ఏపీ ఆర్చర్ రాటుదేలేందుకు పథకం తోడ్పాటు
ఇకపై కాంపౌండ్ ఆర్చర్లకు చేయూత
‘టాప్స్’ నుంచి డోపీ రితిక అవుట్
‘టాగ్’లోకి గోల్ఫర్లు
న్యూఢిల్లీ: టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్)లో కొత్తగా కాంపౌండ్ ఆర్చర్లను చేర్చారు. దీంతో ఎన్నో ఏళ్లుగా అంతర్జాతీయ ఆర్చరీ పోటీల్లో భారత్‌కు పతకాలు తెచి్చపెడుతున్న తెలుగుతేజం, ఆంధ్రప్రదేశ్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖకు ఇది కొత్త ఉత్సాహం ఇవ్వనుంది. భారత్ నుంచి ఒలింపిక్ పతక విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా కేంద్ర క్రీడామంత్రిత్వ శాఖ ‘టాప్స్’ ద్వారా చేయూత ఇస్తోంది.
అయితే ఇన్నాళ్లు ఒలింపిక్ క్రీడాంశాలకే ‘టాప్స్’ను అమలు చేస్తూ వచ్చారు. దీంతో ఒలింపిక్స్‌లో లేని కాంపౌండ్ కేటగిరీకి ‘టాప్స్’ను ఇవ్వడం లేదు. దీనివల్ల ప్రపంచ ఆర్చరీ పోటీల్లో దేశానికి, రాష్ట్రానికి పతక ప్రతిష్టలు తెస్తున్న జ్యోతి సురేఖ, పర్‌నీత్ కౌర్, అభిõÙక్ వర్మలాంటి వారు దూరమయ్యారు. తాజాగా క్రీడామంత్రిత్వ శాఖ నిర్ణయంతో ఒలింపిక్ ఈవెంట్‌తో సంబంధం లేకపోయినా 8 మంది కాంపౌండ్ ఆర్చర్లకు లబ్ధి చేకూరనుంది.
మరో తెలుగుతేజం రికర్వ్ ఆర్చర్ ధీరజ్ బొమ్మదేవర ఇప్పటికే ఈ పథకంలో ఉన్నాడు. డోపింగ్‌లో పట్టుబడిన మహిళా రెజ్లర్ రితిక హుడాను ‘టాప్స్’ నుంచి తొలగించారు. 2024–పారిస్ ఒలింపిక్స్ కోసం 179 మందికి ‘టాప్స్’ను అమలు చేశారు. ప్రదర్శన, వైఫల్యం, డోపింగ్ కారణాలతో గతేడాది నాటికి 179 జాబితా కాస్తా 94 మందికి పడిపోయింది. ఈ ఏడాది మొదలవుతుండగానే ‘టాప్స్’ కోర్ గ్రూప్ జాబితాను 118 మందికి పెంచారు.
ఇందులో 57 మంది అథ్లెట్లు కాగా, మరో 61 మంది పారాథ్లెట్లు ఉన్నారు. క్రీడాశాఖ ప్రత్యేక డెవలప్‌మెంట్ గ్రూప్ జాబితాలో అథ్లెట్లు అనిమేశ్ కుజుర్ (200 మీ. పరుగు), తేజస్విన్ శంకర్ (డెకథ్లాన్), 4–400 మీ. రిలే జట్టు సభ్యులు విశాల్, జయ్ కుమార్, రాజేశ్ రమేశ్, అమోజ్ జాకబ్, మొహమ్మద్ అజ్మల్, సంతోష్ కుమార్‌లు ఉన్నారు. ఈ గ్రూప్‌లోనే టేబుల్ టెన్నిస్ ప్లేయర్లు మానుశ్ షా, మానవ్ ఠక్కర్, దియా చిటాలేలకు చోటుదక్కింది.
‘టాగ్’లో కొత్తగా గోల్ఫ్, సర్ఫింగ్
టార్గెట్ ఆసియా క్రీడల గ్రూప్ (టీఏజీజీ–టాగ్)లో కొత్తగా లబ్దిపొందే క్రీడాంశాలను పెంచారు. ‘టాప్స్’లో లేని గోల్ఫ్, సర్ఫింగ్, టెన్నిస్ క్రీడాకారులకు ‘టాగ్’ కింద చేయూత అందిస్తారు. ఈ ఏడాది జపాన్‌లో ఏషియాడ్ జరుగనుంది. ఈ ఆసియా క్రీడల్లో పతకాలు తేవాలనే ఉద్దేశంతో గోల్ఫర్లు శుభాంకర్ శర్మ, దీక్ష డాగర్, టెన్నిస్ ప్లేయర్లు సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ, మాయ రాజేశ్వరన్ సహా 48 మందిని ‘టాగ్’ పథకం కింద ఎంపిక చేశారు.
ఇందులో ఇప్పటికే ఈక్వె్రస్టియన్స్ (గుర్రపుస్వారీ) ఫౌద్ మీర్జా, అనుశ్ అగర్‌వాలా, ఫెన్సర్ భవానీ దేవి, జిమ్నాస్ట్ ప్రణతి నాయక్ తదితరులు ఉన్నారు. ‘టాప్స్’, ‘టాగ్’ పథకాల కింద కోచింగ్, ఇతరాత్ర ఖర్చుల కింద నెలకు రూ. 50 వేలు చొప్పున ఆర్థిక సాయం చేస్తారు. అవసరమైతే మరో రూ. 25 వేలు పాకెట్ అలవెన్స్‌గా అందజేస్తారు. అలాగే విదేశీ శిక్షణలో ఉన్నన్ని రోజులు రోజుకు రూ. 2250 (25 డాలర్లు) అదనంగా ఇస్తారు. అయితే విదేశీ శిక్షణకు ముందుగా ఆమోదం పొందాల్సివుంటుంది.


