బంగ్లాదేశ్ మాజీ ప్రధాని ఖలీదా జియా అంత్యక్రియలకు భారత విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్ హాజరుకానున్నారు. ఈ మేరకు భారత విదేశాంగ శాఖ ప్రకటన విడుదల చేసింది. డిసెంబర్ 31న ఢాకాలో జరిగే ఖలీదా అంత్యక్రియలలో పాల్గొనడానికి జయశంకర్ బంగ్లాదేశ్ వెళ్లనున్నట్లు తెలిపింది.
బంగ్లాదేశ్ తొలిమహిళా ప్రధానిగా సేవలందించిన ఖలీదా జియా ఈరోజు ఉదయం ఎవర్ కేర్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందారు. 80 ఏళ్ల వయసున్న ఖలీదా జియా నవంబర్ 23న ఊపిరితిత్తుల ఇన్ఫ్‌క్షన్‌తో ఆసుపత్రిలో చేరారు. అయితే ఆమె మృతిపట్ల భారత ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు. బంగ్లాదేశ్ అభివృద్ధితో పాటు భారత్‌తో సంబంధాలు మెరుగుపడడం కోసం ఆమె చేసిన కృషి ఎల్లకాలం గుర్తుండిపోతుందని మోదీ ఎక్స్ ఖాతాలో రాసుకొచ్చారు.
ప్రస్తుతం భారత్-బంగ్లాదేశ్ మధ్య సంబంధాలు మెరుగ్గా లేవు. బంగ్లాలో రాజకీయ అస్థితరతతో ఈ ఏడాది ప్రారంభం నుంచే హిందువులపై దాడులు తీవ్రతరమయ్యాయి. వారం రోజుల వ్యవధిలో దాదాపు ముగ్గురు హిందూ యువకులను అక్కడి మతఛాందస వాదులు కొట్టిచంపారు. ఈ నేపథ్యంలో భారత్ సైతం ఈ ఘటనలపై సీరియస్ అయ్యింది. అయితే ఈ నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ మంత్రి బంగ్లాదేశ్ వెళ్లడం చర్చనీయాంశమయ్యింది.
ఖలీదా జియా ప్రస్థానం
1945లో అవిభక్త భారత్‌లోని పశ్చిమ బెంగాల్‌లో ఖలీదా జియా జన్మించింది. ఆమె వివాహం జియావుర్ రహమాన్‌తో (బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షుడు) జరిగింది. రహమాన్ మరణానంతరం సుధీర్ఘ కాలం పాటు బీఎన్పీ అధ్యక్షురాలిగా సేవలంధించింది. 1991లో బంగ్లాదేశ్ ప్రధానిగా తొలిసారి ఖలీదా జియా బాధ్యతలు చేపట్టింది. ఆ దేశంలో మహిళ ప్రధాని పదవి చేపట్టడం అదే మెుదలు. కాగా బీఎన్పీ పార్టీ భారత్‌కు వ్యతిరేకమని వాదనలుండగా ఖలీదా జియా వాటిని పలుమార్లు ఖండించింది.


