఏళ్ల వేస్ గురువారం కన్నుమూయగా... ఆదివారం కోల్‌కతాలోని సెయింట్ థామస్ చర్చ్‌లో జరిగిన ఆయన అంత్యక్రియల్లో భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ, హాకీ ఇండియా (హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్ టిర్కీ సహా పలు క్రీడా రంగాల ప్రముఖులు పాల్గొన్నారు. భారత హాకీకి ఆయన చేసిన సేవలకు గుర్తుగా... వేస్ పార్థీవ దేహానికి యువ ఆటగాళ్లు హాకీ స్టిక్‌లతో వీడ్కోలు పలికారు.
ఈ సందర్భంగా వేస్ కుమారుడు లియాండర్ పేస్‌ను గంగూలీ ఓదార్చాడు. మాజీ క్రికెటర్ అరుణ్ లాల్, తృణముల్ కాంగ్రెస్ నేత డెరిక్ ఒబ్రియన్‌తో పాటు ఈస్ట్ బెంగాల్, మోహన్ బగాన్, హాకీ బెంగాల్, కోల్‌కతా క్రికెట్ క్లబ్, ఫుట్‌బాల్ క్లబ్‌ల ప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. 1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం గెలిచిన భారత హాకీ జట్టులో వేస్ సభ్యుడు కాగా... ఆటకు వీడ్కోలు పలికిన అనంతరం వైద్యుడిగా భారత క్రీడారంగానికి ఆయన ఎనలేని సేవలు అందించారు. బీసీసీఐ, ఆసియా క్రికెట్ కౌన్సిల్, అఖిల భారత ఫుట్‌బాల్ సంఘం, భారత ఒలింపిక్ సంఘం, భారత డేవిస్ కప్‌కు వేస్ వైద్య కన్సల్టెంట్‌గా పనిచేశారు.
వేస్ సేవలు వెలకట్టలేనివి: టిర్కీ
హాకీ, రగ్బీ, ఫుట్‌బాల్, టెన్నిస్ ఇలా అనేక క్రీడల్లో ప్రవేశం ఉన్న వేస్... ఆ తర్వాతి కాలంలో భారతీయ క్రీడా వైద్యానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలిచారు. ‘వేస్ పేస్ లోటు పూడ్చలేనిది. ఆటతో సంబంధం లేకుండా భారతీయ క్రీడారంగానికి ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. ప్లేయర్‌గా, డాక్టర్‌గా, మెంటార్‌గా, కన్సల్టెంట్‌గా, క్రీడా పరిపాలకుడిగా ఆయన జీవితంలో ఎన్నో విభిన్న పాత్రలు పోషించారు. జాతీయ శిబిరాల సమయంలో ఆయన ఎలాంటి పారితోషికం తీసుకోకుండా ప్లేయర్లతో పాటే ఉండి వారి బాగోగులు చూసుకునేవారు.
2004 ఎథెన్స్ ఒలింపిక్స్ సమయంలో ఆయన సేవలను దగ్గర నుంచి చూశా. ప్రస్తుతం క్రీడా రంగంలో వైద్యుల ప్రాధన్యత పెరిగింది. అవేవీ లేని సమయంలో ఆయనే అన్నీ అయి నడిపించారు’ అని టిర్కీ గుర్తుచేసుకున్నాడు. వేస్‌ది పూర్తి స్పోర్ట్స్ ఫ్యామిలీ అని... ఒకే కుటుంబం నుంచి వీస్ హాకీలో ఒలింపిక్స్ పతకం నెగ్గితే ఆయన కుమారుడు లియాండర్ పేస్ టెన్నిస్‌లో ఆ కల తీర్చుకున్నాడని.. వేస్ భార్య జెన్నిఫర్ భారత బాస్కెట్‌బాల్ జట్టుకు కెపె్టన్‌గా వ్యవహరించారని టిర్కీ గుర్తు చేశాడు.