
మాడ్రిడ్: ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆర్చర్ వెన్నం జ్యోతి సురేఖ ప్రపంచకప్‌లో ‘హ్యాట్రిక్’ పతకాలు సాధించింది. అయితే కాంపౌండ్‌లో తృటిలో రెండు స్వర్ణావకాశాల్ని చేజార్చుకుంది. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత, టీమ్ విభాగాల్లో ఒక్కో రజతం, మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో కాంస్యం గెలుచుకుంది. కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో జ్యోతి 147–148తో ఎలా గిబ్సన్ (బ్రిటన్) చేతిలో పాయింట్ తేడాతో ఓడి రజతంతో తృప్తి పడింది.
మరో కాంపౌండ్ టీమ్ ఈవెంట్ స్వర్ణ పతక పోరులో జ్యోతి, పర్ణిత్ కౌర్, ప్రీతికలతో కూడిన భారత జట్టు 225–227తో చైనీస్ తైపీకి చెందిన హువంగ్ జౌ, చెన్ యి సున్, చియు యు ఎర్ చేతిలో పరాజయం చవిచూసింది. మొదట 57–57తో తైపీ త్రయాన్ని నిలువరించిన భారత జట్టు... 58–56తో, 55–56తో మూడు రౌండ్లు ముగిసేసరికి 170–169తో ఆధిక్యంలో నిలిచింది.
కానీ ఆఖరి నాలుగో రౌండ్లో గురి కుదరక రజతంతో సరిపెట్టుకుంది. మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ కాంస్య పతక పోరులో జ్యోతి సురేఖ (ఏపీ)–రిషభ్ యాదవ్ (హరియాణా) జోడీ 156–153తో పాలొ కొరాడో–డగ్లస్ నొలాస్కో (ఎల్ సాల్వడోర్) జంటపై గెలిచింది.