
ఆర్చరీ ప్రపంచకప్‌లో 5 పతకాలు కైవసం
రజతం నెగ్గిన జట్టులో సురేఖ, చికిత
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్‌లో భారత కాంపౌండ్ ఆర్చర్లు 5 పతకాలతో సత్తాచాటారు. వ్యక్తిగత విభాగంలో మధుర స్వర్ణ పతకంతో మెరిసింది. దీంతో ఈ టోర్నీలో భారత ఆర్చర్లకు మొత్తంగా 2 స్వర్ణాలు, ఒక రజతం, 2 కాంస్యాలు దక్కాయి. మహిళల కాంపౌండ్ వ్యక్తిగత ఫైనల్లో మధుర 139–138తో కార్సన్ (అమెరికా)పై గెలుపొందింది. మహారాష్ట్రకు చెందిన 24 ఏళ్ల మధుర ఈ టోర్నీలో ఓవరాల్‌గా మూడు పతకాలు గెలుచుకుంది.
వ్యక్తిగత విభాగంలో పసిడి నెగ్గిన మధుర... టీమ్ ఈవెంట్‌లో రజతం, మిక్స్‌డ్ విభాగంలో కాంస్యం గెలిచిన జట్లలో కూడా సభ్యురాలు. ఫైనల్లో మొదట ‘పర్‌ఫెక్ట్ 30’ పాయింట్లు సాధించిన మధుర ఆ తర్వాత ఆకట్టుకోలేకపోయింది. ఒకదశలో వరుసగా రెండు సార్లు 8 పాయింట్లతో పాటు ఒకసారి 7 పాయింట్లు ఖాతాలో వేసుకొని 81–85తో వెనుకంజలో పడింది. తర్వాతి రౌండ్‌లో మెరుగైన ప్రదర్శనతో స్కోరును 110–110తో సమం చేసి... అదే జోరు కొనసాగిస్తూ పసిడి ఖాతాలో వేసుకుంది.
అంతకుముందు కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌లో భారత పురుషుల జట్టు స్వర్ణం గెలుచుకుంది. అభిషేక్ వర్మ, రిషభ్ యాదవ్, ఓజస్ ప్రవీణ దేవ్‌తలేలతో కూడిన భారత పురుషుల జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో 232–228 పాయింట్ల తేడాతో మెక్సికో జట్టుపై గెలుపొందింది. ఇక పురుషుల వ్యక్తిగత విభాగంలో 22 ఏళ్ల రిషభ్ యాదవ్ కాంస్య పతకంతో మెరిశాడు. షూటాఫ్‌లో అతడు దక్షిణ కొరియా ఆర్చర్‌పై విజయం సాధించాడు. వెన్నం జ్యోతి సురేఖ (ఆంధ్రప్రదేశ్), తనిపర్తి చికిత (తెలంగాణ), మధుర (మహారాష్ట్ర) లతో కూడిన భారత మహిళల కాంపౌండ్ జట్టు రజత పతకం చేజిక్కించుకుంది.
ఆదివారం జరిగిన ఫైనల్లో సురేఖ, చికిత, మధుర త్రయం. 221–234తో మెక్సికో జట్టు చేతిలో ఓడింది. ఇక మిక్స్‌డ్ టీమ్ విభాగంలో మధుర–అభిõÙక్ వర్మ జంట కాంస్యం గెలుచుకుంది. కాంస్య పతక పోరులో భారత జోడీ 144–142 పాయింట్ల తేడాతో ఫాటిన్ నూర్‌ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)పై గెలుపొందింది. తాజా ప్రదర్శనతో భారత కాంపౌండ్ జట్టు భవిష్యత్తుపై మరిన్ని అంచనాలు పెరుగుతున్నాయి. తొలి సారి 2028 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌లో ఆర్చరీ కాంపౌండ్ టీమ్ ఈవెంట్‌ను ప్రవేశపెడుతున్నారు. ఇదే జోరు కొనసాగిస్తే మనకు ఒలింపిక్స్‌కు పతకం సాధించేందుకు మంచి అవకాశం ఉంది.