జియాకు కన్నీటి వీడ్కోలు  | Jaishankar attended Khaleda Zia funeral | Sakshi
Sakshi News home page

జియాకు కన్నీటి వీడ్కోలు 

Dec 31 2025 3:56 PM | Updated on Jan 1 2026 5:22 AM

Jaishankar attended Khaleda Zia funeral

ఢాకాలో బేగం ఖలీదా జియా అంత్యక్రియలు పూర్తి 

ఢాకా: దశాబ్దకాలంపాటు బంగ్లాదేశ్‌ను పరిపాలించిన ఆ దేశ మాజీ మహిళా ప్రధానమంత్రి బేగం ఖలీదా జియాకు వేలాది మంది అభిమానులు కన్నీటి వీడ్కోలు పలికారు. బుధవారం ఢాకా నగరంలోని దేశ మాజీ అధ్యక్షుడు, ఆమె భర్త, దివంగత జియావుర్‌ రహ్మాన్‌ సమాధి పక్కనే జియా పారి్ధవదేహాన్ని ఖననంచేశారు. మూడు సార్లు ప్రధాని పగ్గాలు చేపట్టి బంగ్లాదేశ్‌ రాజకీయాల్లో కీలక భూమిక పోషించిన 80 ఏళ్ల జియా మంగళవారం పలు దీర్ఘకాలిక వ్యాధుల కారణంగా ఆస్పత్రిలో కన్నుమూయడం తెల్సిందే. 

బుధవారం ఢాకాలోని మాణిక్‌ మియా అవెన్యూ సమీపంలోని షేర్‌–ఎ–బంగ్లా నగర్‌లోని శ్మశానవాటికలో పూర్తి అధికారిక లాంఛనాలతో జియా అంత్యక్రియలను సాయంత్రం 4.30 గంటలకు మొహమ్మద్‌ యూనుస్‌ తాత్కాలిక ప్రభుత్వం పూర్తిచేసింది. తొలుత బంగ్లాదేశ్‌ నేషనలిస్ట్‌ పారీ్ట(బీఎనీ్ప) కార్యకర్తలు, వేలాది మంది అభిమానుల సందర్శనార్థం జియా పార్థివదేహాన్ని జాతీయ సంసద్‌ భవన్‌(పార్లమెంట్‌) సమీప మాణిక్‌ మియా అవెన్యూలో ఉంచారు. జియా మృతదేహంపై బంగ్లాదేశ్‌ జాతీయజెండాను కప్పారు. 

అక్కడే మధ్యాహ్నం రెండో నమాజు ‘జుహుర్‌’తర్వాత అంత్యక్రియల సంబంధ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. బైతుల్‌ మొకర్రం జాతీయ మసీదు ప్రధాన మతాధికారి మొహమ్మద్‌ అబ్దుల్‌ ఖాదర్‌ ఆధ్వర్యంలో ఈ ప్రార్థనలు జరిగాయి. గడ్డకట్టించే చలిని సైతం లెక్కచేయకుండా సుదూరాల నుంచి సైతం జియా అభిమానులు కడసారి ఆమెను చూసేందుకు తరలివచ్చారు. దీంతో పార్లమెంట్‌ చుట్టూతా ఉన్న రహదారులన్నీ బీఎన్పీ కార్యకర్తలు, అభిమానులతో జనసంద్రంగా మారాయి. 

రోడ్లమీదనే జియా కోసం ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జియా ఫొటోలున్న భారీ ప్లకార్డులను చేతబూని ఆమె దేశానికి చేసిన సేవను గుర్తుచేసుకున్నారు. తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు మొహమ్మద్‌ యూనుస్, చీఫ్‌ జస్టిస్‌ జుబేయర్‌ రహ్మాన్‌ చౌదరి, బేగం జియా కుమారుడు, బీఎన్పీ తాత్కాలిక చైర్మన్‌ తారిఖ్‌ రెహ్మాన్, పలు దేశాల ప్రత్యేక ప్రతినిధులు, రాయబారులు, హైకమిషనర్లు, అంతర్జాతీయ సంస్థల చీఫ్‌లు ఈ ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్నారు. భారత విదేశాంగ మంత్రి ఎస్‌.జైశంకర్‌ హాజరై జియా కుమారుడికి ప్రధాని మోదీ తరఫున సంతాప లేఖను అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement