
అరుదైన ప్రతిభ : శీతల్ దేవి
ఫేమస్ బ్రాండ్లకు ఫేవరెట్ స్టార్ : అనన్య పాండే
‘రెండు చేతులు లేవు కదా... విల్లు ఎలా పడతావు?’ అని అడిగారు. ఆ ప్రశ్నకు తన విల్‌పవర్‌తోనే సమాధానం చెప్పిన శీతల్ దేవి ఆర్చర్‌గా అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తోంది.
స్కూల్ రోజుల నుంచి వెటకారాలు ఎదుర్కొన్న అనన్య పాండే చిత్రసీమలోకి అడుగు పెట్టిన తరువాత ట్రోలింగ్ బారిన పడింది. ఆ వెటకారాలకు తన పనితీరుతోనే సమాధానం చెప్పిన అనన్య పాండే ప్రస్తుతం ఆసియాలోని ప్రసిద్ధ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్. ‘ఫోర్బ్స్ 30 అండర్ 30 ఆసియా 2025’ జాబితాలో చోటు సాధించిన శీతల్‌దేవి, అనన్య పాండేల గురించి...
‘విజేతలు తమ దగ్గర లేని వాటి గురించి ఆలోచించరు. ఉన్నదాన్ని గురించే ఆలోచిస్తారు. దాంట్లో నుంచే శక్తి పుట్టిస్తారు’ అవును. జమ్ముకశ్మీర్‌కు చెందిన శీతల్‌కు ఫోకోమేలియా అనే అరుదైన వ్యాధి కారణంగా రెండు చేతులు లేవు. కిస్తావర్‌లోని తన గ్రామంలో మేకలు కాసేది. శీతల్‌కు రెండు చేతులు లేకపోవచ్చు. అయితే అసాధారణమైన చురుకుదనం ఉంది. ఆ చురుకుదనమే భారత సైన్యం నిర్వహించిన ఆటల పోటీల్లో పాల్గొనేలా చేసింది.
ఆ ఆటల్లో ఆర్చరీ శీతల్‌ను బాగా ఆకట్టుకుంది. ‘ఆర్చర్ కావాలనుకుంటున్నాను’ అన్నప్పుడు...‘రెండు చేతులు లేవు కదా...అది ఎలా సాధ్యం?’ అన్నారు అక్కడ ఉన్నవాళ్లు. తన కాళ్ల వైపు చూసింది. అవును... తన కాళ్లనే చేతులుగా మలుచుకొని చిన్న పల్లె, జిల్లా, రాష్ట్రం దాటి అంతర్జాతీయ స్థాయిలో ఆర్చరీలో ఎన్నో అద్భుత విజయాలు సాధించింది. పారాలింపిక్ మెడలిస్ట్‌గా చరిత్ర సృష్టించింది ఆర్చర్ శీతల్ దేవి.
‘ఆర్చరీ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. ఆర్చరీకి ముందు నేనెవరో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మన దేశంలో ఎంతోమందికి నేను తెలుసు. ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి స్ఫూర్తి పొందుతున్న వాళ్లను చూస్తే సంతోషంగా ఉంది’ అంటుంది స్టార్ ఆర్చర్ శీతల్‌దేవి.
ఆర్చరీలోలో ఎంతోమందిని చూసి స్ఫూర్తి పొందాను. ఇప్పుడు నన్ను చూసి పొందుతున్న వాళ్లను చూసి సంతోషంగా ఉంది
జేమ్స్ ‘బ్రాండ్’
‘వెక్కిరింపులు, వెటకారాలకు తల ఒగ్గితే ఎప్పటికీ తల ఎత్తలేవు’ స్కూల్ రోజుల్లో అనన్య పాండేను తోటి పిల్లలు ‘టూత్‌పిక్ లెగ్స్’ ‘ఫ్లాట్ స్క్రీన్’లాంటి నిక్‌నేమ్‌లతో వెక్కిరించేవాళ్లు. సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఆమె పేరు ముందు ‘గ్లామర్ డాల్’ అనే విశేషణం తప్పనిసరిగా ఉండేది. ‘నెపో బేబీ’ అని కూడా అంటుండేవారు. సోషల్ మీడియాలో ట్రోలింగ్ సరే సరి.
నటనకు సంబంధించిన విమర్శలు కూడా వచ్చేవి. సినిమాలకు ముందు పాండే ఏ ఫిల్మ్ స్కూల్‌లో చేరలేదు. చిన్నప్పుడు సినిమా సెట్స్‌కు వెళ్లింది కూడా లేదు. నిర్మాణాత్మక విమర్శలు వినబడిన తరువాత మాత్రం తన నటనను మరింత మెరుగుపరుచుకోవడంపై దృష్టి పెట్టింది. ‘అనన్య నటన అద్భుతం’ అనే ప్రశంస వినిపించడానికి ఎంతో కాలం పట్టలేదు.
వెటకారాలు, విమర్శలకు బాధ పడి ఉంటే....అనన్య పాండే ఎక్కడో ఆగిపోయేది. ‘విమర్శలు, వెటకారాలను సీరియస్‌గా తీసుకుంటే అది మోయలేనంత భారం అవుతుంది. ఆ భారం మనల్ని ముందుకు వెళ్లకుండా నిలువరిస్తుంది’ అంటుంది అనన్య పాండే.
‘మొదట్లో తన ప్రత్యేకత కనిపించేది కాదు. ఎందుకంటే గతంలో ఎంతోమంది చేసిన పాత్రలే అనన్య పాండే చేసింది. కానీ ఇప్పుడు అలా కాదు. తాను మాత్రమే చేయగలిగే పాత్రలు చేస్తోంది’ అంటుంది ఫిలిమ్ క్రిటిక్ అనుపమ చోప్రా ఇప్పుడు ఫేమస్ బ్రాండ్‌లకు పాండే ఫేవరెట్ స్టార్ అయింది. ఫ్రెంచ్ ఫ్యాషన్ హౌజ్ ‘చానల్’, నెట్‌ఫ్లిక్స్, మాస్ ఓరియెంటెడ్ ‘స్కెచర్’కు మన దేశం నుంచి తొలి బ్రాండ్ అంబాసిడర్‌గా తన ప్రత్యేకతను చాటుకుంది. ప్రస్తుతం అనన్య పాండే దక్షిణ ఆసియాలోని ఎన్నో లగ్జరీ బ్రాండ్‌లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉంది.