ఢాకా: బంగ్లాదేశ్ చీఫ్ అడ్వైజర్ ముహమ్మద్ యూనస్ శనివారం రాడికల్ నేతగా పేరున్న షరీఫ్ ఒస్మాన్ హాది అంత్యక్రియల్లో పాల్గొన్నారు. హాది ఆలోచనలు, సిద్ధాంతాలను తరతరాలకు కొనసాగిస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. గత వారం గుర్తుతెలియని దుండగుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడి మరణించిన హాదికి వేలాదిమంది నివాళులు అర్పించారు.
అంత్యక్రియల సందర్భంగా యూనస్ మాట్లాడుతూ.. ఇది వీడ్కోలు కాదు, ఒక ప్రతిజ్ఞ. హాది మాకు చెప్పిన మాటలను మేం నెరవేరుస్తాం. మా తరాలే కాదు, రాబోయే తరాలూ ఈ వాగ్దానాన్ని కొనసాగిస్తాయి. హాది ప్రజలతో మమేకమయ్యే తీరును, రాజకీయ దృక్పథాన్ని యూనస్ ప్రశంసించారు. ఆయన మానవత్వం, జీవన విధానం, రాజకీయ ఆలోచనలను దేశం ఎప్పటికీ మర్చిపోవని పేర్కొన్నారు.
ప్రపంచం ముందు తల ఎత్తుకుని నడుస్తాం. ఎవరి ముందూ తలవంచం అని యూనస్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో పాల్గొనాలన్న హాది ఆశయాన్ని యూనస్ గుర్తు చేశారు.ఎన్నికల ప్రచారం ఎలా ఉండాలో ఆయన చూపిన మార్గాన్ని తాము స్వీకరించామని తెలిపారు. హాది ఇచ్చిన స్పూర్తి ప్రజాజీవితంలో సజీవంగా కొనసాగుతుందని చెప్పారు.
32 ఏళ్ల హాది బంగ్లాదేశ్‌లో 2024 విద్యార్థి ఉద్యమ సమయంలో వెలుగులోకి వచ్చాడు. అప్పటి ప్రధాని షేక్ హసీనా అధికారం కోల్పోవడానికి దారితీసిన ఆ ఉద్యమంలో ఆయన కీలకంగా వ్యవహరించారని చెబుతారు. ఇండియా వ్యతిరేక వ్యాఖ్యలతో హాది గుర్తింపు పొందాడు. ఢాకాలో తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సమయంలో ఆయనపై జరిగిన కాల్పులకు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ నేపధ్యంలో సింగపూర్‌లో చికిత్స పొందుతూ హాది మృతి చెందాడు.
ఈ ఘటనలో అనుమానితులను గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. వారు భారత్‌కు పారిపోయి ఉండవచ్చని ఆరోపణలు వచ్చాయి. దాంతో న్యూఢిల్లీ–ఢాకా మధ్య దౌత్య ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. హాది మరణం తర్వాత ఢాకా సహా పలు నగరాల్లో భారీ నిరసనలు చెలరేగాయి. నిందితులను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు.ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. కొన్ని చోట్ల భవనాలకు నిప్పు పెట్టడంతో అక్కడి సిబ్బంది చిక్కుకుపోయిన ఘటనలు కూడా జరిగాయి.


