
సెమీస్‌లో దీపిక కుమారి, పార్థ్ సాలుంఖే
కాంస్యం బరిలో అభిషేక్ వర్మ–మధుర జోడీ
షాంఘై: ప్రపంచకప్ ఆర్చరీ స్టేజ్–2 టోర్నమెంట్‌లో భారత ఆర్చర్లు మూడు విజయాలు సాధిస్తే మూడు పతకాలను ఖరారు చేసుకుంటారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ విభాగంలో అభిషేక్ వర్మ (ఢిల్లీ)–మధుర (మహారాష్ట్ర) జోడీ కాంస్య పతకం కోసం పోటీపడనుండగా... మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో దీపిక కుమారి... పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో పార్థ్ సాలుంఖే సెమీఫైనల్లోకి దూసుకెళ్లారు.
సెమీఫైనల్లో గెలిస్తే దీపిక, పార్థ్ స్వర్ణ, రజత పతకాల కోసం రేసులో నిలుస్తారు. సెమీఫైనల్లో ఓడిపోతే కాంస్య పతకం కోసం పోటీపడతారు. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్ సెమీఫైనల్లో అభిషేక్–మధుర ద్వయం 156–158తో ఎల్లా గిబ్సన్–అజయ్ స్కాట్ (బ్రిటన్) జంట చేతిలో ఓడిపోయింది. నేడు జరిగే కాంస్య పతక మ్యాచ్‌లో ఫాటిన్ నూర్‌ఫతే–మొహమ్మద్ జువైదీ (అమెరికా)లతో అభిషేక్, మధుర తలపడతారు.
పురుషుల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ఒలింపియన్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ ధీరజ్ బొమ్మదేవర, తరుణ్‌దీప్ రాయ్ తొలి రౌండ్‌లో, అతాను దాస్ క్వార్టర్ ఫైనల్లో ని్రష్కమించారు. ధీరజ్ 5–6తో అబ్దుల్లా (టర్కీ) చేతిలో, తరుణ్‌దీప్ 5–6తో తెత్సుయ (జపాన్) చేతిలో, అతాను దాస్ 2–6తో కిమ్ వూజిన్ (కొరియా) చేతిలో ఓడిపోయారు. పార్థ్ సాలుంఖే తొలి రౌండ్‌లో 6–5తో 2020 టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత మెటీ గాజోజ్ (టర్కీ)పై, రెండో రౌండ్‌లో 6–5తో తెత్సుయ (జపాన్)పై, మూడో రౌండ్‌లో 6–2తో రియాన్ ట్యాక్ (ఆస్ట్రేలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో కిమ్
జె డియోక్ (కొరియా)పై గెలుపొందాడు.
మహిళల రికర్వ్ వ్యక్తిగత విభాగంలో ‘ట్రిపుల్ ఒలింపియన్’ దీపిక కుమారి తొలి రౌండ్‌లో 6–4తో లూసియా (స్పెయిన్)పై, రెండో రౌండ్‌లో 6–0తో డయానా (కజకిస్తాన్)పై, మూడో రౌండ్‌లో 6–4తో విక్టోరియా (ఫ్రాన్స్)పై, క్వార్టర్ ఫైనల్లో 6–2తో లీ జియామన్ (చైనా)పై విజయం సాధించింది. భారత్‌కే చెందిన అంకిత మూడో రౌండ్‌లో 3–7తో లిమ్ సిహైన్ (కొరియా) చేతిలో, అన్షిక తొలి రౌండ్‌లో 5–6తో ఎలీసా టార్ట్‌లెర్ (జర్మనీ) చేతిలో, సిమ్రన్‌జిత్ తొలి రౌండ్‌లో 3–7తో యుహెరా రుకా (జపాన్) చేతిలో ఓటమి చవిచూశారు.