
అహ్మదాబాద్: ఆసియా అక్వాటిక్స్ చాంపియన్‌షిప్ పోటీలను భారత్ 13 పతకాలతో ముగించింది. ఓవరాల్‌గా తొమ్మిదో స్థానంలో నిలిచిన భారత్‌కు నాలుగు రజతాలు, తొమ్మిది కాంస్యాలు లభించాయి. చివరిరోజు బుధవారం భారత్ ఖాతాలో నాలుగు కాంస్య పతకాలు చేరాయి. మహిళల 400 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో భవ్య సచ్‌దేవ (4ని:26.89 సెకన్లు) మూడో స్థానంలో నిలిచింది. పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ ఈవెంట్‌లో సజన్ ప్రకాశ్ (1ని:57.90 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నాడు.
పురుషుల 100 మీటర్ల బ్యాక్‌స్ట్రోక్‌లో శ్రీహరి నటరాజ్ (55.23 సెకన్లు) కాంస్య పతకాన్ని సాధించాడు. శ్రీహరి నటరాజ్, రోహిత్ బెనెడిక్షన్, థామస్ దురై, ఆకాశ్ మణిలతో కూడిన భారత బృందం పురుషుల 4్ఠ100 మీటర్ల రిలేలో మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని దక్కించుకుంది. ఓవరాల్‌గా ఈ టోర్నీలో శ్రీహరి ఏకంగా ఏడు పతకాలు సాధించడం విశేషం. చైనా 49 పతకాలతో ‘టాప్’ ర్యాంక్‌ను అందుకోగా... 18 పతకాలతో జపాన్ రెండో స్థానంలో నిలిచింది.